
విప్ కూన రవికుమార్‌ను నిలదీస్తున్న ఓ మహిళ
ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. లోలుగు గ్రామంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన పసుపు–కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన్ని తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం కార్యకర్తలే అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం చేశారంటూ నిలదీశారు. కుర్చీలను, ఫైళ్లను గాల్లోకి విసిరారు. టెంట్లను కూల్చేశారు. రవికుమార్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఓ దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే పార్టీలోని ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు గ్రామానికి హుటాహుటీన చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. భారీ బందోబస్తు మధ్య రవికుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. పసుపు–కుంకుమ కార్యక్రమాన్ని అధికారులు కూడా రద్దు చేసి వెళ్లిపోయారు.
శ్రీకాకుళం, పొందూరు: లోలుగు గ్రామంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి చెందిన కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమనడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ టెంట్‌లోకి వచ్చి అందరికీ నమస్కారం అని చెప్పేసరికే ఒక్కసారిగా అక్కడ ఉన్న ఓ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. రవికుమార్ గో బ్యాక్, రవికుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని జరిపితే ఒప్పుకోమని హెచ్చరించారు. టెంట్లు పీకిపడేశారు. కుర్చీలను గాల్లోకి ఎగరేశారు. అధికారుల చేతిలో ఉన్న ఫైళ్లను లాక్కొని విసిరేశారు. రవికుమార్‌ను బండ బూతులు తిట్టారు. తమ నాయకుడు శ్రీరాములనాయుడ్ని, గ్రామాన్ని విస్మరించి ఇప్పుడేమో కార్యక్రమానికి వస్తావా అని నిలదీశారు. గ్రామాన్ని సర్వనాశనం చేశావు, భ్రష్టుపట్టించావని ఆవేశంతో ఊగిపోయారు. తోపులాటకు దిగారు. దీంతో టీడీపీలో ఒక వర్గానికి చెందిన వారి నుంచి రవికుమార్‌కు మరో వర్గం వారు రక్షణ కల్పించాల్సి వచ్చింది. మహిళలు, మగవాళ్లు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. మాకొద్దీ కార్యక్రమం అంటూ నిరసన వ్యక్తం చేశారు.
లోలుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, పొందూరు జెడ్పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాములు నాయుడుకు విప్ ప్రాధాన్యత ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన కామరాజు వర్గానికి బాసటగా నిలుస్తున్నారనే ఆరోపణలతో ఒక వర్గాన్ని మరో వర్గం తిట్టుకుంటూ, తోసుకుంటూ గొడవను పెంచారు. ఒకానొక దశలో శ్రీరాములునాయుడు, కామరాజు వర్గాయులు కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన అక్కడ ఉన్న మండలాధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఎచ్చెర్ల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు లోలుగు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేసింది. అయితే జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములనాయుడు వర్గీయులు మాత్రం అసహనాన్ని, నిరసనను ఆపలేదు. దీంతో మరో టీడీపీ నాయకుడైన మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెపు రాము, అధికారులు కలిసి ఇరువర్గీయులను శాంతింపజేశారు.
మహిళలకు విప్ రవికుమార్‌తో సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం కల్పించారు. మహిళలంతా కూర్చొంటుండగా కొంతమంది కార్యకర్తలు అడ్డు చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే మళ్లీ వివాదం రేగింది. మహిళలంతా తమ గ్రామానికి ఏం చేశావంటూ విప్ రవికుమార్‌ను నిలదీశారు. అధికారులు, పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. రవికుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయే వరకూ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు రవికుమార్‌ను తన కాన్వాయ్‌లోని కారులో కూర్చోబెట్టి రోడ్డు దాటించేశారు. అయితే రోడ్డు దాటేంత వరకు రవికుమార్ డౌన్ డౌన్ అంటూ ఆయన వ్యతిరేకులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. జేఆర్‌పురం సీఐ విశ్వేశ్వరరావు, లావేరు ఎస్సై చిరంజీవి, ఎచ్చెర్ల ప్రత్యేక బలగాలు శాంతి భద్రతలను కాపాడారు. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మండల ప్రత్యేకాధికారి మెట్ట వెంకటేశ్వరరావు, ఎంపీడీవో చింతాడ లక్ష్మీభాయ్, ఏపీఎం మంగమ్మ, వెలుగు సీసీ శ్యామలరావు కూడా కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment