himachal pradesh assembly elections
-
ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో స్పెషల్! ఎందుకంటే..
సిమ్లా: కాంగ్రెస్-బీజేపీలకు చెరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు.. ఈసారి ఎవరికి పట్టం కడతారనే చర్చ జోరుందుకుంది. శనివారం హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ నేపథ్యంలో.. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలంతా ఓటేయాలంటూ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ వేళ.. ఓ బూత్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కేవలం 52 మంది ఓటర్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారక్కడ. అందుకు ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. తషిగ్యాంగ్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్ కేంద్రం. అందుకే ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. లాహౌల్ & స్పితి పరిధిలోని తషిగ్యాంగ్‌లో దాదాపు 15, 256 ఫీట్ల ఎత్తులో ఉండే ఇక్కడ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. వృద్ధులకు, దివ్యాంగుల కోసం మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారిక్కడ. వందకు వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలని భావిస్తున్నారు ఇక్కడ. Tashigang (Lahaul&Spiti ), has world’s highest polling station at 15,256 ft & 52 registered voters, is set to retain its record of 100% voter turnout in the Nov 12 assembly election. It has been made Model Polling station to make voting easy for senior citizens & disabled voters. pic.twitter.com/SJcw86Z3lL — CEO Himachal (@hpelection) November 12, 2022 ఇక హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 55 లక్షల ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 412 మంది అభ్యర్థులు.. 68 నిజయోకవర్గాల్లో పోటీ పడుతున్నారు. ఒకవైపు తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ, మరోవైపు మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక ఈ మధ్యలో ఆప్ వచ్చి చేరింది. డిసెంబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. -
‘డబుల్ ఇంజన్’కు అగ్నిపరీక్ష
సాధారణంగా ప్రశాంతంగా సాగే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మాత్రం అక్షరాలా యుద్ధాన్నే తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ ‘డబుల్ ఇంజన్’ నినాదానికి అగ్నిపరీక్షగా మారాయి. అంతేగాక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల ప్రతిష్టకూ సవాలుగా పరిణమించాయి. మోదీ కరిష్మాతో అధికారం నిలబెట్టుకుంటామని కమలనాథులు ఆశిస్తుండగా ప్రభుత్వ వ్యతిరేకతే గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. 1985 నుంచి రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని రివాజు ఈసారీ కొనసాగుతుందని ఆశిస్తోంది. మూడో పార్టీగా ఆప్ ఉనికి పోటీని మరింత సంక్లిష్టంగా మార్చేసింది. అన్ని పార్టీలూ హోరాహోరీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ రెండుసార్లే ప్రచారం చేసినా రాష్ట్రమంతా కలియదిరిగారు. రాహుల్‌గాంధీ కూడా భారత్ జోడో యాత్రకు బ్రేకి చ్చి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉద్యోగుల్లోనూ అసంతృప్తి మోదీ వ్యక్తిగత ఆకర్షణకు తిరుగు లేకపోయినా కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వముంటే డబుల్ ఇంజన్ ప్రగతి సాధ్యమన్న బీజేపీ మాటలను హిమాచల్ జనాలు ఎంతవరకు నమ్ముతున్నారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీన్ని రాష్ట్ర ప్రజలు పెద్దగా నమ్మడం లేదని హిమాచల్‌కు చెందిన శశికుమార్ అనే రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు. ధరల పెరుగుదల మొదలుకుని ఏ సమస్యకూ గత ఐదేళ్లలో పరిష్కారం దొరికింది లేదన్నది వారి ఆరోపణగా ఉంది. దీనికి తోడు పాత పెన్షన్ స్కీం కోసం రెండు లక్షలకు పైగా ప్రభుత్వోద్యోగులు చేస్తున్న డిమాండ్ కూడా బీజేపీకి కాస్త ప్రతికూలమేనంటున్నారు. దీన్ని తనకు అనువుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రెబెల్స్‌ను కట్టడి చేయడంలో కమలనాథులు విఫలమవుతున్న తీరు విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా 24కు పైగా సీట్లలో వాళ్లు స్వతంత్రులుగా బరిలో దిగుతున్నారు. ఇది కూడా బీజేపీ విజయావకాశాలను బాగా దెబ్బ కొడుతుందన్నది కాంగ్రెస్ ఆశ. తమకు రెబెల్స్ బెడద మరీ అంతగా లేకపోవడం మరింత కలిసొచ్చే అంశమని పార్టీ నమ్ముతోంది. కాకలు తీరిన నాయకుడు వీరభద్రసింగ్ గత ఏడాది మరణించాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త బలహీనంగానే మారింది. సీఎం పోస్టుకు కనీసం అర డజను మంది పోటీదారులు ఉండటంతో ఇంటి పోరు నానాటికీ పెరిగిపోతోంది. ఆప్ కూడా రంగంలో ఉన్నా ప్రధానంగా రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అయితే గత ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఏకంగా 12 స్థానాల్లో నోటాదే మూడో స్థానం! ఈ ఓట్లన్నీ ఈసారి ఆప్ ఖాతాలోకి వెళ్లే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ పోటీ బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. కింగ్‌మేకర్ కాంగ్రా: కాంగ్రా జిల్లా మరోసారి కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం కన్పిస్తోంది. 1993 నుంచి ఈ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీయే అధికారం చేజిక్కించుకుంటూ వస్తోంది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలో 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లు, 2017 ఎన్నికల్లో బీజేపీ 11 గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ‘‘రెండు పార్టీలకూ ఇక్కడ అటూ ఇటుగా 40 శాతం చొప్పున ఓటు బ్యాంకుంది. 3 నుంచి 5 శాతం ఓట్లరు మాత్రమే ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఓటేస్తూ కీలకంగా మారుతున్నారు’’ అని హిమాచల్ వర్సిటీలో పొలిటికల్ ప్రొఫెసర్ హరీశ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. కాంగ్రాలో కులం చాలా ప్రభావం చూపుతుందన్నారాయన. మిగతా రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడా రాజ్‌పుత్‌లదే ప్రాబల్యం. జిల్లా జనాభాలో వారు 34 శాతముంటారు. 32 శాతమున్న ఓబీసీలు, 20 శాతమున్న బ్రాహ్మణులు కూడా ప్రభావం చూపుతారు. గద్దీ తదితర పర్వత ప్రాంతీయులది 14 శాతం వాటా. దాంతో బీజేపీ, కాంగ్రెస్ రెండూ రాజ్‌పుత్, గద్దీ నేతలకు ఎక్కువ టికెట్లిచ్చాయి. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తుండటం కలవరపెడుతోంది. ధరల పెరుగుదలపై జనంలో ఆగ్రహం ఉంది. అందుకే అభ్యర్థిని కాకుండా తనను చూసి ఓటేయాలని ప్రధాని ప్రచార సభల్లోనూ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వతంత్రులే కీలకం? ఈసారి 20కి పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్రులు నెగ్గారు. ఈసారి ఈ సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే చివరికి స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటును శాసించే శక్తిగా అవతరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం విన్పిస్తోంది. ఎన్నికల అంశంగా అగ్నిపథ్ రాష్ట్రంలో సగం అసెంబ్లీ సీట్లున్న కాంగ్రా, హమీర్పూర్, ఉనా, మండీ జిల్లాల్లో అగ్నిపథ్ పథకం పెద్ద ఎన్నికల అంశంగా మారింది. ఎందుకంటే ఈ నాలుగు జిల్లాల్లో ఏకంగా 1.3 లక్షల మంది మాజీ, 40 వేల మంది సర్వీసులో ఉన్న సైనికులున్నారు! అంటే ప్రతి మూడిళ్లకు ఒకరన్నమాట!! ఈ జిల్లాలకు ప్రధాన ఉపాధి వనరు సైన్యమే. ఈ నాలుగు జిల్లాల నుంచి ఏటా కనీసం 4 వేల మంది యువకులు సైన్యంలో చేరుతుంటారు. అగ్నిపథ్ రాకతో రెజిమెంట్‌వారీ భర్తీ విధానం రద్దవడంతో రాష్ట్రం నుంచి నియామకాలు మూడో వంతు తగ్గనున్నాయి. ఇది కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమవుతుందని కాంగ్రాకు చెందిన మేజర్ జనరల్ (రిటైర్డ్) రాణా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Himachal Pradesh assembly elections: హిమాచల్‌లో బీజేపీ తొలి జాబితా
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 62 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. కేబినెట్ మంత్రి మహేంద్రసింగ్‌తో పాటు 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపింది. అయితే మహేంద్రసింగ్ కుమారునికి టికెట్ దక్కింది. ఇద్దరు మంత్రుల స్థానాలు మార్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర అత్యున్నత నేతలతో కూడిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం జాబితాను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. సీఎం జైరాం ఠాకూర్ మళ్లీ సెరాజ్ అసెంబ్లీ స్థానం నుంచే బరిలో దిగుతున్నారు. మాజీ సీఎం, సీనియర్ నేత ప్రేమ్‌కుమార్ ధుమాల్ (78)కు టికెట్ దక్కలేదు. -
Himachal Pradesh Election 2022: మంచుకొండల్లో ఎన్నికల వేడి
హిమాచల్‌ప్రదేశ్. పర్యాటకులకు స్వర్గధామం. సాహస క్రీడలకు కేరాఫ్ అడ్రస్. రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల క్రీడ కూడా ఉత్కంఠ రేపుతోంది. మంచుకొండల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. దశాబ్దాలుగా ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని హిమాచల్ ఓటర్ల నాడి తెలుసుకోవడం ఈసారి కష్టంగా మారింది. ఆప్ రంగప్రవేశంతో ఓట్లు చీలి బీజేపీ అధికారం నిలబెట్టుకుని చరిత్ర సృష్టిస్తుందా, ఉప ఎన్నికల విజయోత్సాహాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందా అన్నది ఆసక్తి పెంచుతోంది... హిమాచల్ ప్రదేశ్‌తో దేశంలో ఎన్నికల జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టాయి. 68 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. చిన్న రాష్ట్రమే అయినా ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం 40 ఏళ్లుగా కొనసాగుతున్నందున ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. 2017లో 44 సీట్లు నెగ్గిన బీజేపీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఉప ఎన్నికలతో మారిన రాజకీయం గతేడాది రాష్ట్రంలో ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడంతో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలి అప్పటి నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రంపై బాగా దృష్టి సారించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ అ«భివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మనాలి–లేహ్‌లను కలిపే అటల్ టన్నల్ ప్రారంభంతో ప్రజల ఇబ్బందులు ఎంత తొలిగిపోయాయో విస్తృతంగా ప్రచా రం చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం జైరాం ఠాకూర్ కూడా నెల రోజుల్లోనే ఏకంగా రూ.4,000 కోట్లకు పైగా ప్రాజెక్టులు ప్రారంభించారు. నిరుద్యోగమే ఎన్నికలాంశం నిరుద్యోగమే ఈ ఎన్నికల్లో ప్రధానాంశం కానుంది. బీజేపీకి ఇదే సవాలుగా మారుతోంది. రాష్ట్రంలో 15 లక్షల నిరుద్యోగులున్నారు. వారికి ఉపాధి కల్పనలో బీజేపీ విఫలమైందంటూ కాంగ్రెస్ దుయ్యబడుతోంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు కూడా ప్రచారాంశంగా మారుతున్నాయి. అయితే మాజీ సీఎం వీరభద్ర సింగ్ మరణంతో కాంగ్రెస్ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఆయన భార్య ప్రతిభా సింగ్ మండి ఎంపీగా, కుమారుడు విక్రమాదిత్యసింగ్ సిమ్లా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండటంతో ప్రచార బాధ్యతలు ప్రియాంక గాంధీ చూస్తున్నారు. ఆప్‌కి చోటుందా? ఆమ్ ఆద్మీ పార్టీ హిమాచల్‌లోనూ అడుగు పెట్టాలని వ్యూహాలు పన్నుతోంది. ఢిల్లీ మోడల్, పంజాబ్ ఫలితాలు ఇక్కడా ప్రభావం చూపుతాయని ఆశ పడుతోంది. కానీ రాష్ట్రంలో మూడో పార్టీకి ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. 2012లో బీజేపీ రెబెల్ నేతలు హిమాచల్ లోక్‌హిత్ పార్టీ పెట్టి ఊపు ఊపినా ఎన్నికల్లో దానికి 4 శాతం ఓట్లే వచ్చాయి. ఈసారి ఆప్‌కు 6 శాతం దాకా ఓట్లు రావచ్చని సర్వేల్లో తేలింది. ఆప్ చివరికి కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీ లాభపడుతుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. అదే జరిగితే 1985 తర్వాత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకున్న తొలి పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టిస్తుంది. రెండు పార్టీలు–రెండు కుటుంబాలు హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు జరుగుతుంది. జనాభాలో 33 శాతమున్న రాజ్‌పుత్‌లు, 18 శాతమున్న బ్రాహ్మణులే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. 25% ఉన్న దళిత, 14 శాతమున్న ఓబీసీ ఓట్లు కూడా కీలకమే. అగ్రవర్ణాలు కాస్త బీజేపీ వైపు మొగ్గితే ఇతర కులాలు కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నాయి. అలా రెండు పార్టీలూ చెరో ఐదేళ్లు అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. గతేడాది మరణించిన కాంగ్రెస్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుటుంబం, బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ కుటుంబం కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలపై పట్టు చూపిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో ధుమాల్ ఓడినా ఆయన కుమారుడు అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రిగా కీలకంగా ఉన్నారు. ఈసారి బీజేపీ గెలిస్తే సీఎం రేసులో కూడా ఉన్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
హిమాచల్ సీఎం ఎవరు? బీజేపీలో రగులుతున్న విభేదాలు!
షిమ్లా : ఐదేళ్ల విరామం తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బీజేపీకి సీఎం ఎంపిక తలనొప్పిగా మారింది. సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓడిపోవటంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కాబోయే సీఎంగా ఆరెస్సెస్ నేపథ్యమున్న జైరామ్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. కొత్త సీఎంను ఎవరనేది తేల్చేందుకు బీజేపీ అధిష్టాన దూతలుగా వచ్చిన కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం ఆరెస్సెస్ పెద్దలతో, బీజేపీ కోర్ గ్రూప్ మెంబర్స్‌తో షిమ్లాలో సమావేశమైన సంగతి తెలిసిందే. వీరి సమావేశం జరుగుతుండగానే.. ధుమాల్ అనుచరులు, ఠాకూర్ అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. పరిస్థితి శ్రుతిమించటంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే కేంద్ర మంత్రులు సమావేశాన్ని ముగించి తిరిగి వెళ్లారు. హిమాచల్ బీజేపీ, ఆరెస్సెస్ నేతలతో జరిపిన చర్చల వివరాలను కేంద్రమంత్రులు అధిష్ఠానానికి నివేదించనున్నారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో సీఎం ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఫలితాలు : నేతల తలరాతలు మార్చిన నోటా
అహ్మదాబాద్ / సిమ్లా : దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూసిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రెండు చోట్లా బీజేపీ తన సత్తా చాటుకుంది. అయితే ఈ పోరులో ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా కొందరి నేతల తల రాతలు మార్చేశాయి. ఈ ఎన్నికల్లో కొందరి నేతల కంటే అత్యధికంగా నోటాకే ఓట్లు వచ్చాయి. మొత్తం 5 లక్షల 42వేల 196 ఓట్లు నోటాకే పడ్డాయి. అంటే గుజరాత్లో 2 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 0.9 శాతం ఓట్లు నోటాకే పడ్డట్టు లెక్క. గుజరాత్లో నోటా నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం మరో గమనార్హం. బీఎస్పీ, ఎన్సీపీ పార్టీల నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే కూడా నోటాకే ఎక్కువగా ఓట్లు రావడం విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది. స్వతంత్ర అభ్యర్థి జిఘ్నేష్ మేవాని గెలుపొందిన వాద్గాంలో అత్యధికంగా 4,200 ఓట్లు నోటాకు పడ్డాయి. అదే సీఎం విజయ్ రూపానీ పోటీచేసిన రాజ్‌కోట్(పశ్చిమ)లో 3,300 నోటా ఓట్లు పోలయ్యాయి. సోమనాథ్, నారాయణపుర, గాంధీధామ్‌లలో స్థానిక ఇండిపెండెట్ల కన్నా ఎక్కువ శాతం ఓట్లు నోటాకే వచ్చాయి.చాలా మంది నేతల అసెంబ్లీ ఆశలను చిదిమేసింది కూడా ఈ నోటానే. మెజార్టీ నోటా ఓటర్లు యంగ్ గుజరాతీలేనని తేలింది. అంతేకాక యంగ్ పటీదార్ ఓటర్లు కూడా నోటాకే ఎక్కువగా ఓట్లు వేసినట్టు తెలిసింది. రెండేళ్ల క్రితం పటీదార్లు తమకు రిజర్వేషన్లు కావాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నోటాకు వచ్చిన ఓట్లు తక్కువేమీ కాదని విశ్లేషకులంటున్నారు. మఖ్యంగా గుజరాత్‌ను తీసుకుంటే ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు నోటా గేమ్ ఛేంజర్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. -
ఔను ఓడిపోయాం.. కారణం అదే: ఒప్పుకున్న సీఎం!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అంగీకరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ ఓటమి పాలయ్యామని ఆయన వాపోయారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రచారం చేయకపోవడం కూడా తమ ఓటమికి కారణాల్లో ఒకటి అని ఆయన వ్యాఖ్యానించారు. ‘హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. కానీ మేం ఎన్నికల్లో వెనుకబడిపోయాం. ఓటమిని నేను అంగీకరిస్తున్నా.. ఇది ప్రజాతీర్పు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ప్రచారం చేయకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణాల్లో ఒకటి’ అని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. కమల దళం ఇక్కడ 44 స్థానాలు (గెలుపు, ముందంజ) దక్కించుకోనుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకు పరిమితం కానుందని తాజా ఫలితాల ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. -
కన్ఫ్యూజన్లో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తనను కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కే తారకరామారావు ట్వీట్ చేశారు. న్యూస్ చానెళ్లు అన్నీ వేరు వేరు నెంబర్లను ప్రదర్శిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతంలో ఎవరు ముందంజ లేదా వెనుకంజలో ఉన్నారో తనకు అసలు అర్థం కావడం లేదని చెప్పారు. అభిప్రాయాలు తదితరాలను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. కానీ, నిజాలు, నెంబర్లు ఎలా మారుతాయని ప్రశ్నించారు. కాగా, కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ఒకరు టీవీని స్విచాఫ్ చేయమని సలహా ఇస్తే.. అన్నింటికంటే బెటర్ ఈసీని ఫాలో అవ్వండి అటూ సూచన చేశారు. So confusing with channels reporting different numbers 🙄 on who’s leading & where!! I can understand entitlement to opinions/views but facts & figures can’t change??!!#GujaratElection2017 — KTR (@KTRTRS) 18 December 2017 -
హిమాచల్ లో కాంగ్రెస్‌ను అదే దెబ్బతీసింది..
సాక్షి, సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో పాలక కాంగ్రెస్‌ను మట్టికరిపించి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను చేజిక్కించుకుంది. 68 స్ధానాలు కలిగిన హిమాచల్ ప్రదేశ్‌లో హాఫ్‌వే మార్క్‌ను దాటిన బీజేపీ 40 స్ధానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ కేవలం 22 స్ధానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇతరులు 5 చోట్ల విజయం సాధించనున్నారు. వీరభద్రసింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసివచ్చింది. హిమాచల్ మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమల్‌ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లింది. ధుమల్ బీజేపీ నేతృత్వంలో1998 నుంచి 2003 వరకూ, తిరిగి 2008 నుంచి 2012 వరకూ రెండు సార్లు హిమాచల్ సీఎంగా వ్యవహరించారు. సీఎం వీరభద్రసింగ్ అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటుడటంతో అవినీతి ప్రధాన ప్రచారాస్త్రంగా బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిని ప్రచార సభల్లో ఎండగట్టారు. పేదలకు ఉద్దేశించిన రూ 57,000 కోట్లను వీరభద్రసింగ్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణలు గుప్పించారు. -
బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం
గాంధీనగర్ : సర్వత్రా ఆసక్తి రేపిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. సాధారణ కౌంటింగ్ వివరాలు, ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ వివరాల్లోనూ బీజేపీ దూసుకెళ్తోంది. రాణ్ ఆఫ్ కచ్, సౌరాష్ట్ర పాంత్రాల్లో కాంగ్రెస్ పాగా వేయగా.. దక్షిణ, మధ్య గుజరాత్‌లలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ అధికారిక వివరాల ప్రకారం.. గుజరాత్లో బీజేపీ 101 చోట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా.. కాంగ్రెస్ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ 38 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 22 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. సాధారణ కౌంటింగ్ వివరాల ప్రకారం.. బీజేపీ 105 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 74 చోట్ల ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో పోరు ఏకపక్షంగా సాగుతోంది. బీజేపీ 39 స్థానాల్లో, కాంగ్రెస్ 24 స్థానాల్లోనూ, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. గుజరాత్లో 182 స్థానాలకు 1,828 మంది అభ్యర్థులు పోటీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 92 సీట్లు హిమాచల్‌లో 68 స్థానాలకు 337 మంది అభ్యర్థుల పోటీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 35 సీట్లు -
హిమాచల్ ఓటింగ్‌లో మహిళలే టాప్!
సిమ్లా: ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.61% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,11,061 మంది పురుషులు ఓటు వేయగా, 19,10,582 మంది స్త్రీలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో స్త్రీల కంటే పురుషులు 72 వేల మంది అధికంగా ఉన్నప్పటికీ ఈ గణాంకాలు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 68 స్థానాలకుగానూ కేవలం 15 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ..దాదాపు 48 నియోజకవర్గాల్లో మహిళల పోలింగ్ శాతం పురుషుల కంటే అధికంగా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనే అతిపెద్ద జిల్లా అయిన కంగ్రాలో 4.61 లక్షల మంది మహిళలు, 3.96 లక్షల మంది పురుషులు ఓటువేశారు. -
ఆయన మోదీ స్నేహితుడే..!
షిమ్లా: ఇటీవలికాలంలో జరిగిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, అందుకు భిన్నంగా కమలదళం హిమాచల్ ప్రదేశ్‌లో వ్యూహాన్ని మార్చింది. 73 ఏళ్ల సీనియర్ నేత ప్రేమ్‌కుమార్ ధుమాల్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దిగింది. బీజేపీ ఇలా వ్యూహాన్ని మార్చుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడేనని భావిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నేతృత్వంలో హిమాచల్ ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్.. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి జంకుతోందని విమర్శల వర్షం గుప్పించింది. ఎప్పటిలాగే ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను నమ్ముకొని.. ఆయన అభివృద్ధి అజెండాతో హిమాచల్‌లో బీజేపీ పోటీ చేస్తున్నదని, కానీ, ఇక్కడ స్థానికంగా సమస్యలు, పరిస్థితులు వేరు అని కాంగ్రెస్ నేతలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రేమ్‌కుమార్ ధూమల్ పేరు తెరపైకి వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ప్రధాని మోదీ, సీఎం అభ్యర్థి ధూమల్ మంచి జాన్‌జిగ్రీ దోస్తులు. ప్రధాని మోదీ సాంకేతికంగా పార్టీకి బాస్ అయినప్పటికీ, ఆయనతో తన స్నేహం ఏమాత్రం చెక్కుచెదరలేదని, తమ మధ్య ఎంతోకాలంగా స్నేహబంధం ఉందని ధూమల్ గుర్తుచేసుకుంటున్నారు. మోదీతో దిగిన 20 ఏళ్ల కిందటి పాత ఫొటోలను మీడియాతో పంచుకున్న ఆయన.. తమ స్నేహబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా 1998, మార్చి 24న దిగిన ఫొటో గురించి ఆయన ఇలా వివరించారు. ‘ఇది ఎంతో గొప్ప సంవత్సరం. అప్పుడు మోదీ హిమాచల్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్గా ఉన్నారు. నేను సీఎం అభ్యర్థిగా పోటీ చేశాను. మా బృందం ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఇది మా ఇద్దరికీ కొత్త అనుభవం. మా బృందం నిజానికి అద్భుతాలు చేసింది. ఈ విజయం తర్వాతే గుజరాత్ సీఎంగా మోదీ తొలిసారి ఎన్నికయ్యారు’ అని ధూమల్ గుర్తుచేసుకున్నారు. గురువారం జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం మూడురోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్రమోదీ ఏడు ర్యాలీల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌పై ప్రధాని మోదీ చూపుతున్న మక్కువకు ఇది నిదర్శనమని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. 20 ఏళ్ల క్రితం మోదీ-ధూమల్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో.. -
హిమాచల్ ప్రదేశ్.. పోలింగ్ రేపే
సాక్షి, న్యూఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు(గురువారం) జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు విషయాలను వెల్లడించారు. మొత్తం 7,525 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు.. 50లక్షల 25 వేల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు ఈసీ తెలిపింది. ఇప్పటిదాకా కోటి ముప్పై లక్షల రూపాయల నగదు.. 2.35 లీటర్ల మద్యం, పెద్ద ఎత్తున్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పుష్పిందర్ రాజ్‌పుత్ తెలిపారు. ఇంకా ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభకానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగతుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 17,850 పోలీస్‌లు విధులు చేపట్టనున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. మొత్తం 68 శాసనసభ స్థానాలకు గానూ 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
హిమాచల్‌లో ఏం జరుగుతోంది?
సాక్షి, సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వరాదనుకుంటోంది. అందుకే ఎనిమిది రోజుల్లో పోలింగ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి పీకే ధుమాల్ పేరును ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారా, లేదా? అంటూ ధుమాల్ హెచ్చరిక జారీ చేయడంతో పార్టీలో పలుకుబడి కలిగిన ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసినట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించాల్సి వచ్చింది. ఇక్కడ ఏ మాత్రం తాత్సారం చేసిన ధుమాల్ అలిగే ప్రమాదం ఉందని, ఆయన అలిగితే పార్టీ అసంతృప్తి రగిలే ప్రమాదం ఉందని పార్టీ అధిష్టానం గ్రహించింది. వాస్తవానికి ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం ప్రస్తుత బీజేపీ సంప్రదాయం కాదు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల విశ్వాసంతోనే ప్రజలు తమ పార్టీని గెలిపించాలన్నది వారి అభిమతం. హిమాచల్‌లోని వీరభద్ర సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించడం ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచింది. పైగా ఓ పర్యాయం అధికారంలోకి వచ్చిన పార్టీ మరో పర్యాయం అధికారంలోకి రాదు. ఇలా రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల సర్వేలు కూడా బీజేపీ విజయాన్నే సూచించాయి. ఇన్ని విధాలుగా విజయావకాశాలున్నప్పటికీ పార్టీ సీఎం అభ్యర్థిని బీజేపీ ముందుగా ప్రకటించాల్సి వచ్చింది. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లను మంచి చేసుకోవడంలో బీజేపీ సమతౌల్యత పాటించినప్పటికీ ఠాకూర్లు మాత్రం ఇప్పటికీ బీజేపీకి దూరంగా ఉన్నారు. వారిని మంచి చేసుకోవడంలో భాగంగానే అదే సామాజిక వర్గానికి చెందిన పీకే ధుమాల్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కూడా ఠాకూర్ సామాజిక వర్గానికే చెందిన వారు. -
గెలుపుపై బీజేపీ ధీమా!
‘హిమాచల్‌లో బీజేపీ గెలుస్తోంది. నేను ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు,’అంటూనే గురువారం ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా కాంగ్డాలో కాషాయపక్షం ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మరో చోట రెండో బహిరంగసభలో పాల్గొనడమేగాక, శనివారం ఇదే జిల్లాలోని రాయిట్ ర్యాలీలో కాంగ్రెస్‌పై తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాలకపక్షాన్ని ఓడించడం ఇక్కడి ప్రజలకు అలవాటుగా మారడం, 2014 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం నాలుగు సీట్లూ బీజేపీ కైవసం కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే మోదీ ధీమాగా ఉన్నారనిపిస్తోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 68 అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను 59 చోట్ల బీజేపీకి మెజారిటీ లభించింది. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నేతృత్వంలోని పాలకపక్షమైన కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లోనే ఆధిక్యం సంపాదించింది. ఇది మూడున్నరేళ్ల క్రితంనాటి పరిస్థితి. ఐదేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీకి అవసరమైన 36 సీట్లురాగా, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధించింది. అసమర్ధ, అస్తవ్యస్త పాలన వంటి విమర్శలతోపాటు సీఎం వీరభద్రపై అవినీతి కేసుల నమోదు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో అననుకూల వాతావరణానికి చిహ్నాలు. సీఎంగా 20 ఏళ్ల అనుభవం ఉన్న 83 ఏళ్ల వీరభద్రను మొదట కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. వెంటనే బీజేపీకి ఇలాంటి నేత ఎవరని పాలకపక్షం ఎద్దేవా చేయడంతో కిందటి మంగళవారం రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 73 ఏళ్ల ప్రేంకుమార్ ధూమల్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. మోదీ జనాకర్షణ శక్తిపై నమ్మకం లేకనే ధూమల్ పేరు చెప్పారని కాంగ్రెస్ ఎగతాళి చేసినా రాష్ట్ర ప్రజల్లో, బీజేపీ శ్రేణుల్లో గందరగోళానికి తెరపడింది. దీంతో దాదాపు 22 శాతం జనాభా ఉన్న రాజపుత్రవర్గానికి చెందిన నేతలే రెండు ప్రధానపక్షాల సీఎం అభ్యర్థులుగా తేలారు. బీజేపీకి 2014 నాటి అనుకూల వాతావరణం ఇప్పుడుందా? కిందటి లోక్‌సభ ఎన్నికలనాటి మోదీ మేజిక్ ఇప్పుడు అదే స్థాయిలో పనిచేస్తుందా? అంటే అనుమానమే. అదీగాక సరిగ్గా ఏడాది క్రితం అమల్లోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, కిందటి జులై ఒకటి నుంచి ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్ను విధానంతో హిమాచల్‌లోని యాపిల్ రైతులు, ఇతర వ్యాపారులు బాగా నష్టపోయారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. బీజేపీపై జనంలో మోజు గతంలో మాదిరిగా లేదు. రాష్ట్ర జనాభాలో రెండో అతిపెద్ద సామజికవర్గమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా చివరికి సీఎం అవుతారనే ప్రచారం బాగా జరిగాక రాజపుత్రుల ఆగ్రహం తప్పదనే భయంతో ఆలస్యంగా ‘భవిష్యత్’ సీఎం ధూమల్ అని బీజేపీ ప్రకటించింది. యాపిల్ రైతులకు ప్రయోజనం కలిగేలా అనేక చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీలు గుప్పిస్తోంది. కాంగ్డా జిల్లాలో బీసీలే కీలకం! ఇతర హిందీ రాష్ట్రాలతో పోల్చితే బీసీల జనాభా పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా బాగా తక్కువ. అగ్రకులాల సంఖ్యాబలం ఉన్న హిమాచల్‌లో బీసీల జనాభా కేవలం 18 శాతం మాత్రమే. అయితే, పంజాబ్ నుంచి కలిపిన కాంగ్డా వంటి ప్రాంతాల్లో బీసీలెక్కువ. 16 అసెంబ్లీ సీట్లున్న కాంగ్డాలో సగానికి పైగా జనాభా ఓబీసీలే. గుజరాత్లో మాదిరిగా ఉద్యోగాల్లో 27 శాతం కోటా కావాలని బాహాటంగా అడగకపోయినా, ఈ వర్గంలో ఆ మేరకు చర్చ జరుగుతోంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న బీసీలు రెండు ప్రధానపక్షాల్లో ఎటు మొగ్గితే ఆ పార్టీదే గెలుపు. మొదట 1993లో సీఎం అయిన వీరభద్ర తొలిసారి బీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి చివరికి కోటాను 18 శాతానికి పెంచారు. అందుకే బీసీలు మొదటల్లో కాంగ్రెస్‌కే అనుకూలంగా ఓటేసేవారు. చాలా మంది తర్వాత నెమ్మదినెమ్మదిగా కాషాయపక్షం వైపు వారు వెళ్లిపోయారు. ముస్లింలు కేవలం రెండు శాతమే కావడంతో హిమాచల్‌లో మత ప్రాతిపదికన ఎన్నికల్లో జనసమీకరణ జరగలేదు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ 2012లో మాదిరిగా మరోసారి మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీజేపీ ఈసారి 50కి పైగా అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుని గద్దెనెక్కాలని ఎన్నికల సమరంలో పోరాడుతోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
బీజేపీ హిమాచల్ సీఎం అభ్యర్థిగా ధుమల్
సాక్షి,సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార పగ్గాలు చేపట్టేందుకు తహతహలాడుతున్న బీజేపీ సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ్ కుమార్ ధుమల్‌ను తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది. సీనియర్ నేత ధుమల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్టు బీజేపీ చీఫ్ అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రేమ్ కుమార్ ధుమల్ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోరాడుతుందని ట్విట్టర్లో అమిత్ షా పేర్కొన్నారు. ధుమల్ నాయకత్వంలో భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్‌లో బీజేపీ విజయం సాధిస్తే సీనియర్ నేత సీఎం పగ్గాలు చేపడతారని అంతకుముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బీజేపీ సీఎం అభ్యర్థులుగా ప్రేమ్ కుమార్ ధుమల్తో పాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా పోటీ పడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 9న ఎన్నికలు జరగనుండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం డిసెంబర్ 18న ఇరు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు చేపడతారు. -
ఎన్నికల ముందు మోదీకి కొత్త తంటా
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి కొత్త తంటాలు ఎదురుకాబోతున్నాయి. ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్లకు చేరుకోబోతున్నాయి. ఉత్తర సముద్ర బ్రెంట్‌లో ఆయిల్ ధరలు శుక్రవారం బ్యారల్‌కు 59.30 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. గురువారమైతే ఈ ధరలు 59.55 డాలర్ల మార్కును తాకి 2015 నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేశాయి. దీంతో అత్యధిక మొత్తంలో దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్‌కు ఇవి అగ్నిపరీక్షలా నిలుస్తున్నాయి. భారత్ 82 శాతం ఆయిల్ అవసరాలను దిగుమతుల ద్వారానే నెరవేర్చుకుంటోంది. దేశీయ బాస్కెట్లో ఆయిల్ ధరలు బ్యారల్‌కు గురువారం 56.92 డాలర్లుగా నమోదయ్యాయి. సోమవారం వరకు ఈ ధరలు 60 డాలర్ల మార్కును చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా రోజువారీ ధరల సమీక్ష ఉండటంతో, వినియోగదారులపై కూడా ఈ ధరల పెంపు భారం అధికంగా పడుతోంది. ఆగస్టు నుంచి కూడా వినియోగదారులు ఆయిల్‌కు అత్యధిక మొత్తంలో చెల్లిస్తూ ఉన్నారు. అక్టోబర్ 3 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో, కేంద్రప్రభుత్వం ఇటీవలే ఎక్సైజ్ డ్యూటీకి కోత పెట్టింది. ఎక్సైజ్ డ్యూటీ కోత మేర రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని ప్రభుత్వం కోరింది. కొన్ని రాష్ట్రాలు ఈ మేరకు వ్యాట్ శాతాలను తగ్గించాయి. కానీ ప్రస్తుతం ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు మళ్లీ పన్ను కోతలను కోరవచ్చు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి మింగుడు పడని అంశమే. ఒకవేళ పన్నుల్లో కోత పెడితే ప్రభుత్వం ఆదాయాలకు గండికొడుతోంది. కానీ తగ్గించపోతే, ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి రావొచ్చు. -
సల్మాన్ ఖాన్ బావకు బీజేపీ టికెట్?
సాక్షి, న్యూఢిల్లీ: సల్మాన్ ఖాన్ బావ ఆయూష్ శర్మ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ మీద పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. సల్మాన్ సోదరి అర్పిత భార్త అయిన ఆయూష్ శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. ఆయూష్ శర్మ తండ్రి అనిల్ శర్మ తాజాగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని వీరభద్రసింగ్ ప్రభుత్వంలో కీలక కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న అనిల్ శర్మ కాంగ్రెస్‌కు ఝల్క్ ఇచ్చి తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ సమాచార శాఖ మంత్రి సుఖ్రామ్ కుమారుడైన అనిల్ శర్మ వీరభద్రసింగ్‌కు నమ్మకమైన కుడిభుజం. ఆయనే కమలం గూటికి చేరడం కాంగ్రెస్ పార్టీని షాక్ గురిచేసింది. బీజేపీలో చేరిన తనకు మాండీ టికెట్‌ను పార్టీ అధినాయకత్వం ఖాయం చేసిందని అనిల్ శర్మ స్పష్టం చేశారు. అదే సమయంలో మీ కుమారుడు ఆయూష్‌కు కూడా టికెట్ లభించే అవకాశముందా? అని మీడియా ప్రశ్నించగా.. అది బీజేపీ నాయకత్వం నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తనకు, తన కొడుకు ఆయూష్‌కు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాకే.. ఆయన బీజేపీ గూటికి చేరినట్టు కథనాలు వస్తున్నాయి. -
గుజరాత్ ఎన్నికలపై గూడుపుఠాణీ
సాక్షి, న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల కమిషన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల కమిషన్ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడానికే ఈ సమావేశమని మీడియా భావించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వ విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) మీడియాకు ట్వీట్లు కూడా పంపించింది. చివరకు మీడియా సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ 18వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆచల్ కుమార్ జోతి ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని, హిమాచల్ పోలింగ్ ప్రభావం గుజరాత్‌పై ఉండకూడదనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలకు డిసెంబర్ 18వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా గుజరాత్ ఎన్నికలను జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ, మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి ఆరోపించారు. ఇలా చేయడం ఎన్నికల కమిషన్ పరువు తీయడమేనని ఖురేషి ఘాటుగా విమర్శించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూలను ఇప్పుడే ప్రకటించక పోవడం వెనక తమకు ఎలాంటి ఉద్దేశాలు, దురుద్దేశాలు లేవని ఆచల్ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు. 2012లో హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్ 4వ తేదీన ఒకే రోజున ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. హిమాచల్‌కు డిసెంబర్ 13న, గుజరాత్‌కు డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. మరి ఈ సారి ఎందుకు ఒకేసారి ప్రకటించలేదు? దీనికి సమాధానం ఊహించడం పెద్ద కష్టమేమి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వంగానీ, ఆ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంగానీ ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదు. ఎలాంటి స్కీములు ప్రకటించరాదు. వచ్చే సోమవారం అంటే, అక్టోబర్ 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపానున్న భట్ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి కొన్ని వరాలు లేదా రాయితీలు లేదా పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. గుజరాత్లో పాలకపక్షం బీజేపీ పట్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం, ఆర్థిక వ్యవస్థ మందగించడం లాంటి పరిస్థితుల్లో గుజరాత్‌ను తిరిగి దక్కించుకోవాలంటే భారీ తాయిలాలు ఇవ్వాల్సి ఉంటుందని చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానం భావించి ఉంటుంది. అందుకనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే వాడాలి
సిమ్లా: ఎన్నికల్లో ఈవీఎంల వాడటాన్ని నిషేధించాలంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ డిమాండ్ చేశారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటాన్ని నిషేధించి, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై వీరభద్ర సింగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలి జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలకు మొగ్గుచూపుతోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.