సమీపిస్తున్న ఎన్నికల తేదీ.. ‘హైదరాబాద్‌ కర్ణాటక’లో దిగ్గజ నేతల ఢీ | Major political parties campaign in Bidar district | Sakshi
Sakshi News home page

సమీపిస్తున్న ఎన్నికల తేదీ.. ‘హైదరాబాద్‌ కర్ణాటక’లో దిగ్గజ నేతల ఢీ

Published Thu, May 4 2023 1:17 AM | Last Updated on Thu, May 4 2023 11:05 AM

Major political parties campaign in Bidar district - Sakshi

బీదర్‌ నుంచి కల్వల మల్లికార్జున్‌ రెడ్డి:  ఉత్తర కర్ణాటకలో అంతర్భాగమైన ‘హైదరాబాద్‌ కర్ణాటక’లోని బీదర్‌ జిల్లాలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీ (ఎస్‌) నుంచి దిగ్గజ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న జేడీ (ఎస్‌) అభ్యర్థి బందెప్ప కాశెంపూర్‌ (బీదర్‌ దక్షిణ), కాంగ్రెస్‌ అభ్యర్థులు రహీమ్‌ ఖాన్‌ (బీదర్‌ ఉత్తర), ఈశ్వర్‌ ఖండ్రే (బాలీ్క), రాజశేఖర పాటిల్‌ (హుమ్నాబాద్‌), బీజేపీ అభ్యర్థి ప్రభు చౌహాన్‌ (ఔరాద్‌– ఎస్సీ) నుంచి తమ రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారు.

మరోవైపు సూర్యకాంత నాగమరపల్లి (జేడీఎస్‌– బీదర్‌ ఉత్తర), విజయ్‌ సింగ్‌ (కాంగ్రెస్‌– బసవకళ్యాణ్‌), సిద్ధూ పాటిల్‌ (బీజేపీ– హుమ్నాబాద్‌), సీఎం ఫైజ్‌ (జేడీ ఎస్‌– హుమ్నాబాద్‌), భీంసేన్‌రావు సింధే (కాంగ్రెస్‌– ఔరాద్‌) వంటి కొత్తతరం నేతలు కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ధీటైన సవాలు విసురుతున్నారు. బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ, కళ్యాణరాజ్య ప్రగతిపక్ష, కర్ణాటక రాష్ట్ర సమితి వంటి పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. 

బీదర్‌ ఉత్తర 
కాంగ్రెస్‌కు పట్టు ఉన్న బీదర్‌ ఉత్తర నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్, జేడీ (ఎస్‌) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2009, 2016 ఉప ఎన్నికలతో పాటు 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన రహీమ్‌ఖాన్‌ ప్రస్తుత ఎన్నికలోనూ బీదర్‌ (ఉత్తర) నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి బరిలో నిలిచారు.

అయితే రెండు పర్యాయాలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సూర్యకాంత నాగమరపల్లికి ఈసారి టికెట్‌ నిరాకరించడంతో చివరి నిమిషంలో జేడీ(ఎస్‌) నుంచి బరిలోకి దిగారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చి న ఈశ్వర్‌ సింగ్‌ ఠాకూర్‌కు బీజేపీ అభ్యర్థిగా టికెట్‌ దక్కింది. కాంగ్రెస్‌కు చెందిన శేషి పాటిల్‌ చావ్లీ తిరుగుబాటు
అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

బీదర్‌ దక్షిణ  
2008, 2018 ఎన్నికల్లో జేడీ (ఎస్‌) నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి బందెప్ప కాశెంపూర్‌ మరోమారు అదే పార్టీ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడిన డాక్టర్‌ శైలేంద్ర బెల్దాలే, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే అశోక్‌ ఖేనీ పోటీలో ఉన్నారు.  

బాల్కీ 
కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన బాల్కీలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ నడుమ సాగుతోంది. బాల్కీ నుంచి వరుసగా నాలుగోసారి విజయం కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే పోటీ చేస్తున్నారు. ఈశ్వర్‌ ఖండ్రే తండ్రి భీమన్న ఖండ్రే 1962, 1967, 1978, 1983లో, సోదరుడు విజయ్‌ ఖండ్రే 1989, 1994లో గెలుపొందారు. ఇక ఈశ్వర్‌ ఖండ్రే 2008, 2013, 2018లో వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించారు. గతంలో ఐదుసార్లు ఓటమి పాలైన ప్రకాశ్‌ ఖండ్రే బీజేపీ నుంచి, రవూఫ్‌ పటేల్‌ జేడీ(ఎస్‌) నుంచి పోటీ చేస్తున్నారు. 

బసవకల్యాణ్‌
బీజేపీ సిట్టింగ్‌ స్థానమైన బసవకళ్యాణ్‌లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా మాజీ సీఎం ధరమ్‌సింగ్‌ కుమారుడు, స్థానికేతరుడైన విజయ్‌ సింగ్‌ను బరిలోకి దించింది. 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన బి.నారాయణరావు కరోనాతో మరణించడంతో 2021లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన శరణు సలగర గెలుపొందారు. ప్రస్తుతం శరణు సలగర మరోమారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రిటైర్డ్‌ ఆర్టీవో సంజయ్‌ వడేకర్‌ జేడీ (ఎస్‌) నుంచి పోటీ చేస్తున్నారు.  

ఔరాద్‌ (ఎస్సీ రిజర్వుడు) 
బీజేపీ కంచుకోట ఔరాద్‌లో వరుసగా నాలుగో విజయం కోసం పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహన్‌ శ్రమిస్తున్నారు. కాంగ్రెస్, జేడీ (ఎస్‌) పార్టీలు కొత్త ముఖాలను బరిలోకి దింపాయి. విద్యావంతుడైన డాక్టర్‌ భీంసేన్‌రావ్‌ సింధే కాంగ్రెస్‌ నుంచి, జే సింగ్‌ రాథోడ్‌ జేడీ (ఎస్‌) నుంచి బరిలో ఉన్నారు.  

హుమ్నాబాద్‌
కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న హుమ్నాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్‌) నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. 2013 ఉప ఎన్నికతో పాటు 2008, 2013, 2018లో వరుస విజయాలు సాధించిన మాజీ మంత్రి రాజశేఖర పాటిల్‌ మరోమారు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వరుస ఓటములు పొందుతూ వచ్చి న సుభాష్‌ కల్లూర్‌ స్థానంలో తొలిసారిగా సిద్ధూపాటిల్‌ పోటీ చేస్తున్నారు. జేడీ (ఎస్‌) కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీం కుమారుడు సీఎం ఫైజ్‌ జేడీ (ఎస్‌) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  

ఫలితాలను శాసించేది డబ్బే 
పార్టీల కంటే వ్యక్తుల మీద ఆధారపడే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ధన ప్రభావం బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. రైతులు, పేదలకు మేలు చేసే ఉచిత పథకాలు పెద్దగా లేవు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు.   
– శ్రీనివాస్‌ భురే, ఆనంద్‌వాడీ, బాల్కీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement