షిమ్లా: ఇటీవలికాలంలో జరిగిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, అందుకు భిన్నంగా కమలదళం హిమాచల్ ప్రదేశ్‌లో వ్యూహాన్ని మార్చింది. 73 ఏళ్ల సీనియర్ నేత ప్రేమ్‌కుమార్ ధుమాల్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దిగింది.
బీజేపీ ఇలా వ్యూహాన్ని మార్చుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడేనని భావిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నేతృత్వంలో హిమాచల్ ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్.. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి జంకుతోందని విమర్శల వర్షం గుప్పించింది. ఎప్పటిలాగే ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను నమ్ముకొని.. ఆయన అభివృద్ధి అజెండాతో హిమాచల్‌లో బీజేపీ పోటీ చేస్తున్నదని, కానీ, ఇక్కడ స్థానికంగా సమస్యలు, పరిస్థితులు వేరు అని కాంగ్రెస్ నేతలు లేవనెత్తారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రేమ్‌కుమార్ ధూమల్ పేరు తెరపైకి వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ప్రధాని మోదీ, సీఎం అభ్యర్థి ధూమల్ మంచి జాన్‌జిగ్రీ దోస్తులు. ప్రధాని మోదీ సాంకేతికంగా పార్టీకి బాస్ అయినప్పటికీ, ఆయనతో తన స్నేహం ఏమాత్రం చెక్కుచెదరలేదని, తమ మధ్య ఎంతోకాలంగా స్నేహబంధం ఉందని ధూమల్ గుర్తుచేసుకుంటున్నారు. మోదీతో దిగిన 20 ఏళ్ల కిందటి పాత ఫొటోలను మీడియాతో పంచుకున్న ఆయన.. తమ స్నేహబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా 1998, మార్చి 24న దిగిన ఫొటో గురించి ఆయన ఇలా వివరించారు. ‘ఇది ఎంతో గొప్ప సంవత్సరం. అప్పుడు మోదీ హిమాచల్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. నేను సీఎం అభ్యర్థిగా పోటీ చేశాను. మా బృందం ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఇది మా ఇద్దరికీ కొత్త అనుభవం. మా బృందం నిజానికి అద్భుతాలు చేసింది. ఈ విజయం తర్వాతే గుజరాత్ సీఎంగా మోదీ తొలిసారి ఎన్నికయ్యారు’ అని ధూమల్ గుర్తుచేసుకున్నారు. గురువారం జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం మూడురోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్రమోదీ ఏడు ర్యాలీల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌పై ప్రధాని మోదీ చూపుతున్న మక్కువకు ఇది నిదర్శనమని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు.
20 ఏళ్ల క్రితం మోదీ-ధూమల్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో..
Comments
Please login to add a commentAdd a comment