మరూరులో పరిటాల శ్రీరామ్‌ను చుట్టుముట్టిన మరూరు గ్రామస్తులు
సాక్షి, టాస్క్‌పోర్స్: ఓటర్లను ప్రభావితం చేసేందు కోసం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ను మరూరు గ్రామస్తులతో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన రాత్రి 10 గంటల సమయంలో మంగళవారం మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో తనను ఎన్నికల్లో గెలిపించాలని లేకపోతే మీ అంతు చూస్తా, గ్రామాలను తగులబెట్టేస్తా అని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మరుకముందే గురువారం ఉదయం మండలంలోని మరూరు గ్రామంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్ద పరిటాల శ్రీరాం వెళ్లి హల్ చేల్ చేశాడు. దాదాపుగా 10 వాహనాల్లో 50 మందికి పైగా తన అనుచరులతో వెళ్లి మరూరులోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మరూరు గ్రామస్తులు ఆయన్ను అడ్డుకున్నారు. ఎందుకు ఇంత మందితో పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నావని అడిగారు.
దీంతో ఆయన నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ఎక్కడికైనా వెళ్తానని చెప్పారు. అడ్డు వచ్చిన గ్రామస్తులను పక్కకు నెట్టి ముందుకు వెళ్లడంతో అక్కడే ఉన్న మరికొంత మంది గ్రామస్తులు అడ్డుపడ్డారు. వారికి తోడుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడి నుంచి వెనక్కు వెళ్లాలని లోపలికి వెళ్లనిచ్చేదే లేదంటూ గ్రామస్తులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. అయితే వీరిని పక్కకు నెట్టేయండి అంటూ అనుచరులకు శ్రీరాం హుకుం జారీ చేశారు. శ్రీరామ్ వైపు అనుచరులు, టీడీపీ నాయకులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు అధిక సంఖ్యలో రావడంతో ఒక్క సారిగా పరిటాల శ్రీరాంతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను బయటకు నెట్టి వేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంత వారించినా పరిటాల శ్రీరాంను లోపలికి వెళ్లనిచ్చేందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. చేసేది లేక పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఎమ్మెల్యే అయిన వెంటనే గ్రామంలోకి వచ్చి నన్ను అడ్డుకున్న ప్రతి ఒక్కరిని గ్రామ బహిష్కరణ చేస్తానంటూ శ్రీరామ్ మీసం మేలేసి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఆయన రాప్తాడు పోలింగ్ కేంద్రంలో కూడా హల్‌చల్ చేశాడు.
అడ్డుపడటం మంచిపద్ధతి కాదు : మంత్రి పరిటాల సునీత
పోలింగ్ కేంద్రంలో జరుగుతన్న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వస్తే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆమె మరూరు గ్రామానికి వచ్చి మీరేం చేస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వస్తే ఎందుకు లోపలికి వెళ్లనివ్వలేదంటూ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామంటూ ధ్వజమెత్తారు. అనంతరం ఆమె రాప్తాడులో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నారు.
రంగంలోకి దిగిన రామగిరి సీఐ
పరిటాల శ్రీరామ్‌ను మరూరు గ్రామస్తులు అడ్డుకున్న విషయం తెలుసుకున్న రామగిరి సీఐ సిద్ధ తేజామూర్తి మరూరుకు వచ్చి గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై లాఠీచార్జి చేశారు. మరూరు గ్రామం సీఐ పరిధిలో లేకున్నా ఇక్కడి వచ్చి గ్రామస్తులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అతి చేస్తే బట్టలు ఊడదీసి కోడతానంటూ హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని స్టేషన్‌లో కాళ్లు పైకి కట్టి కొడతానంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఐ దురుసు ప్రవర్తనను కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు సెల్‌ఫోన్‌లో బంధిస్తుండగా సెల్‌ఫోన్‌లను సీఐ లాక్కొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment