కర్ణాటక ఎన్నికలంటే వంశపారంపర్య రాజకీయాలే కళ్లముందు కదలాడుతాయి. జేడీ(ఎస్) కుటుంబానికి కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసి పదవులు దక్కించుకోవడం, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా వారసులకి టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రెండో తరం, మూడో తరం కూడా తండ్రులు, తాతల పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగాలు, తల్లిపైనున్న అసంతృప్తిని మోయడానికి సిద్ధమైన కొడుకు, భార్య టికెట్ కోసం ఏకంగా కుటుంబంపైనే తిరుగుబాటు సిద్ధమైన వారితో రాజకీయం రసకందాయంలో పడింది.
తండ్రి కోసం యతీంద్ర త్యాగం
► మహాభారతంలో భీముడు, ఘటోత్కచుడు బంధం ఎలాగుంటుందో కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర మధ్య సంబంధం అలాగే ఉంటుందని చెప్పుకుంటారు. యతీంద్ర తండ్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి తన భవి ష్యత్‌ను కూడా పణంగా పెట్టారు. ఈ సారి ఎన్నికల్లో వరుణ అసెంబ్లీ సీటుని తన తండ్రి కోసం త్యాగం చేశారు. గత ఎన్నికల్లో 45 వేల ఓట్ల భారీ మెజార్టీతో వరుణ నుంచి నెగ్గిన యతీంద్ర కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సిద్దరామయ్య సీఎం అవడం కోసం ఈ సీటుని వదులుకున్నారు. కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డికె. శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి ఆశిస్తూ ఉండడంతో సిద్దరామయ్యని ఓడిస్తారన్న ప్రచారం జరుగుతోంది..వరుణ నియోజక వర్గం నుంచి పోటీపడితే సిద్దరామయ్యకి తిరుగుండదని యుతీంద్ర పోటీ నుంచి తప్పుకున్నారు.
ప్రియాంక్ ఖర్గే.. లిట్మస్ టెస్ట్
► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడైన ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తండ్రి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక సొంత రాష్ట్రంలో జరుగు తున్న తొలి ఎన్నికల కావడంతో ఈ స్థానం నుంచి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో ప్రియాంక్ 4 వేల కంటే తక్కువ ఓట్లతో నెగ్గారు. పోలీసు రిక్రూట్‌మెంట్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చి బసవరాజ్ బొమ్మై ప్రభు త్వాన్ని ఇరకాటం పెట్టడంలో విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్‌కు 140 సీట్లు ఖాయమని ప్రియాంక్ అంటుంటే, ‘ప్రియాంక్ ఖర్గే కనబడుట లేదు’ అంటూ ఆయన నియోజకవర్గంలో బీజేపీ పోస్టర్లు ఏర్పాటు చేసింది!
కుమారునికి యడ్డీ అండ
► వంశ పారంపర్య రాజకీయాలపై కాంగ్రెస్‌ను మొదట్నుంచి చీల్చి చెండాడుతున్న బీజేపీ కూడా కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. యడ్డీ 1983 నుంచి రికార్డు స్థాయిలో ఏడుసార్లు నెగ్గిన శివమొగ్గలో షికారిపుర నుంచి ఈ సారి విజయేంద్ర పోటీ పడుతున్నారు. ఎన్నికల వ్యవహారాలను తన భుజస్కంధాలపై మోస్తున్న యడియూరప్ప తన కుమారుడు విజయేంద్ర కోసం తాను స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో విజయేంద్రకు టికెట్ దక్కింది. బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా, కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ విజయేంద్రకి గతంలో రెండు సార్లు టికెట్ రాక నిరాశ చెందారు. ముచ్చటగా మూడో సారి ప్రయత్నం ఫలించడంతో ఇక ఎన్నికల్లో గెలుపుపై ఆయన దృష్టి సారించారు.
జేడీ(ఎస్)లో హాసన్ ప్రకంపనలు
► కుటుంబ పార్టీగా ముద్ర పడిన జేడీ(ఎస్)లో ఈ సారి ఎన్నికలు కుటుంబంలో చీలికకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్.డీ. దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తన భార్య భవానీ రాజకీయ ఎంట్రీకి ఇదే తగిన సమయమని భావిస్తున్నారు. హాసన్ నియోజకవర్గం నుంచి ఆమెకి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు హెచ్.డి. కుమారస్వామి హాసన్ స్థానాన్ని తన వదినకు ఇవ్వలేమని హెచ్‌పి. స్వరూప్‌కే ఇస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే హెచ్‌డి రేవణ్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారులు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ నుంచి ఎంపీగా ఉంటే, మరో కుమారుడు సూరజ్ రేవణ్ణ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు భవానీకి కూడా టిక్కెట్ ఇస్తే వారి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎనిమిదో వ్యక్తి అవుతారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే తాను, తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్‌డి రేవణ్ణ బెదిరింపులకు దిగడం పార్టీలో కలకలానికి దారి తీస్తోంది.
అమ్మ కొడుకు
► హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీపడుతున్న రామనగర్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇన్నాళ్లూ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తన కొడుకు కోసం ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. ఇటీవల నిఖిల్ రామనగర్‌లో పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో తల్లి వైఫల్యాలు ఇప్పుడు కుమారుడి భవిష్యత్‌ను ఎటు తీసుకువెళతాయా అన్న సందేహాలున్నాయి. మౌలిక సదు పాయాలు, తాగు నీటి సౌకర్యం కూడా లేకపోవ డంతో స్థానికులు నిఖిల్‌ను నిలదీస్తున్నారు. మరి ఈ స్థానం నుంచి నిఖిల్ నెగ్గుతారా లేదా అన్నది సందేహంగానే మారింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment