Karnataka Assembly Elections 2023: Karnataka Assembly Elections Are At an Interesting Stage - Sakshi
Sakshi News home page

Karnataka Election 2023: రెండో గండం దాటేస్తారా!? 38 ఏళ్ల సంప్రదాయం.. బీజేపీ ఏం చేస్తుందో?

Published Tue, Apr 11 2023 3:32 AM | Last Updated on Thu, Apr 20 2023 5:24 PM

Karnataka assembly elections are at interesting stage - Sakshi

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్‌) పార్టీ లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో 1985 నుంచి అధికార పార్టీ వరుసగా రెండోసారి నెగ్గిన దాఖలాలు లేవు. 38 ఏళ్ల ఆ సంప్రదాయాన్ని బద్ధలుకొట్టి, మళ్లీ జెండా ఎగురవేయాలన్న కృతనిశ్చయంతో బీజేపీ ఉంది.

మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని సొంతంగానే సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది. తగిన మెజార్టీ లేక దెబ్బతిన్న అనుభవాలు ఆ పార్టీ కి ఉన్నాయి. కర్ణాటకలో గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నెగ్గి, సొంతంగా మెజార్టీ సాధిస్తే రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నట్లే.  

బొమ్మై లక్‌ ఎలా ఉందో!
కర్ణాటకలో జనతా పార్టీ నేత రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా 1983 నుంచి 1985 వరకూ మైనార్టీ ప్రభుత్వం కొనసాగింది. రాష్ట్రంలో అదే తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ కి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో రామకృష్ణ హెగ్డే తన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 224 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 139 సీట్లు గెలుచుకుంది.

1985లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జనతా పార్టీ లో విభేదాలు తలెత్తాయి. జనతా పార్టీ మూడు పార్టీలుగా విడిపోయింది. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. వీరేంద్ర పాటిల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతూ వచ్చింది.

1989 నుంచి ఇప్పటివరకూ ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రులకు మళ్లీ అదే పదవి వరుసగా రెండోసారి దక్కలేదు. మూడున్నరేళ్ల క్రితం సీఎంగా కుర్చీనెక్కిన బసవరాజ బొమ్మై తన పార్టీని గెలిపించి, మళ్లీ సీఎం అవుతారా! అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన భవితవ్యం తేలిపోనుంది.  

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆశలు  
కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలో కోట్లాది మంది లబ్ధి పొందారని, వారంతా తమకు అనుకూలంగా ఓటు వేయడం ఖాయమని బీజేపీ నాయకత్వం ఆశలు పెంచుకుంది. కర్ణాటక ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రధానమంత్రి జన సురక్ష యోజన కింద రాష్ట్రంలో 1.4 కోట్ల మంది ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున బదిలీ చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అన్ని బీపీఎల్‌ కుటుంబాలకు హెల్త్‌ కార్డులు అందజేశారు.

జన్‌ ఆవాస్‌ యోజన కింద 30 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.10 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేశారు. మరోవైపు సర్కారీ కాంట్రాక్టుల్లో ‘40 శాతం కమీషన్లు’ అనే ఆరోపణలు బొమ్మై ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోవడం, రాజధాని బెంగళూరులో కనీస మౌలిక సదుపాయాలు కొరవడడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

మోదీ–షాకు ప్రతిష్టాత్మకం  
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఎంతో శక్తిని, సమయాన్ని, కేంద్ర ప్రభుత్వ వనరులను వెచ్చిస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మళ్లీ బీజేపీని గెలిపించి, ట్రెండ్‌ను రివర్స్‌ చేయాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. గత ఏడు నెలలుగా కర్ణాటకలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

బెంగళూరు–మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ధార్వాడలో ఐఐటీ క్యాంపస్, శివమొగ్గలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫామ్‌ వంటి కీలకమైన పాజెక్టులను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోండి, డబుల్‌ ఇంజిన్‌ ప్రయోజనాలు అందుకోండి’ అని పిలుపునిస్తున్నారు.  

సంపూర్ణ మెజార్టీ యే లక్ష్యం  
రాష్ట్రంలో 2008, 2018లో బీజేపీ విజయం సాధించింది. రెండుసార్లూ 100 సీట్ల మార్కును దాటింది. కానీ, సంపూర్ణ మెజార్టీ అడుగు దూరంలోనే ఆగిపోయింది. ఇతర పార్టీ ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కానీ, అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పూర్తి మెజార్టీ దక్కించుకునేందుకు మోదీ–షా నేరుగా రంగంలోకి దిగారు. కులాలు లెక్కలు, ప్రాంతీయ సమీకరణాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ తరపున పోటీకి దిగే అభ్యర్థులను స్వయంగా ఎంపిక చేస్తున్నారు. గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు.  

‘కోటా’ కార్డు పనిచేస్తుందా?   
వేర్వేరు సామాజిక వర్గాలను ఆకట్టుకొనేందుకు బసవరాజ బొమ్మై రిజర్వేషన్‌ కార్డును ప్రయోగిస్తోంది. ఎన్నికల ప్రకటనకు కేవలం నాలుగు రోజుల ముందు రిజర్వేషన్‌ ఫార్ములాను సవరించే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఓబీసీ కేటగిరీలో ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించి, వాటిని లింగాయత్‌లు, వొక్కళిగలకు సమానంగా వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్‌) కేటగిరీలో రిజర్వేషన్లు కల్పి స్తామని హామీ ఇచ్చింది. అలాగే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచింది.

కోటా కార్డు తమకు కచ్చితంగా లాభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, రిజర్వేషన్ల విషయంలో బొమ్మై సర్కారు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. అందుకే వాటి ప్రభావం ఓటర్లపై పెద్దగా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వేషన్ల పేరిట బీజేపీ డ్రామాలు ఆడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కర్ణాటకలో ఓట్ల శాతం పెంచుకుంటేనే కాంగ్రెస్‌ గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 38 శాతం ఓట్లతో 80 సీట్లు సాధించింది. బీజేపీ కేవలం 36.2 శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గింది.   

జేడీ(ఎస్‌) బలం పాత మైసూర్‌   
కిత్తూర్‌ కర్ణాటక(పాత ముంబై ప్రాంతం), కల్యాణ కర్ణాటక(హైదరాబాద్‌ కర్ణాటక), సెంట్రల్‌ కర్ణాటకతోపాటు కోస్తా ప్రాంతంలో బీజేపీ బలంగానే ఉంది. పాత మైసూర్‌ ప్రాంతం, బెంగళూరు సిటీలో మాత్రం వెనుకబడి ఉండడం ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. ఈ రెండుచోట్ల మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

పాత మైసూర్‌లో వొక్కళిగ సామాజికవర్గం ప్రాబల్యం అధికం. 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్‌) ఇక్కడ 37 స్థానాలకు గాను 30 స్థానాలు గెలుచుకుంది. కింగ్‌మేకర్‌గా మారింది. ఆ పార్టీ నేత, వొక్కళిక సామాజికవర్గం ప్రముఖుడు హెచ్‌డీ కుమారస్వామి 14 నెలలపాటు సీఎంగా కొనసాగారు. పాత మైసూర్‌లో ఈసారి కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి, ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాలని జేడీ(ఎస్‌) భావిస్తోంది.    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement