‘డబుల్‌ ఇంజన్‌’కు అగ్నిపరీక్ష | Himachal Pradesh Election 2022: A Prestige Battle For BJP double engine | Sakshi
Sakshi News home page

‘డబుల్‌ ఇంజన్‌’కు అగ్నిపరీక్ష

Published Tue, Nov 8 2022 5:26 AM | Last Updated on Tue, Nov 8 2022 8:24 AM

Himachal Pradesh Election 2022: A Prestige Battle For BJP double engine - Sakshi

సాధారణంగా ప్రశాంతంగా సాగే హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మాత్రం అక్షరాలా యుద్ధాన్నే తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ ‘డబుల్‌ ఇంజన్‌’ నినాదానికి అగ్నిపరీక్షగా మారాయి. అంతేగాక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల ప్రతిష్టకూ సవాలుగా పరిణమించాయి. మోదీ కరిష్మాతో అధికారం నిలబెట్టుకుంటామని కమలనాథులు ఆశిస్తుండగా ప్రభుత్వ వ్యతిరేకతే గట్టెక్కిస్తుందని కాంగ్రెస్‌ నమ్ముతోంది.

1985 నుంచి రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని రివాజు ఈసారీ కొనసాగుతుందని ఆశిస్తోంది. మూడో పార్టీగా ఆప్‌ ఉనికి పోటీని మరింత సంక్లిష్టంగా మార్చేసింది. అన్ని పార్టీలూ హోరాహోరీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ప్రియాంక గాంధీ రెండుసార్లే ప్రచారం చేసినా రాష్ట్రమంతా కలియదిరిగారు. రాహుల్‌గాంధీ కూడా భారత్‌ జోడో యాత్రకు బ్రేకి చ్చి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఉద్యోగుల్లోనూ అసంతృప్తి
మోదీ వ్యక్తిగత ఆకర్షణకు తిరుగు లేకపోయినా కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వముంటే డబుల్‌ ఇంజన్‌ ప్రగతి సాధ్యమన్న బీజేపీ మాటలను హిమాచల్‌ జనాలు ఎంతవరకు నమ్ముతున్నారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీన్ని రాష్ట్ర ప్రజలు పెద్దగా నమ్మడం లేదని హిమాచల్‌కు చెందిన శశికుమార్‌ అనే రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు. ధరల పెరుగుదల మొదలుకుని ఏ సమస్యకూ గత ఐదేళ్లలో పరిష్కారం దొరికింది లేదన్నది వారి ఆరోపణగా ఉంది.

దీనికి తోడు పాత పెన్షన్‌ స్కీం కోసం రెండు లక్షలకు పైగా ప్రభుత్వోద్యోగులు చేస్తున్న డిమాండ్‌ కూడా బీజేపీకి కాస్త ప్రతికూలమేనంటున్నారు. దీన్ని తనకు అనువుగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. రెబెల్స్‌ను కట్టడి చేయడంలో కమలనాథులు విఫలమవుతున్న తీరు విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా 24కు పైగా సీట్లలో వాళ్లు స్వతంత్రులుగా బరిలో దిగుతున్నారు. ఇది కూడా బీజేపీ విజయావకాశాలను బాగా దెబ్బ కొడుతుందన్నది కాంగ్రెస్‌ ఆశ.

తమకు రెబెల్స్‌ బెడద మరీ అంతగా లేకపోవడం మరింత కలిసొచ్చే అంశమని పార్టీ నమ్ముతోంది. కాకలు తీరిన నాయకుడు వీరభద్రసింగ్‌ గత ఏడాది మరణించాక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి కాస్త బలహీనంగానే మారింది. సీఎం పోస్టుకు కనీసం అర డజను మంది పోటీదారులు ఉండటంతో ఇంటి పోరు నానాటికీ పెరిగిపోతోంది. ఆప్‌ కూడా రంగంలో ఉన్నా ప్రధానంగా రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అయితే గత ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఏకంగా 12 స్థానాల్లో నోటాదే మూడో స్థానం! ఈ ఓట్లన్నీ ఈసారి ఆప్‌ ఖాతాలోకి వెళ్లే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్‌ పోటీ బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం.

కింగ్‌మేకర్‌ కాంగ్రా: కాంగ్రా జిల్లా మరోసారి కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం కన్పిస్తోంది. 1993 నుంచి ఈ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీయే అధికారం చేజిక్కించుకుంటూ వస్తోంది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలో 2012 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 10 సీట్లు, 2017 ఎన్నికల్లో బీజేపీ 11 గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ‘‘రెండు పార్టీలకూ ఇక్కడ అటూ ఇటుగా 40 శాతం చొప్పున ఓటు బ్యాంకుంది.

3 నుంచి 5 శాతం ఓట్లరు మాత్రమే ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఓటేస్తూ కీలకంగా మారుతున్నారు’’ అని హిమాచల్‌ వర్సిటీలో పొలిటికల్‌ ప్రొఫెసర్‌ హరీశ్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చారు. కాంగ్రాలో కులం చాలా ప్రభావం చూపుతుందన్నారాయన. మిగతా రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడా రాజ్‌పుత్‌లదే ప్రాబల్యం. జిల్లా జనాభాలో వారు 34 శాతముంటారు. 32 శాతమున్న ఓబీసీలు, 20 శాతమున్న బ్రాహ్మణులు కూడా ప్రభావం చూపుతారు. గద్దీ తదితర పర్వత ప్రాంతీయులది 14 శాతం వాటా. దాంతో బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ రాజ్‌పుత్, గద్దీ నేతలకు ఎక్కువ టికెట్లిచ్చాయి. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తుండటం కలవరపెడుతోంది. ధరల పెరుగుదలపై జనంలో ఆగ్రహం  ఉంది. అందుకే అభ్యర్థిని కాకుండా తనను చూసి ఓటేయాలని ప్రధాని ప్రచార సభల్లోనూ విజ్ఞప్తి చేస్తున్నారు.                                      

స్వతంత్రులే కీలకం?
ఈసారి 20కి పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్రులు నెగ్గారు. ఈసారి ఈ సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే చివరికి స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటును శాసించే శక్తిగా అవతరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం విన్పిస్తోంది.

ఎన్నికల అంశంగా అగ్నిపథ్‌
రాష్ట్రంలో సగం అసెంబ్లీ సీట్లున్న కాంగ్రా, హమీర్పూర్, ఉనా, మండీ జిల్లాల్లో అగ్నిపథ్‌ పథకం పెద్ద ఎన్నికల అంశంగా మారింది. ఎందుకంటే ఈ నాలుగు జిల్లాల్లో ఏకంగా 1.3 లక్షల మంది మాజీ, 40 వేల మంది సర్వీసులో ఉన్న సైనికులున్నారు! అంటే ప్రతి మూడిళ్లకు ఒకరన్నమాట!! ఈ జిల్లాలకు ప్రధాన ఉపాధి వనరు సైన్యమే. ఈ నాలుగు జిల్లాల నుంచి ఏటా కనీసం 4 వేల మంది యువకులు సైన్యంలో చేరుతుంటారు. అగ్నిపథ్‌ రాకతో రెజిమెంట్‌వారీ భర్తీ విధానం రద్దవడంతో రాష్ట్రం నుంచి నియామకాలు మూడో వంతు తగ్గనున్నాయి. ఇది కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమవుతుందని కాంగ్రాకు చెందిన మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) రాణా అభిప్రాయపడ్డారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement