మోదీ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గెలుపెవరిది అన్న దానిపై ఉత్కంఠ పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు మొగ్గు చూపిస్తున్నారనే అంచనాలు ఉన్నప్పటికీ ఆఖరి నిముషంలో సమీకరణాలు ఎలాగైనా మారిపోయే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉండడంతో ప్రతీ ఓటు అత్యంత కీలకంగా మారింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి దక్షిణాదిన కూడా పట్టు పెంచుకోవాలన్న వ్యూహంలో ఉన్న బీజేపీ ప్రధానంగా పట్టణ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ఇందుకోసం సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంది. నమో యాప్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని, అందుకే ఆ పార్టీకీ చెందిన ఏ కార్యక్రమమైనా ఆ యాప్ ద్వారా చేస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏ పనికైనా నమో యాప్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో ఏ పని చేయాలన్నా నమో యాప్‌నే వినియోగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలతో సమావేశాలు ఈ యాప్ ద్వారా జరుగుతున్నాయి. ఇక కర్ణాటక రైతులతో కూడా నమో యాప్ ద్వారా మోదీ ముచ్చటించి వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడానికి ముందు కర్ణాటకలో అన్ని నియోజకవర్గాల ప్రజల నుంచి నమో యాప్ ద్వారానే అభిప్రాయాలను సేకరించి, వాటికి అనుగుణంగానే మేనిఫెస్టోను తయారు చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై యువత అభిప్రాయాలు నమో యాప్ ద్వారా చెప్పండంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ నమో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ప్రధాని విజ్ఞప్తి చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఎక్కువ మంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటారని, తద్వారా వారి సమాచారాన్ని సేకరించి, వారి అభిప్రాయలు, అభిరుచులకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు మార్చుకోవచ్చుననే ఆలోచనలో బీజేపీ యంత్రాంగం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక ఒక ట్రయల్ రన్
ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి ఎనలైటికా సంస్థ లీకేజీ వ్యవహారం తర్వాత మన సమాచారం భద్రతపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు , వివిధ రకాల యాప్‌ల విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి. అదే విధంగా నమో యాప్ ద్వారా సమాచారం లీక్ అవుతోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్నాళ్ల క్రితం చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్నే లేపాయి. కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఎంతో కొంత వాస్తవం ఉందనే అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఎందుకంటే నమో యాప్ ఏకంగా 22 డేటా పాయింట్ల నుంచి వినియోగదారుల నుంచి అనుమతులు కోరుతోంది.
అందువల్ల నమో యాప్‌ను ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుంటే వారి సమాచారాన్ని సేకరించడం అత్యంత సులభమైన విషయం. అంతేకాదు నమో యాప్ పేరుకే ప్రభుత్వానికి చెందినదే అయినప్పటికీ, మోదీ తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడానికే దానిని వాడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 2015 జూన్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం ఉద్దేశించిన నమో యాప్ ఇప్పటికే కోటి డౌన్‌లౌడ్లతో పాపులారిటీని పెంచుకుంది. 2019 ఎన్నికల నాటికి 5 కోట్ల డౌన్‌లోడ్‌లు జరగాలన్న వ్యూహంలో ఉన్న ప్రధాని మోదీ అవకాశం దొరికినప్పుడల్లా నమో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ప్రచారం చేయడం చూస్తుంటే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే దానిని వాడుకుంటోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కేవలం నమో యాప్ మాత్రమే కాదు భీమ్, ఉమంగ్, మై పాస్‌పోర్ట్ సేవ, మై గవ్, ఇండియా ఓటర్స్ లిస్ట్, ఆన్‌లైన్ ఆర్‌టీఐ, ఇన్‌క్రెడిబుల్ ఇండియా.. ఇలా ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లు పరోక్షంగా బీజేపీ సమాచారణ సేకరణకే ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలైతే ఉన్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ యాప్ ఎంత సమర్థంగా పనిచేస్తుందో కర్ణాటక ఎన్నికల ద్వారా తేల్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి 13.3 కోట్ల మంది కొత్త ఓటర్లు చేరుతున్నారు.
వీరంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి యువ ఓటర్లను బీజేపీవైపు లాగాలన్న వ్యూహంలో ఉంది. ఇందుకోసం పక్కా ప్రణాళిక ప్రకారమే నమో యాప్‌ను వినియోగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ యాప్‌లన్నీ కాషాయ పార్టీకి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తాయి ? ఓటర్లలో ఉన్న మొగ్గును కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా ? లేదంటే ఆఖరి నిముషంలో టెక్నాలజీ మాయతో బీజేపీ కర్ణాటక పీఠాన్ని ఎగరేసుకుపోతుందా ? మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
- (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment