paritala sree ram
-
పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్న జనం
సాక్షి, టాస్క్‌పోర్స్: ఓటర్లను ప్రభావితం చేసేందు కోసం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ను మరూరు గ్రామస్తులతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన రాత్రి 10 గంటల సమయంలో మంగళవారం మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో తనను ఎన్నికల్లో గెలిపించాలని లేకపోతే మీ అంతు చూస్తా, గ్రామాలను తగులబెట్టేస్తా అని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మరుకముందే గురువారం ఉదయం మండలంలోని మరూరు గ్రామంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్ద పరిటాల శ్రీరాం వెళ్లి హల్ చేల్ చేశాడు. దాదాపుగా 10 వాహనాల్లో 50 మందికి పైగా తన అనుచరులతో వెళ్లి మరూరులోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మరూరు గ్రామస్తులు ఆయన్ను అడ్డుకున్నారు. ఎందుకు ఇంత మందితో పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నావని అడిగారు. దీంతో ఆయన నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ఎక్కడికైనా వెళ్తానని చెప్పారు. అడ్డు వచ్చిన గ్రామస్తులను పక్కకు నెట్టి ముందుకు వెళ్లడంతో అక్కడే ఉన్న మరికొంత మంది గ్రామస్తులు అడ్డుపడ్డారు. వారికి తోడుగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడి నుంచి వెనక్కు వెళ్లాలని లోపలికి వెళ్లనిచ్చేదే లేదంటూ గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. అయితే వీరిని పక్కకు నెట్టేయండి అంటూ అనుచరులకు శ్రీరాం హుకుం జారీ చేశారు. శ్రీరామ్ వైపు అనుచరులు, టీడీపీ నాయకులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు అధిక సంఖ్యలో రావడంతో ఒక్క సారిగా పరిటాల శ్రీరాంతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను బయటకు నెట్టి వేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంత వారించినా పరిటాల శ్రీరాంను లోపలికి వెళ్లనిచ్చేందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. చేసేది లేక పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఎమ్మెల్యే అయిన వెంటనే గ్రామంలోకి వచ్చి నన్ను అడ్డుకున్న ప్రతి ఒక్కరిని గ్రామ బహిష్కరణ చేస్తానంటూ శ్రీరామ్ మీసం మేలేసి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఆయన రాప్తాడు పోలింగ్ కేంద్రంలో కూడా హల్చల్ చేశాడు. అడ్డుపడటం మంచిపద్ధతి కాదు : మంత్రి పరిటాల సునీత పోలింగ్ కేంద్రంలో జరుగుతన్న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వస్తే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆమె మరూరు గ్రామానికి వచ్చి మీరేం చేస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వస్తే ఎందుకు లోపలికి వెళ్లనివ్వలేదంటూ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామంటూ ధ్వజమెత్తారు. అనంతరం ఆమె రాప్తాడులో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నారు. రంగంలోకి దిగిన రామగిరి సీఐ పరిటాల శ్రీరామ్‌ను మరూరు గ్రామస్తులు అడ్డుకున్న విషయం తెలుసుకున్న రామగిరి సీఐ సిద్ధ తేజామూర్తి మరూరుకు వచ్చి గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులపై లాఠీచార్జి చేశారు. మరూరు గ్రామం సీఐ పరిధిలో లేకున్నా ఇక్కడి వచ్చి గ్రామస్తులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అతి చేస్తే బట్టలు ఊడదీసి కోడతానంటూ హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని స్టేషన్లో కాళ్లు పైకి కట్టి కొడతానంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఐ దురుసు ప్రవర్తనను కొందరు వైఎస్సార్సీపీ నేతలు సెల్ఫోన్లో బంధిస్తుండగా సెల్ఫోన్లను సీఐ లాక్కొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
శ్రీరామా.. ఇదేం డ్రామా
సాక్షి, రామగిరి : ఇంతకాలం తల్లి పరిటాల సునీత కొంగు చాటున రాజకీయాలు చేస్తూ వచ్చిన పరిటాల శ్రీరాం.. ఈ ఎన్నికల్లో గెలుపుతో తన రాజకీయ జీవితాన్ని అరంగేట్రం చేసేందుకు కుట్రలకు తెరలేపాడు. గురువారం పోలింగ్ ప్రక్రియలో భాగంగా రామగిరి మండలంలోని పెదకొండాపురం బూత్ నంబర్ 226 టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులను లోబరుచుకొని ఈవీఎం మూత వేయడానికి నకిలీ సీళ్లను సృష్టించారు. అయితే స్థానిక వైఎస్సార్సీపీ ఎన్నికల ఏజెంట్లు అనుమానంతో ఆ సీళ్లను పరిశీలించారు. దీంతో అవి నకిలీ సీళ్లుగా బయటపడ్డాయి. దీనిపై వారు ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో పాటు ఎన్నికల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక అధికారులతో ఈవీఎం ప్యాక్‌లకు ఒరిజినల్ సీళ్లు వేయించి వాటిని తరలించారు. కాగా ఇలాంటి సంఘటనలు రామగిరి మండలంతో పాటు నియోజక వర్గంలోని కనగానపల్లి, రాప్తాడు మండలాల్లో కూడా చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. కనగానపల్లి మండలంలో గుంతపల్లిలో కూడా ఈవీఎలను నకిలీ సీళ్లతో ప్యాక్ చేస్తుండగా స్థానిక వైఎస్సార్సీపీ పట్టుకొన్నారు. స్థానిక టీడీపీ ఏజెంట్ల వద్ద ఉన్న వాటిని స్వాధీనం చేసుకొని అధికారులకు అందజేశారు. ప్రజావ్యతిరేకతను గుర్తించిన టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదన్న ఉద్దేశంతో ఇలాంటి కుట్రలకు తెరలేపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవీఎంలు సరిగా భద్రత పరచాలి టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారులు ఈవీఎం మిషన్లకు సరైన భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ రాప్తాడు అసెంబ్లీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎన్నికల అధికారులను కోరారు. రామగిరి, కనగానపల్లి మండలాల్లో నకిలీ సీళ్లు బయటపడటం విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని, వీటిపై సరైన విచారణ చేసి ప్రజల తీర్పును కాపాడాలని కోరామన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన ఈ ఎన్నికల తమ విజయాన్ని ఆపేలేరన్నారు. -
రామగిరిలో ప్రలోభాల పరంపర
సాక్షి, రామగిరి: రాప్తాడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ సొంత మండలమైన రామగిరిలో ప్రలోభాలకు గురిచేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆపార్టీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆపార్టీ నాయకులు మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో మద్యం ఏరులై పారిస్తున్నారు. మొదటిసారిగా రాప్తాడు అసెంబ్లీ సార్వత్రిక బరిలో పరిటాల శ్రీరామ్ నిలిచారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో ఎలాగైనా గెలవాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. ఓటుకు రూ. 2వేల నుంచి రూ.3వేల దాకా ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులే బహిరంగంగా చెప్తున్నారు. ఈక్రమంలో కింది స్థాయి అధికారులను సైతం వారు వినియోగించుకుంటూ టీడీపీకి ప్రచారం చేయించుకుంటున్నారు. అందులో భాగంగా గత వారంలో తిమ్మాపురానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తతో ప్రచారం చేయించారు. బుధవారం పోలేపల్లి గ్రామంలో బీఎల్ఓ నిర్మల భర్త మక్కిన నారాయణ స్లిప్పులతోపాటు డబ్బులు పంపిణీ చేశారు. మద్యం బాటిళ్లు స్వాధీనం ధర్మవరం రూరల్: గొళ్లపల్లి వద్ద బుధవారం ఎక్సైజ్ శాఖ జరిపిన తనిఖీలలో శ్రీనివాసులు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 38 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసానాయుడు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశామన్నారు. ఈ దాడులలో ఎస్ఐలు ఎస్ఎం రఫీ, మోహన్‌బాబు, సిబ్బంది రామాంజులు, సుధాకర్‌రెడ్డి, కృష్ణానాయక్, కళ్యాణి, జ్యోతి పొల్గొన్నారు. -
ఓడిపోతే అంతుచూస్తా?
సాక్షి,రాప్తాడు: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం ఐదు గంటలకే ముగిసినా టీడీపీ రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో రాత్రి 11 గంటలైనా పోలీసుల సమక్షంలోనే రాప్తాడు మండలం పాలవాయి, పాలవాయి తండా, ఎం.చెర్లోపల్లి, మరూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ స్థానికులు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఎం.చెర్లోపల్లిలో శ్రీరామ్‌కు చుక్కెదరైంది. ఈ సమయంలో ప్రచారం ఏమిటంటూ స్థానికులు ఎదురు తిరగడంతో ఈ ఎన్నికల్లో ఓడిస్తే మీ అంతు చూస్తానని బెదిరించినట్లు సమాచారం. రానున్నది టీడీపీప్రభుత్వమేనంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తాడని, మంత్రి అయిన వెంటనే ఆరు మండలాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను గ్రామాల్లోంచి బయట గెంటివేస్తామని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, ప్రచారం ముగిసినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకొని, డ్రమ్స్ వాయిస్తూ బాణాసంచ పేలుస్తూ గ్రామాల్లో హంగామా సృష్టించారు. టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ఉన్నా నోరు మెదపలేదు. వారికి ముడుపులు అందడంతోనే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నాయకులకు పోలీసుల బెదిరింపులు గ్రామంలో రాత్రి పది గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నాడని ఆయన కాన్వాయ్‌లో ఉన్న ఇటుకలపల్లి సీఐ మధు, ఎస్ఐ గంగాధర్‌కు ఎం.చెర్లోపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకులను ప్రచారం చేయకుండా గ్రామం నుంచి బయటకు పంపాలి. పోలీసులు అలా చేయకుండా మీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా ప్రచారం నిర్వహించుకోవచ్చని, మీరు ఇప్పుడు అడ్డు పడితే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అరెస్ట్ చేస్తే భయపడబోమని వైఎస్సార్సీపీ నాయ కులతో పాటు గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ‘ఎన్నికలు అయిపోగానే మీ కథ చూస్తామం’టూ గ్రామస్తుల ఫొటోలను సెల్ఫోన్లో తీసుకున్నారు. ఎట్టకేలకు అక్కడ భారీ జనాలు గూమికూడడంతో పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి మరూరుకు వెళ్లిపోయారు. మరూరులో కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డు తగలడంతో చేసేదేమీ లేక పరిటాల శ్రీరామ్ వెనుదిరిగిపోయారు. -
జనం మెచ్చని శ్రీరామ్
సాక్షి, రామగిరి: రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు మంగళవారం పేరూరులో చుక్కెదురైంది. ప్రచారంలో చివరి రోజున భారీ బహిరంగసభకు స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించినంత జనం రాకపోవడంతో శ్రీరామ్ నిరాశకు గురయ్యారు. ఈ నెల ఏడో తేదీన రాత్రి వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేరూరు బస్టాండ్ ప్రాంతంలో బహిరంగసభ నిర్వహిస్తే జనం తరలివచ్చి విజయవంతం చేశారు. అయితే పరిటాల కోటగా పిలిచే రామగిరి మండలం పేరూరులో మంగళవారం పరిటాల శ్రీరామ్ సభకు వందలాదిమందికూడా రాకపోవడం గమనార్హం. పాతికేళ్లుగా పరిటాల కుటుంబం ఎమ్మెల్యేగా, మంత్రులుగా అధికారంలో ఉండి కూడా కనీససౌకర్యాలు కల్పించడంలో విఫలమవడంతో జనం వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపారని పలువురు చర్చించుకొంటున్నారు. ఐదేళ్లుగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని రామగిరి మండలంలోకి అడుగు పెట్టనీకుండా పోలీసులు, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కానీ రెండు రోజుల క్రితం పేరూరుకు ప్రకాష్‌రెడ్డి రాగానే మండల వాసులు, ప్రజలు ఘనస్వాగతం పలకడం విశేషం. -
కొట్టింది పరిటాల శ్రీరామే
అనంతపురం, రామగిరి : మండలంలోని పేరూరులో ఈనెల 7న పర్యటించిన వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తనపై దాడి చేయలేదని నసనకోటకు చెందిన బోయసూర్యం తెలిపారు. ఆయన మంగళవారం జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌కు రిజిష్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈనెల 7న తమ పార్టీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డితో కలసి తానూ రామలింగారెడ్డి పేరూరులో పర్యటించినట్లు తెలిపారు. ఇది జీర్ణించుకోలేని మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, మాదాపురం శంకర్, కొత్తపల్లి శివకుమార్, పరంధామయాదవ్ తమ ఇంటివద్దకొచ్చి మారణాయుధాలతో బెదిరించారని, వెంకటాపురం తీసుకెళ్లి తనను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. ‘వైఎస్సార్సీపీ నాయకులతో తిరిగితే చంపేస్తాం ’ అంటూ నానా దుర్భాషలాడారన్నారు. అనంతరం పావగడ ఆస్పత్రిలో తన విరిగిన చేతికి వెంకటరమణప్ప డాక్టరు వద్ద పరిటాల శ్రీరామ్ కట్టుకట్టించి పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడారన్నారు. వైఎస్సార్సీపీ పేరెత్తితే చంపేస్తాం ఎవడైనా రామగిరి మండలంలో వైఎస్సార్సీపీ పేరెత్తినా ,తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేరెత్తినా చంపేస్తాం అంటూ బెదిరించారన్నారు. అనంతరం తనను దౌర్జన్యంగా వారు రామగిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి స్థానిక సీఐ యుగంధర్, ఎస్ఐ విజయ్‌కుమార్ సమక్షంలో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకొని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, మీనుగ నాగరాజులపై కేసు నమోదు చేశారన్నారు. అనంతరం తమ గ్రామానికి తీసుకొచ్చి జరిగిన విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తామంటూ బెదిరించారన్నారు. తాను వారి చెర నుంచి బయటపడి జిల్లా ఎస్పీకి రిజిష్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు అందజేశానన్నారు. అనంతరం సాక్షి మీడియాను ఆశ్రయించినట్లు వాపోయారు. తనపై తమ పార్టీ నాయకులు ఎందుకు దాడి చేస్తారు. తాను వైఎస్సార్సీపీ కార్యకర్తనని, తోపుదుదర్తి బ్రదర్స్ ప్రధాన అనుచరుడినని ఆయన తెలిపారు. తనపై దాడి చేసి వారిపై అక్రమ కేసు నమోదు చేయించింది మంత్రి పరిటాల సునీత, మంత్రి తనయుడు శ్రీరామ్ అని ఆయన తెలిపారు. -
రెచ్చిపోతున్న పరిటాల శ్రీరామ్
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం రాజ్యమేలుతోంది. అధికారం అండతో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హంద్రీ-నీవా జల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం రామగిరి మండలం పోలేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని అడ్డుకునేందుకు అల్లరిమూకలు బీహార్ తరహాలో రాళ్లు, కట్టెలు పట్టుకుని రోడ్లపై నిలబడి భయానక పరిస్థితులను తలపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక మంత్రి, ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల మద్దతు పెరుగుతుండడంతో.. జిల్లాకు అన్యాయం చేస్తూ హంద్రీ-నీవా నీటిని అక్రమంగా కుప్పంకు తరలించేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నారని, ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన హంద్రీ-నీవా జల సాధన సమితి చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రామగిరి మండలం పోలేపల్లిలో కార్యక్రమం ఏర్పాటుకు ఇన్చార్జ్ సీఐ శ్రీధర్‌తో ముందురోజే ప్రకాష్‌రెడ్డి అనుమతి తీసుకున్నారు. అనుమతి ఉత్తర్వు సీఐ నుంచి ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్‌కు వెళ్లింది. ఏం జరిగిందో ఏమో కానీ డీఎస్పీ అనుమతికి నిరాకరించారు. పరిటాల సునీత, శ్రీరామ్ ఒత్తిడి మేరకే పోలీసులు అనుమతి ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. దారి పొడవునా రౌడీ, అల్లరిమూకలు పోలేపల్లి సమావేశానికి పోలీసుల అనుమతి ఇవ్వలేదని తెలిసిన తర్వాత పరిటాల శ్రీరామ్ హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. చుట్టు పక్కల గ్రామాల్లో తమ అనుచరులుగా ఉన్న కొంతమంది రౌడీ మూకలను దింపి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కనిపిస్తే అడ్డుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్ఎస్ గేటు నుంచి వెంకటాపురం వెళ్లే దారిలో పాపిరెడ్డిపల్లి క్రాస్, పోలేపల్లి క్రాస్, చిగురుచెట్టు కింద, ఎగువపల్లి క్రాస్, సంజీవరాయుని రైస్‌మిల్, శ్రీహరికోట వద్ద గుంపులు గుంపులుగా జనం కట్టెలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎస్పీని కలిసి ప్రకాష్‌రెడ్డి ఈ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ చేస్తున్న దౌర్జన్యాలను వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. అనుమతులు ఇవ్వకపోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అండతో వెళ్లి తీరుతాం శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశాన్ని అధికారం దౌర్జన్యంతో అడ్డుకోవాలని మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవ ర్గ ప్రజలను పూర్తిగా విస్మరించారు. అన్నివర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి జీర్ణించుకోలేక పోలేపల్లి సమావేశాన్ని అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల అండతో రామగిరి పర్యటన కచ్చితంగా చేసి తీరుతాం. దీంట్లో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదు. - తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి