
సాక్షి, అమరావతి: సమన్యాయం, అధికార వికేంద్రీకరణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. పదవి పోయిందన్న ఉక్రోషంతో చంద్రబాబు స్థాయి మరచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విరుచుకుపడుతున్నారని దుయ్యబట్టారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై సభలో చర్చ జరుగుతుంటే అడ్డుకుని బయటకు పోయిన చంద్రబాబు తమ ప్రభుత్వాన్ని తుగ్లక్ పాలనగా విమర్శించడం ఆయన సంస్కార హీనతకు నిదర్శనమన్నారు. తుగ్లక్ నిర్ణయాలు ఎవరివో ప్రజలకు బాగా తెలుసన్నారు.
అందరి సలహాలతోనే ముందుకు..
రాజధానిపై ప్రభుత్వం నియమించిన కమిటీ త్వరలో ఇచ్చే నివేదికను ప్రజల ముందుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాకే ముందుకు సాగుతామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బయట పెట్టలేదని, కనీసం చట్టసభలో కూడా చర్చించలేదన్నారు. మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే జగన్ చెప్పారన్నారు. చాలా రాష్ట్రాల్లో సచివాలయం, హైకోర్టు వేర్వేరు చోట్ల ఉన్నాయని గుర్తు చేశారు. రాజధానిలో రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయన్నారు.
22 బిల్లులకు ఆమోదం
ఈనెల 9 నుంచి 17వరకు జరిగిన శాసనసభలో 22 కీలక బిల్లుల్ని ఆమోదించినట్టు మంత్రి వివరించారు. దేశం మొత్తానికి మార్గదర్శకంగా నిలిచిన దిశ చట్టాన్ని తీసుకు వచ్చినందుకు ప్రపంచమంతా కొనియాడుతుంటే సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్షం వాకౌట్ చేసి మహిళల పట్ల తమ వైఖరిని చాటుకుందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ 200 రోజుల్లోనే చట్టం చేయడం విశేషమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపడాన్ని ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతుందని మంత్రి విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీల పేద పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దేలా ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టాలని సీఎం భావిస్తే దాన్ని కూడా ప్రతిపక్షం తప్పుబట్టిందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment