చిక్‌మగళూరులో బారులు తీరిన ఓటర్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో్ల కాంగ్రెస్‌కే ఎగ్జిట్ పోల్స్ జైకొట్టాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించనుందని ఇండియాటుడే–మై యాక్సిస్ సర్వే వెల్లడించింది. మెజారిటీకి 113 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్ 122 నుంచి 140 దాకా నెగ్గుతుందని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. బీజేపీకి కేవలం 62 నుంచి 80 సీట్లే వస్తాయని అంచనా వేసింది. మొత్తమ్మీద కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లొస్తాయని, బీజేపీకి 35 శాతం, జేడీ(ఎస్)కు 16 శాతం దాకా రావచ్చని తెలిపింది.
టైమ్స్ నౌ, ఇండియా టీవీ కూడా కాంగ్రెస్‌కు 120 సీట్ల దాకా వస్తాయని, బీజేపీ 90 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొన్నాయి. కాంగ్రెసే ఏకైక పెద్ద పార్టీగా నిలవనుందని బుధవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే వెలువడ్డ ఎగ్జిట్‌పోల్స్‌లో చాలావరకు పేర్కొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డా 2018 ఫలితాలతో పోలిస్తే కాంగ్రెస్ బాగా పుంజుకుందని దాదాపుగా సర్వేలన్నీ వెల్లడించాయి.
కాంగ్రెస్‌కు 100 నుంచి 112, బీజేపీ 83 నుంచి 95 సీట్లొస్తాయని సీ ఓటర్ సర్వే తేల్చింది. జన్ కీ బాత్ కాంగ్రెస్‌కు 91 నుంచి 106 స్థానాలు, బీజేపీకి 94 నుంచి 117 ఇచ్చింది. కొన్ని మాత్రం హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి. అదే జరిగితే జేడీ(ఎస్) మరోసారి కింగ్‌మేకర్ పాత్ర పోషించే అవకాశముంది. ఆ పార్టీకి 14 నుంచి 30 స్థానాలు రావచ్చని సర్వేలు తేల్చాయి. శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి.
38 ఏళ్లుగా కన్నడ ఓటర్లు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని సంగతి తెలిసిందే. ఈ చరిత్రను ఈసారి ఎలాగైనా తిరగరాయాలని బీజేపీ ప్రచారంలో సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని మోదీ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతటా కలియదిరిగారు. పదుల కొద్దీ బహిరంగ సభలు, ర్యాలీలు, మెగా రోడ్ షోలతో హోరెత్తించారు. కాంగ్రెస్ కూడా ఈసారి స్పష్టమైన మెజారిటీ సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన నేపథ్యంలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 81 ఏళ్ల వయసులోనూ రాష్ట్రమంతటా తిరిగి శ్రమించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వద్రా రోజుల తరబడి జోరుగా ప్రచారం చేశారు.
2018లో అలా...
ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 116, కాంగ్రెస్‌కు 69, జేడీ(ఎస్)కు 29 స్థానాలున్నాయి. 2018లో కూడా హంగ్ అసెంబ్లీయే ఏర్పడింది. 104 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌కు 80, జేడీ(ఎస్)కు 37 సీట్లొచ్చాయి. బీఎస్పీ, కేపీజేపీ, స్వతంత్రులకు ఒక్కో స్థానం దక్కింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణంగా ఏర్పడే ప్రయత్నాల్లో ఉండగానే బీజేపీ ప్రభత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ మెజారిటీ నిరూపించుకోలేక బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. అనంతరం ఊహించినట్టుగానే కాంగ్రెస్–జేడీ(ఎస్) జట్టు కట్టి కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ పాలక కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరడంతో సర్కారు 14 నెలలకే కుప్పకూలింది. మళ్లీ బీజేపీ గద్దెనెక్కింది. తర్వాత 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పన్నెండింటిని బీజేపీ గెలుచుకుని మెజారిటీ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment