గెలుపుపై బీజేపీ ధీమా! | Himachal Pradesh election: Both Congress, BJP racked by dissensions | Sakshi
Sakshi News home page

గెలుపుపై బీజేపీ ధీమా!

Published Sat, Nov 4 2017 8:33 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Himachal Pradesh election: Both Congress, BJP racked by dissensions  - Sakshi

‘హిమాచల్‌లో బీజేపీ గెలుస్తోంది. నేను ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు,’అంటూనే గురువారం ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా కాంగ్డాలో కాషాయపక్షం ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మరో చోట రెండో బహిరంగసభలో పాల్గొనడమేగాక, శనివారం ఇదే జిల్లాలోని రాయిట్‌ ర్యాలీలో కాంగ్రెస్‌పై తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాలకపక్షాన్ని ఓడించడం ఇక్కడి ప్రజలకు అలవాటుగా మారడం, 2014 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం నాలుగు సీట్లూ బీజేపీ కైవసం కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే మోదీ ధీమాగా ఉన్నారనిపిస్తోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 68 అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను 59 చోట్ల బీజేపీకి మెజారిటీ లభించింది.

ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ నేతృత్వంలోని పాలకపక్షమైన కాంగ్రెస్‌ కేవలం 9 స్థానాల్లోనే ఆధిక్యం సంపాదించింది. ఇది మూడున్నరేళ్ల క్రితంనాటి పరిస్థితి. ఐదేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీకి అవసరమైన 36 సీట్లురాగా, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధించింది. అసమర్ధ, అస్తవ్యస్త పాలన వంటి విమర్శలతోపాటు సీఎం వీరభద్రపై అవినీతి కేసుల నమోదు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో అననుకూల వాతావరణానికి చిహ్నాలు. సీఎంగా 20 ఏళ్ల అనుభవం ఉన్న 83 ఏళ్ల వీరభద్రను మొదట కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

వెంటనే బీజేపీకి ఇలాంటి నేత ఎవరని పాలకపక్షం ఎద్దేవా చేయడంతో కిందటి మంగళవారం రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 73 ఏళ్ల ప్రేంకుమార్‌ ధూమల్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. మోదీ జనాకర్షణ శక్తిపై నమ్మకం లేకనే ధూమల్‌ పేరు చెప్పారని కాంగ్రెస్‌ ఎగతాళి చేసినా రాష్ట్ర ప్రజల్లో, బీజేపీ శ్రేణుల్లో గందరగోళానికి తెరపడింది. దీంతో దాదాపు 22 శాతం జనాభా ఉన్న రాజపుత్రవర్గానికి చెందిన నేతలే రెండు ప్రధానపక్షాల సీఎం అభ్యర్థులుగా తేలారు.

బీజేపీకి 2014 నాటి అనుకూల వాతావరణం ఇప్పుడుందా?
కిందటి లోక్‌సభ ఎన్నికలనాటి మోదీ మేజిక్‌ ఇప్పుడు అదే స్థాయిలో పనిచేస్తుందా? అంటే అనుమానమే. అదీగాక సరిగ్గా ఏడాది క్రితం అమల్లోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, కిందటి జులై ఒకటి నుంచి ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్ను విధానంతో హిమాచల్‌లోని యాపిల్‌ రైతులు, ఇతర వ్యాపారులు బాగా నష్టపోయారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. బీజేపీపై జనంలో మోజు గతంలో మాదిరిగా లేదు. రాష్ట్ర జనాభాలో రెండో అతిపెద్ద సామజికవర్గమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కేంద్రమంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా చివరికి సీఎం అవుతారనే ప్రచారం బాగా జరిగాక రాజపుత్రుల ఆగ్రహం తప్పదనే భయంతో ఆలస్యంగా ‘భవిష్యత్‌’ సీఎం ధూమల్‌ అని బీజేపీ ప్రకటించింది. యాపిల్‌ రైతులకు ప్రయోజనం కలిగేలా అనేక చర్యలు తీసుకుంటామని  బీజేపీ హామీలు గుప్పిస్తోంది.

కాంగ్డా జిల్లాలో బీసీలే కీలకం!
ఇతర హిందీ రాష్ట్రాలతో పోల్చితే బీసీల జనాభా పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా బాగా తక్కువ. అగ్రకులాల సంఖ్యాబలం ఉన్న హిమాచల్‌లో బీసీల జనాభా కేవలం 18 శాతం మాత్రమే. అయితే, పంజాబ్‌ నుంచి కలిపిన కాంగ్డా వంటి ప్రాంతాల్లో బీసీలెక్కువ. 16 అసెంబ్లీ సీట్లున్న కాంగ్డాలో సగానికి పైగా జనాభా ఓబీసీలే. గుజరాత్‌లో మాదిరిగా  ఉద్యోగాల్లో 27 శాతం కోటా కావాలని బాహాటంగా అడగకపోయినా, ఈ వర్గంలో ఆ మేరకు చర్చ జరుగుతోంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న బీసీలు రెండు ప్రధానపక్షాల్లో ఎటు మొగ్గితే ఆ పార్టీదే గెలుపు.

మొదట 1993లో సీఎం అయిన వీరభద్ర తొలిసారి బీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి చివరికి కోటాను 18 శాతానికి పెంచారు. అందుకే బీసీలు  మొదటల్లో కాంగ్రెస్‌కే అనుకూలంగా ఓటేసేవారు. చాలా మంది తర్వాత నెమ్మదినెమ్మదిగా కాషాయపక్షం వైపు వారు వెళ్లిపోయారు. ముస్లింలు కేవలం రెండు శాతమే కావడంతో హిమాచల్‌లో మత ప్రాతిపదికన ఎన్నికల్లో జనసమీకరణ జరగలేదు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ 2012లో మాదిరిగా మరోసారి మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీజేపీ ఈసారి 50కి పైగా అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుని గద్దెనెక్కాలని ఎన్నికల సమరంలో పోరాడుతోంది.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement