బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, పార్టీలు తమకు సీటు ఇవ్వకపోవడంతో పలువురు సీనియర్లు, నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇక, నేటితో(ఏప్రిల్ 20)తో కర్నాటకలో నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా, ఎన్నికల ప్రచారంలో ఓటర్లును ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు.
ఇదిలా ఉండగా.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార బీజేపీ పార్టీ బిగ్ ప్లాన్స్ చేస్తోంది. మళ్లీ అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అందుకు తగిన ప్రణాళిక అమలు చేస్తుంది. ఇక, బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటకకు రానున్నారు. ఏకంగా 10 రోజుల పాటు మోదీ కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సమయంలో దాదాపు 20 ర్యాలీల్లో, భారీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొనేలా బీజేపీ ప్లాన్ చేసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెనర్ల జాబితాను సైతం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా వివధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, సెలబ్రెటీల పేర్లు ఉన్నాయి.
ఇక, కర్నాటక బీజేపీ.. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్ని ఆరు రిజియన్లుగా విభజించింది. కాగా, బెలగావి, హుబ్బల్లి నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక, జేపీ నడ్డా దాదాపు 25 ర్యాల్లీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, కర్నాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment