బిహార్‌లో ఎన్డీఏ సోషల్‌ ఇంజనీరింగ్‌ | Political Parties Conflicts In Bihar Loksabha Elections | Sakshi
Sakshi News home page

బిహార్‌లో ఎన్డీఏ సోషల్‌ ఇంజనీరింగ్‌

Published Thu, Mar 28 2019 11:43 AM | Last Updated on Thu, Mar 28 2019 1:25 PM

Political Parties Conflicts In Bihar Loksabha Elections - Sakshi

బిహార్‌లో బీజేపీ తాను పోటీచేస్తున్న 17 సీట్లలో అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ప్రయోగాల జోలికి పోలేదు. మూడు సీట్లలో మినహా పాత అభ్యర్థులకే టికెట్లు ఇచ్చింది. సాధ్యమైనంత వరకూ సామాజిక సమతూకం పాటించింది. గెలుపులో కీలకపాత్ర పోషించే అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించేలా అభ్యర్థులను ఎంపిక చేసింది. కొత్త అభ్యర్థులు అశోక్‌ యాదవ్‌ (మధుబనీ), గోపాల్జీ ఠాకూర్‌ (దర్భంగా), కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌(పట్నా సాహిబ్‌)లో ప్రసాద్‌ ఒక్కరే ఎన్నికల రాజకీయాలకు కొత్త. ఆయన గతంలో ఎప్పుడూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయలేదు. యాదవ్‌ కేవతీ మాజీ ఎమ్మెల్యే కాగా 2010లో ఠాకూర్‌ బేనీపుర్‌ నుంచి అసెంబ్లీకి బీజేపీ టికెట్‌పై ఎన్నికయ్యారు. 2015 ఎన్నికల్లో జేడీయూ చేతిలో ఠాకూర్‌ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో దర్భంగా నుంచి బీజేపీ తరఫున గెలిచిన కీర్తీ ఆజాద్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. మధుబని బీజేపీ ఎంపీ హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ బదులు ఆయన కొడుకు అశోక్‌కు టికెట్‌ ఇచ్చారు. మిగిలిన 14 మంది బీజేపీ సిట్టింగ్‌ ఎంపీల్లో ఐదుగురు కేంద్రమంత్రులు రాధామోహన్‌సింగ్, గిరిరాజ్‌సింగ్, రాంకృపాల్‌ యాదవ్, అశ్వనీ చౌబే, ఆర్కే సింగ్‌ మళ్లీ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్‌రాయ్‌ ఉజియార్‌పూర్‌ నుంచి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ప్రతాప్‌ రూడీ సారణ్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కిందటిసారి భాగల్పూర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌కు అరరియా టికెట్‌ ఇవ్వజూపినా ఆయన పోటీకి నిరాకరించారు.

కులాల సమతూకం
ఎన్డీఏతో పోటీకి ఆర్జేడీ నాయకత్వంలోని మహాగఠ్‌బంధన్‌ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నందున బీజేపీ అంతే శ్రద్ధతో తన అభ్యర్థులను ఎంపిక చేసింది. కేంద్ర మంత్రులు, ప్రస్తుత సభ్యులకు మళ్లీ టికెట్లు ఇవ్వాలనేది రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ నిర్ణయం. కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ పాత స్థానం బెగూసరాయ్‌ని ఈసారి జేడీయూకు కేటాయించడంతో ఆయన నవాదా నుంచి పోటీ చేస్తున్నారు. 39 సీట్లకు సంబంధించిన ఎన్డీఏ జాబితాలో 13 మంది అగ్రకులాలకు చెందిన వారు. 12 మంది బీసీలు, ఏడుగురు బాగా వెనుకబడిన కులాల వారు (ఈబీసీ). ఈబీసీలైన ధనుక్, కేవట్, గంగేయీ, గోసాయీ, గంగోటా, చంద్రవంశీ కులాలకు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ ఆరుగురు ఎస్సీలకు రిజర్వ్‌డ్‌ సీట్లలో టికెట్లు ఇచ్చింది. అగ్రవర్ణాల్లో ఏడుగురు రాజపుత్రులు, ముగ్గురు భూమిహార్లు, ఒక కాయస్థ, ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు. బీసీల్లో ఐదుగురు యాదవులు, ముగ్గురు కుష్వాహాలు, ఒక కూర్మీ, ఇద్దరు వైశ్యులు (ఈ వైశ్యులను బిహార్‌లో బీసీలుగా పరిగణిస్తారు) పోటీ చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థుల్లో రవిదాస్‌ (చర్మకారులు), ముషాహర్‌ కులాల వారికి చెరొకటి కేటాయించారు. మిగిలిన నలుగురూ పాస్వాన్‌ కులస్తులు. కిషన్‌గంజ్‌లో జేడీయూ ముస్లిం అభ్యర్థిని (మహ్మద్‌ అష్రఫ్‌) నిలబెడుతోంది. కాయస్థ వర్గానికి చెందిన మాజీ నటుడు శత్రుఘ్నసిన్హా స్థానంలో ఇదే కులానికి చెందిన మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను పట్నాసాహిబ్‌ సీటుకు బీజేపీ ఎంపిక చేసింది. సిన్హా ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసే అవకాశాలున్నాయి. ఆర్జేడీకి యాదవుల్లో గట్టి పునాది ఉన్న కారణంగా అదే కులానికి చెందిన నిత్యానంద్‌ రాయ్‌కు, రాంకృపాల్‌సింగ్‌కు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. కాని, బ్రాహ్మణ–బనియా పార్టీ అనే పేరు చెరిపేసుకోవడానికి ఇద్దరు బ్రాహ్మణులు అశ్వనీ చౌబే (బుక్సర్‌), గోపాల్జీ ఠాకూర్‌ (దర్భంగా)కు మాత్రమే బీజేపీ టికెట్లు ఇచ్చింది.

రెబెల్‌ ట్రబుల్‌
ఈసారి అనేక కారణాలతో ప్రధాన పార్టీల టికెట్లు లభించని ప్రముఖ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీంతో పలుచోట్ల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. రెండేసి సార్లు లోక్‌సభకు ఎన్నికైన అరుణ్‌కుమార్‌ (జెహానాబాద్‌), ఓంప్రకాశ్‌యాదవ్‌ (సివాన్‌), ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్‌గా కూడా పనిచేసిన ఉదయ్‌నారాయణ్‌ చౌధరి, బంకా మాజీ ఎంపీ పుతుల్‌ కుమారి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిఖిల్‌కుమార్, గయ నుంచి రెండుసార్లు గెలిచిన హరి మాంఝీ ఇలాంటి అసంతృప్త నేతల్లో ఉన్నారు. మాజీ మంత్రి, భర్త దిగ్విజయ్‌సింగ్‌ మరణించాక 2010లో బంకా నుంచి ఉప ఎన్నికలో గెలిచిన పుతుల్‌కుమారి (జేడీయూ) 2014లో ఆర్జేడీ నేత జైప్రకాశ్‌నారాయణ్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు. ఆమెకు బదులు గిరిధారీ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. పుతుల్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలనే పట్టుదలతో ఉన్నారు. సివాన్‌లో నేర నేపథ్యమున్న ఆర్జేడీ నేత షహాబుద్దీన్, ఆయన భార్యను ఓడించిన బీజేపీ ఎంపీ ఓంప్రకాశ్‌ యాదవ్‌కు ఈ సీటు జేడీయూకు కేటాయించడంతో ఈసారి పోటీచేసే అవకాశం రాలేదు. ఆయన కూడా రెబెల్‌గా బరిలోకి దిగే అవకాశముంది. మహాభారతంలో అభిమన్యుడిలా తనను వాడుకుని వదిలేశారని యాదవ్‌ ఆరోపించారు. మాజీ స్పీకర్‌ ఉదయ్‌ చౌధరి (జేడీయూ) కిందటి పార్లమెంటు ఎన్నికల్లో జమూయి రిజర్వుడు స్థానంలో ఎల్జేపీ నేత చిరాగ్‌ పాస్వాన్‌ చేతిలో ఓడిపోయారు. 2017లో జేడీయూ మళ్లీ ఎన్డీఏలో చేరడంతో దళితుడైన చౌధరి తన పార్టీకి రాజీనామా చేసి ఆర్జేడీ కూటమికి దగ్గరయ్యారు. అయినా ఆయనకు జమూయిలో కూటమి టికెట్‌ దక్కలేదు. ఔరంగాబాద్‌ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిఖిల్‌కుమార్‌కు టికెట్‌ నిరాకరించడంతో ఆయన అనుచరులు పార్టీ ఆఫీసుపై ఆగ్రహం ప్రదర్శించారు. ఆయన రెబెల్‌గా పోటీచేయకుండా నివారించడానికి కాంగ్రెస్‌ ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేతలు తిరుగుబాటుదారులుగా పోటీకి దిగితే ప్రధాన అభ్యర్థుల గెలుపోటములు తారుమారవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement