కొట్టింది పరిటాల శ్రీరామే | partitala sriram beaten ysrcp activist | Sakshi
Sakshi News home page

కొట్టింది పరిటాల శ్రీరామే

Published Wed, Feb 14 2018 7:27 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

partitala sriram beaten ysrcp activist - Sakshi

పరిటాల శ్రీరాం

అనంతపురం, రామగిరి : మండలంలోని పేరూరులో ఈనెల 7న పర్యటించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తనపై దాడి చేయలేదని నసనకోటకు చెందిన బోయసూర్యం తెలిపారు. ఆయన మంగళవారం జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌కు రిజిష్టర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈనెల 7న తమ పార్టీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డితో కలసి తానూ రామలింగారెడ్డి పేరూరులో పర్యటించినట్లు తెలిపారు. ఇది జీర్ణించుకోలేని మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, మాదాపురం శంకర్, కొత్తపల్లి శివకుమార్, పరంధామయాదవ్‌ తమ ఇంటివద్దకొచ్చి మారణాయుధాలతో   బెదిరించారని, వెంకటాపురం తీసుకెళ్లి తనను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. ‘వైఎస్సార్‌సీపీ నాయకులతో తిరిగితే చంపేస్తాం ’ అంటూ నానా దుర్భాషలాడారన్నారు. అనంతరం  పావగడ ఆస్పత్రిలో తన విరిగిన చేతికి వెంకటరమణప్ప డాక్టరు వద్ద  పరిటాల శ్రీరామ్‌ కట్టుకట్టించి పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడారన్నారు.

వైఎస్సార్‌సీపీ పేరెత్తితే చంపేస్తాం
ఎవడైనా రామగిరి మండలంలో వైఎస్సార్‌సీపీ పేరెత్తినా ,తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేరెత్తినా చంపేస్తాం అంటూ బెదిరించారన్నారు. అనంతరం తనను దౌర్జన్యంగా వారు రామగిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి స్థానిక సీఐ యుగంధర్, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సమక్షంలో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకొని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, మీనుగ నాగరాజులపై కేసు నమోదు చేశారన్నారు. అనంతరం తమ గ్రామానికి తీసుకొచ్చి   జరిగిన విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తామంటూ బెదిరించారన్నారు. తాను వారి చెర నుంచి బయటపడి   జిల్లా ఎస్పీకి రిజిష్టర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు అందజేశానన్నారు. అనంతరం సాక్షి మీడియాను ఆశ్రయించినట్లు వాపోయారు. తనపై తమ పార్టీ నాయకులు ఎందుకు దాడి చేస్తారు. తాను వైఎస్సార్‌సీపీ కార్యకర్తనని, తోపుదుదర్తి బ్రదర్స్‌ ప్రధాన అనుచరుడినని ఆయన తెలిపారు. తనపై దాడి చేసి వారిపై అక్రమ కేసు నమోదు చేయించింది మంత్రి పరిటాల సునీత, మంత్రి తనయుడు శ్రీరామ్‌ అని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement