తాడిపత్రి చర్చి స్కూల్ పోలింగ్ కేంద్రం ఎదుట గురువారం ఉదయమే బారులుతీరిన ఓటర్లు
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ‘అనంత’ ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. గురువారం ఉదయం నుంచే ఓటేసేందుకు వెల్లువెత్తారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం విశ్వసనీయతకు పట్టం కట్టేందుకు స్వగ్రామాలకు తరలివచ్చారు. పచ్చమూకలు రెచ్చిపోయినా...దాడులతో భయాందోళనలు కలిగించినా...అభిమాన నేతకు అధికారం ఇచ్చేందుకు ముందుకే సాగారు. ఐదేళ్లు ఎవరు పాలించాలో తీర్పు చెప్పారు. రెచ్చిపోయిన ‘పచ్చ’మూకలు పోలింగ్‌రోజున టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో రక్తపాతం సృష్టించారు. మరిన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు ధ్వంసం చేయడం, వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లదాడి, భౌతిక దాడులకు దిగి భయోత్పాతాన్ని సృష్టించేందుకు యత్నించారు. అయినప్పటికీ ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆ రెండు నియోజకవర్గాల్లోహింసాత్మక చర్యలు:
తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో హింసచోటు చేసుకుంది. కదిరి, మడకశిర, శింగనమల, ధర్మవరం, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవకర్గాల్లో అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు మినహా తక్కిన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. తాడిపత్రి మండలం వీరాపురంలో టీడీపీ నేతలు ఓటర్ల వెంట వెళ్లి సైకిల్‌కు ఓటేసేలా అత్సుత్యాహం చూపించారు. క్యూలో ఉన్నవారి వద్దకే వెళ్లి ప్రచారం చేశారు. ఇది గ్రహించిన వైఎస్సార్‌సీపీ నేతలు వాదనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీయగా...రాళ్లురువ్వుకున్నారు. ఈ సమయంలో చింతా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. వెంటనే అతన్ని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
భాస్కర్‌రెడ్డి గతంలోనూ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు దీన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం భాస్కర్‌రెడ్డి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదిక వస్తే ఎలా చనిపోయారని తెలుస్తుందని చెబుతున్నారు. ఈ ఘర్షణలోనే టీడీపీ నేతల రాళ్లు రువ్వగా పుల్లారెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని అనంతపురంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.
రాప్తాడులో రక్తపాతం
రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో టీడీపీ ఏజెంట్లు వృద్ధుల ఓట్లను సైకిల్ గుర్తుపై వేసేందుకు యత్నించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్, పార్టీ మండల కన్వీనర్ బాలపోతన్న అడ్డుకున్నారు. వృద్ధులకు ఓటువేయడం తెలీకపోతే అధికారుల సాయం తీసుకోవాలని.. ఇలా చేయడం తగదన్నారు. దీంతో టీడీపీ నేతలు పోతన్నపై దాడికి దిగారు. అంతేకాకుండా అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లదాడి చేశారు. ఈ ఘర్షణలో వినోద్ అనే యువకుడి తలకు, జ్యోతి అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపు చేశారు. కానీ టీడీపీ నేతలు మిద్దెలపై రాళ్లు వేసుకుని, తలపాగాలు చుట్టకుని వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టి పోలింగ్‌కు విఘాతం కల్పించాలని తీవ్రంగా ప్రయత్నించారు.
గుత్తి, తలుపుల మండలాల్లో ఈవీఎంలు ధ్వంసం
కదిరి నియోజకవర్గం తలుపుల మండలం కుర్లిలో మధ్యాహ్నం 3.15 గంటల వరకూ పోలింగ్ జరిగింది. పోలైన ఓట్లలో 85 శాతం వైఎస్సార్‌సీపీకి పోలైనట్లు గ్రామంలో చర్చ జరిగింది. ఇది గ్రహించిన టీడీపీ ఏజెంట్ ఆదినారాయణ ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ పట్టణంలోని ఓ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ ఖలందర్‌పై దాడి చేశారు. ఇక ఈవీఎంలు పనిచేయలేదన్న కోపంతో గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తా గుత్తిలో ఈవీఎంను కిందపడేసి ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
యల్లనూరులో జేసీ రచ్చ
శింగనమల నియోజకవర్గం యల్లనూరులో వైఎస్సార్‌సీపీ నేత భోగాతి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించకపోయినా...భోగాతిని స్టేషన్‌కు తరలించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్టేషన్‌కు వెళ్లి ప్రతాప్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ‘ఏయ్ బలిసిందారా? నీ కథ చూస్తా? అంటూ రాయలేని భాషలో బూతులు మాట్లాడుతూ వెళ్లిపోయారు. పోలీసులు అక్కడే ఉన్నా...ప్రేక్షకపాత్ర వహించారు. ఎన్నికలకోడ్ అమలులో ఉన్నపుడు స్టేషన్‌కు వచ్చి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై రెచ్చిపోయి మాట్లాడిన ఎంపీ జేసీని వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.
ఓటమి భయంతోనే దాడులు?
‘అనంత’లో ఎదురుగాలి వీస్తోందని గ్రహించిన టీడీపీ నేతలు పోలింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే దాడులకు దిగి, తద్వారా భయోత్పాతం సృష్టించి ఓటర్లు పోలింగ్‌సెంటర్‌కు రాకుండా నిలువరించేందుకు కుట్రపన్నారు. అయితే ఓటర్లు ఏమాత్రం భయపడకుండా వచ్చి ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
♦ మొరాయించిన ఈవీఎంలు
జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అయితే జిల్లా వ్యాప్తంగా 97 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఈ సెంటర్లలో పోలింగ్ రెండు గంటల పాటు పోలింగ్ ఆలస్యమైంది. ఈ కారణంతోనే పలు కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. జనం అర్ధరాత్రి వరకూ క్యూలో ఉండి మరీ ఓటు వేశారు.
♦ వాహనాల లైటింగ్ మధ్య పోలింగ్
గుంతకల్లు మండలం మొలకలపెంట గ్రామంలోని 12వ పోలింగ్ బూత్‌లో రాత్రి 8 గంటలకు వరకూ పోలింగ్ సాగింది. గాలివాన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.దీంతో పోలీస్ వాహనాల లైటింగ్ మధ్య పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు.
♦ స్ట్రాంగ్‌రూంలకు ఈవీఎంల తరలింపు
పోలింగ్ ముగిసిన తర్వాత ఇరుపార్టీల ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు ఈవీఎలకు సీల్‌వేశారు. వాటిని పోలీస్‌బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలో ఎస్కే యూనివర్సిటీ, జేఎన్‌టీయూలోని స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. అక్కడ వాటిని గట్టి బందోబస్తు మధ్య భద్రపరిచారు.
♦ మే 23న కౌంటింగ్
మార్చి 10న షెడ్యూలు వెలువడిన తర్వాత సరిగ్గా నెలరోజులకు పోలింగ్ జరిగింది. గతంలో పోలింగ్ ముగిసిన వారం పదిరోజుల్లో కౌంటింగ్ ఉండేది. అయితే ఈ దఫా ఏకంగా 43 రోజులు పోలింగ్, కౌంటింగ్‌కు మధ్య సమయం ఉంది. మే 23న కౌంటింగ్ జరగనుంది. అప్పటి వరకూ ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. కౌంటింగ్ వరకూ స్ట్రాంగ్‌రూంలు గట్టి బందోబస్తు పర్యవేక్షణలో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment