గుంతపల్లిలో బయటపడిన టీడీపీ నాయకుల నకిలీ సీలు
సాక్షి, రామగిరి : ఇంతకాలం తల్లి పరిటాల సునీత కొంగు చాటున రాజకీయాలు చేస్తూ వచ్చిన పరిటాల శ్రీరాం.. ఈ ఎన్నికల్లో గెలుపుతో తన రాజకీయ జీవితాన్ని అరంగేట్రం చేసేందుకు కుట్రలకు తెరలేపాడు. గురువారం పోలింగ్ ప్రక్రియలో భాగంగా రామగిరి మండలంలోని పెదకొండాపురం బూత్ నంబర్ 226 టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులను లోబరుచుకొని ఈవీఎం మూత వేయడానికి నకిలీ సీళ్లను సృష్టించారు. అయితే స్థానిక వైఎస్సార్‌సీపీ ఎన్నికల ఏజెంట్లు అనుమానంతో ఆ సీళ్లను పరిశీలించారు. దీంతో అవి నకిలీ సీళ్లుగా బయటపడ్డాయి. దీనిపై వారు ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తర్వాత ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో పాటు ఎన్నికల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక అధికారులతో ఈవీఎం ప్యాక్‌లకు ఒరిజినల్ సీళ్లు వేయించి వాటిని తరలించారు. కాగా ఇలాంటి సంఘటనలు రామగిరి మండలంతో పాటు నియోజక వర్గంలోని కనగానపల్లి, రాప్తాడు మండలాల్లో కూడా చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. కనగానపల్లి మండలంలో గుంతపల్లిలో కూడా ఈవీఎలను నకిలీ సీళ్లతో ప్యాక్ చేస్తుండగా స్థానిక వైఎస్సార్‌సీపీ పట్టుకొన్నారు. స్థానిక టీడీపీ ఏజెంట్ల వద్ద ఉన్న వాటిని స్వాధీనం చేసుకొని అధికారులకు అందజేశారు. ప్రజావ్యతిరేకతను గుర్తించిన టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదన్న ఉద్దేశంతో ఇలాంటి కుట్రలకు తెరలేపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈవీఎంలు సరిగా భద్రత పరచాలి
టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారులు ఈవీఎం మిషన్లకు సరైన భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ రాప్తాడు అసెంబ్లీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎన్నికల అధికారులను కోరారు. రామగిరి, కనగానపల్లి మండలాల్లో నకిలీ సీళ్లు బయటపడటం విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని, వీటిపై సరైన విచారణ చేసి ప్రజల తీర్పును కాపాడాలని కోరామన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన ఈ ఎన్నికల తమ విజయాన్ని ఆపేలేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment