సాక్షి, సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వరాదనుకుంటోంది. అందుకే ఎనిమిది రోజుల్లో పోలింగ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి పీకే ధుమాల్ పేరును ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారా, లేదా? అంటూ ధుమాల్ హెచ్చరిక జారీ చేయడంతో పార్టీలో పలుకుబడి కలిగిన ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసినట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించాల్సి వచ్చింది. ఇక్కడ ఏ మాత్రం తాత్సారం చేసిన ధుమాల్ అలిగే ప్రమాదం ఉందని, ఆయన అలిగితే పార్టీ అసంతృప్తి రగిలే ప్రమాదం ఉందని పార్టీ అధిష్టానం గ్రహించింది.
వాస్తవానికి ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం ప్రస్తుత బీజేపీ సంప్రదాయం కాదు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల విశ్వాసంతోనే ప్రజలు తమ పార్టీని గెలిపించాలన్నది వారి అభిమతం. హిమాచల్‌లోని వీరభద్ర సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించడం ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచింది. పైగా ఓ పర్యాయం అధికారంలోకి వచ్చిన పార్టీ మరో పర్యాయం అధికారంలోకి రాదు. ఇలా రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల సర్వేలు కూడా బీజేపీ విజయాన్నే సూచించాయి.
ఇన్ని విధాలుగా విజయావకాశాలున్నప్పటికీ పార్టీ సీఎం అభ్యర్థిని బీజేపీ ముందుగా ప్రకటించాల్సి వచ్చింది. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లను మంచి చేసుకోవడంలో బీజేపీ సమతౌల్యత పాటించినప్పటికీ ఠాకూర్‌లు మాత్రం ఇప్పటికీ బీజేపీకి దూరంగా ఉన్నారు. వారిని మంచి చేసుకోవడంలో భాగంగానే అదే సామాజిక వర్గానికి చెందిన పీకే ధుమాల్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కూడా ఠాకూర్ సామాజిక వర్గానికే చెందిన వారు.
Comments
Please login to add a commentAdd a comment