సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ప్రక్రి య కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థుల తుది జాబితాను తయారుచేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ వరుసగా రెండోరోజైన గురువారం బిజీబిజీగా గడిపింది.
ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీభవన్‌లోని ఇందిరాభవన్‌లో సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలు, ఆశావహుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో భేటీ అయింది. కొందరు ఆశావహులను కూడా కలిసింది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జాబితా రూపొందిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గాంధీభవన్ ప్రాంగణంలో సందడి నెలకొంది.
సర్వేల్లో ఇలా వచ్చింది కదా?: స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్‌తో పాటు సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలైలు గురువారం ఉదయం తొలుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల నుంచి ఆశావహుల జాబితాలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ రెండు నుంచి ఆరుగురి పేర్లు సూచించిన నియోజకవర్గాల గురించి ఆరా తీశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘ఫలానా నియోజకవర్గంలో మూడు పేర్లు ప్రదేశ్ కమిటీ సూచించింది.. ఇందులో ఎవరయితే బాగుంటుంది’అని ప్రశ్నించారు.
ఫలానా వ్యక్తి అయితే బాగుంటుందని జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు ఏఐసీసీ ఆధ్వర్యంలో ఆరా, ఐపీఎస్‌లతో పాటు మరో ఏజెన్సీతో నిర్వహించిన సర్వే వివరాలను సరిచూసుకున్నారు. జిల్లా అధ్యక్షులు సూచించిన పేరు సర్వే వివరాలతో సరిపోలితే ఆ చర్చను అక్కడితో ముగించారు. జిల్లా అధ్యక్షులు చెప్పిన వ్యక్తికి సర్వేలో మంచి ఫలితం రాకపోతే ఆ అభ్యర్థిని ఎందుకు ప్రతిపాదిస్తున్నారని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ప్రశ్నించారు.
ఏయే స్థానాల్లో ఏయే సామాజికవర్గాల ప్రభావం ఉంటుందని, ఫలానా సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని కూడా జిల్లా అధ్యక్షులను ప్రశ్నించినట్లు సమాచారం. ముగ్గురు, నలుగురు పేర్లున్న చోట ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే మిగిలిన వారికి ఎలాంటి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ, నామినేటెడ్, పార్టీ పోస్టు ఇచ్చి సరిపెట్టవచ్చా అని ప్రశ్నించారు. పార్టీలో గ్రూపు తగాదాలుంటే ఎలా సమన్వయం చేయాలి? జిల్లా రాజకీయ పరిస్థితులేంటి అనే అంశాలపై కూడా స్క్రీనింగ్ కమిటీ జిల్లా పార్టీ అధ్యక్షులను ఆరా తీశారు.
సీట్లు కోరిన అనుబంధ సంఘాలు
పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధి బృందాలతో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ముందుగా యూత్‌కాంగ్రెస్‌తో ప్రారంభించి ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్ ప్రతినిధులతో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు వారి నుంచి వివరాలు రాబట్టారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని అన్ని అనుబంధ సంఘాలు కోరగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద నేతృత్వంలోని మహిళా కాంగ్రెస్ నేతలు తాము అడుగుతున్న నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితాను కమిటీకి అందజేశారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారితో సహా 27 చోట్ల మహిళలకు అవకాశం కల్పించాలని కోరారు. ఇందులో మహేశ్వరం, గద్వాల, జహీరాబాద్, నర్సాపూర్, కోదాడ, ఆర్మూర్, ములుగు, పరకాల, సికింద్రాబాద్, కరీంనగర్, జుక్కల్, చేవెళ్ల, నకిరేకల్, మహబూబాబాద్, బోథ్, ఇల్లెందు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆదిలాబాద్, చొప్పదండి నియోజకవర్గాలున్నట్లు సమాచారం.
బీసీ సెల్ నేతలు కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 స్థానాల చొప్పున వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని, పొత్తుల్లో ఇతర పార్టీలకు ఇవ్వాల్సి వచ్చినా కనీసం 28 సీట్లకు తగ్గకుండా బీసీలకు అవకాశం ఇవ్వాలని చిత్తరంజన్‌దాస్, పి.వినయ్‌కుమార్ బృందం కోరింది. టీపీసీసీ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్‌రెడ్డి నేతృ త్వంలోని బృందం కూడా సేవాదళ్‌కు మూడు సీట్లు ఇవ్వాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment