ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్(పాత చిత్రం)
ఏలూరు: నీతిమంతులకు ఓట్లు వేయాలని, అవసరం అయితే స్వతంత్ర్యంగా పోటీ చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చలసాని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. వేల సంవత్సరాల విశిష్టత కలిగిన హేలాపురి(ఏలూరు)లో ప్రజలను చైతన్యం చేయడానికే వచ్చామన్నారు. కేంద్రం నమ్మక ద్రోహం, నయవంచన చేస్తే అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని సూచించారు. ఎవరూ వ్యక్తిగత విమర్శలకు పోవద్దని కోరారు.1200 మంది విద్యుత్ ఉద్యోగులను హింసించింది ఎవరని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేసులు వేయించారని తెలిపారు. తెలుగు జాతి సమైక్యత, భావజాల సమైక్యతగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉంటే వారిలో ఒక్కరూ కేంద్ర మంత్రి లేరని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, ఆంధ్రా ద్రోహులను ఢిల్లీకి పంపడం వల్ల ఏపీకి ఈ గతి పట్టిందన్నారు. ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదని ఓటర్లు ప్రశ్నించాలన్నారు. అవినీతి పరులను ఎన్నుకోవద్దని సూచన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment