సాక్షి, న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల కమిషన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల కమిషన్ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడానికే ఈ సమావేశమని మీడియా భావించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వ విభాగం ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) మీడియాకు ట్వీట్లు కూడా పంపించింది.
చివరకు మీడియా సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ 18వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆచల్ కుమార్ జోతి ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని, హిమాచల్ పోలింగ్ ప్రభావం గుజరాత్‌పై ఉండకూడదనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలకు డిసెంబర్ 18వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా గుజరాత్ ఎన్నికలను జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ, మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి ఆరోపించారు. ఇలా చేయడం ఎన్నికల కమిషన్ పరువు తీయడమేనని ఖురేషి ఘాటుగా విమర్శించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూలను ఇప్పుడే ప్రకటించక పోవడం వెనక తమకు ఎలాంటి ఉద్దేశాలు, దురుద్దేశాలు లేవని ఆచల్ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు.
2012లో హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్ 4వ తేదీన ఒకే రోజున ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. హిమాచల్‌కు డిసెంబర్ 13న, గుజరాత్‌కు డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. మరి ఈ సారి ఎందుకు ఒకేసారి ప్రకటించలేదు? దీనికి సమాధానం ఊహించడం పెద్ద కష్టమేమి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వంగానీ, ఆ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంగానీ ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదు. ఎలాంటి స్కీములు ప్రకటించరాదు.
వచ్చే సోమవారం అంటే, అక్టోబర్ 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపానున్న భట్ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి కొన్ని వరాలు లేదా రాయితీలు లేదా పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. గుజరాత్‌లో పాలకపక్షం బీజేపీ పట్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం, ఆర్థిక వ్యవస్థ మందగించడం లాంటి పరిస్థితుల్లో గుజరాత్‌ను తిరిగి దక్కించుకోవాలంటే భారీ తాయిలాలు ఇవ్వాల్సి ఉంటుందని చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానం భావించి ఉంటుంది. అందుకనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment