కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటకకు మెరుగైన భవిష్యత్ అందించడానికి కృషిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో బీజేపీ అడ్డంకులు సృష్టించబోదని స్పష్టం చేశారు. తాజా ఎన్ని కల్లో తాము అతిపెద్ద పార్టీగా అవతరించడం అసాధారణం, అపూర్వమని అభివర్ణించారు. ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘కర్ణాటక అభివృద్ధి పథంలో బీజేపీ అడ్డంకులు సృష్టించదని హామీ ఇస్తున్నా. రాష్ట్రానికి మెరుగైన భవిష్యత్ అందించేందుకు వెనకడుగు వేయం’అని మోదీ అన్నారు.
బీజేపీ ఉత్తర భారత్ పార్టీ అని ప్రచారం చేస్తున్న వారికి కన్నడ ప్రజలు గట్టి సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య చిచ్చుపెట్టి కొన్ని విభజన శక్తు లు ఉద్రిక్తతలు రాజేశాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అలాంటి వారు తనను ఇష్టపడకపోయినా ప్రజల మనోభావాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రచార సమయంలో భాషాపర అడ్డంకులు అధిగమించి ప్రజలకు ఎలా దగ్గర కావాలో తీవ్రంగా ఆలోచించానని, కానీ అసలు అది సమస్యే కాదని కన్నడ ప్రజలు తనపై కురిపించిన ప్రేమతో తేటతెల్లమయిందని అన్నారు.
పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రచిస్తున్న పటిష్ట వ్యూహాల వల్లే వరసగా ఎన్నికల్లో గెలుస్తున్నామని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో షా కృషిని ప్రస్తావిస్తూ..ఆయన నుంచి పార్టీ కార్యకర్తలు స్ఫూర్తి పొందాలని సూచించారు. కాగా, తమ పార్టీకి అధిక సీట్లు కట్టబెట్టిన కన్నడ ప్రజలకు మోదీ ట్విట్టర్‌లో కృతజ్ఞలు తెలిపారు. పార్టీ విజయం కోసం కృషిచేసిన నాయకులు, కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుంది: షా
బీజేపీ విజయపరంపర ఇకపైనా కొనసాగుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ అధికారం తమదేనన్నారు. మోదీ స్వచ్ఛ పాలనపై విశ్వాసం ఉంచిన కన్నడ ప్రజలు కాంగ్రెస్ విభజన, బెదిరింపు రాజకీయాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ‘ప్రజలను విభజించేందుకు కాంగ్రెస్ కుల రాజకీయాలకు తెరతీసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును సాకుగా చూపుతూ దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది’అని షా ఆరోపించారు. బీజేపీ విజయం కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన యడ్యూరప్ప, కార్యకర్తలను ట్విట్టర్‌లో అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment