లక్ష్ముంపల్లిలో ప్రత్యేక బలగాలు
సాక్షి, పెద్దవడుగూరు : లక్ష్ముంపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అరాచక పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. ఆ పార్టీలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో తాము ఎక్కడ ఓటమిపాలవుతామోనన్న భయం టీడీపీని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం లక్ష్ముంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకుడిపై నోటికొచ్చినట్టు దూషించాడు. వైఎస్సార్‌సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతుండటంతో అసహనానికి లోనయ్యాడు. ప్రభాకర్‌రెడ్డి తిట్లదండకం శ్రుతిమించడంతో గ్రామస్తులు తిరగబడ్డారు.
చివరకు పోలీసులు సర్దిచెప్పాల్సి వచ్చింది. అనంతరం ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయాడు. వైఎస్సార్‌సీపీ నా యకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు సోమవారం లక్ష్ముంపల్లికి చేరుకున్నారు. ఇదేరోజు టీడీపీ ఎన్నికల ప్రచారం మరోమారు జరగాల్సి ఉంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు. తమ గ్రామంలోకి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని రానిచ్చే ప్రసక్తే లేదని భీష్మించారు. ప్రచారం చేసేవాళ్లు ఓట్లు అడుక్కోవాలే కానీ బూతులు తిట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు. గ్రామంలో జరుగుతున్న సంఘటనలను తెలుసుకొన్న ఎమ్మెల్యే జేసీపీఆర్ క్రిష్టిపాడులో ప్రచారం ముగించుకుని లక్ష్ముంపల్లికి రాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
అప్పటికే పెద్దవడుగూరు సీఐ రాము, ఎస్‌ఐ రమేష్‌రెడ్డి, ప్రత్యేక బలగాలను గ్రామంలోకి మోహరింపజేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే గ్రామంలోకి రావడం లేదని ఎవ్వరూ ఘర్షణలకు పాల్పడవద్దని పోలీసులు స్థానిక ప్రజలకు, కార్యకర్తలకు సర్దిచెప్పి శాంతింపజేశారు. గ్రామంలో జరుతున్న పరిణామాలను తెలుసుకొన్న ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు లక్ష్ముంపల్లికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment