
బోర్డు మీటింగ్ మొదలైంది. మీటింగ్‌లో ‘ఈ’ పేపర్ ఓనరు ఉన్నాడు. ‘ఆ’ పేపర్ ఓనరూ ఉన్నాడు. ఏ పేపరుకు ఆ బోర్డు మీటింగు ఉండాలి కానీ, జగన్ మీద ఏమైనా రాయాలనుకున్నప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి ఒకే బోర్డు మీటింగు పెట్టుకుంటారు. ఒక మైండ్‌కి, ఒకటికన్నా ఎక్కువ మైండ్స్ కలిస్తే క్రియేట్ అయ్యే ‘క్రియేటివ్ మైండ్’కి తేడా ఉంటుందని వాళ్ల నమ్మకం. ‘మూడో మైండ్ ఏదీ’ అన్నాడు ‘ఈ’ పేపర్ ఓనరు. ‘దారిలో ఉన్నట్లున్నాడు’ అన్నాడు ‘ఆ’ పేపరు ఓనరు. మీటింగులో రెండు పేపర్‌ల సర్క్యులేషన్ మేనేజర్‌లు కూడా ఉన్నారు!
‘‘నేరాల్లో జగన్ జెంత్రీ.. అదిరిపోయింది కదా ఈరోజు మన హెడ్‌లైన్. జగత్‌కి బదులు జగన్ అని పెట్టాం. జగన్‌కి రెడ్ కలర్ ఇచ్చాం’’ అన్నాడు ‘ఈ’ పేపర్ ఓనరు.
‘‘అవునవును. కొంచెం మార్చి మేమూ అదే పెట్టాం. జగన్‌కి ఓటేస్తే మరణ శాసనమే అని పెట్టాం’’ అన్నాడు ‘ఆ’ పేపర్ ఓనర్.
ఎవరో గుర్రున చూసినట్లనిపించింది ‘ఈ’పేపర్ ఓనరుకి. ‘‘ఎవరు గుర్రున చూసింది?’’ అని అడిగాడు.
‘ఈ’ పేపర్ సర్క్యులేషన్ మేనేజర్ లేచాడు! ‘‘పొద్దుట్నుంచీ రీడర్స్ నుంచి ఒకటే ఫోన్‌లు’’ అన్నాడు ఈ.స.మే.. చేతులు నలుపుకుంటూ. ‘ఏంటటా’ అన్నట్లు చూశాడు ‘ఈ’ ఓనరు. ‘‘నీయబ్బ రేయ్’’ అని తిడుతున్నారు అన్నాడు ఈ.స.మే.
‘‘అరే! మాకూ అలాగే ఫోన్‌లు వస్తున్నాయి’’ అన్నాడు ‘ఆ’ పేపర్ సర్క్యులేషన్ మేనేజర్ లేచి.
‘‘ఎలాగా.. నీయబ్బ రేయ్ అనేనా’’ అన్నాడు ఈ.స.మే.. ఆ.స.మే. వైపు ఆసక్తిగా చూస్తూ.
‘‘కాదు.. ‘నీ యబ్బ రేయ్’ అని కాదు, ‘రేయ్ నీ యబ్బా’ అని వస్తున్నాయి’’ అన్నాడు ఆ.స.మే.
‘‘ఎందుకటా’’ అడిగారు ‘ఈ’ ఓనరు, ‘ఆ’ ఓనరు. ‘‘2014 మార్చి దిన పత్రికల్నే మళ్లీ ఇప్పుడెందుకు వేస్తున్నారు బే’’ అని రీడర్స్ అడుగుతున్నారు సార్’’ అన్నాడు ఈ.స.మే.
‘‘మమ్మల్నీ అలాగే అడుగుతున్నారు.. ఎందుకు బే 2014 మార్చి దినపత్రికల్నే మళ్లీ ఇప్పుడు వేస్తున్నారు అని’’ అన్నాడు ఆ.స.మే.
‘‘డేట్ చూసుకోమనకపోయారా?!’’ అన్నారు ‘ఈ’ ఓనరు, ‘ఆ’ ఓనరు.
‘‘చూసుకున్నారట. ఇయర్ 2019 అనే ఉంది. న్యూస్ మాత్రం 2014 లో ఇచ్చిందే ఉందట’’ అన్నారు ఈ.స.మే., ఆ.స.మే.
మూడో మైండ్ బోర్డు రూమ్‌లోకి వచ్చింది.
‘‘ఇంత లేటేమిటయ్యా నువ్వు’’ అన్నాడు ‘ఈ’ ఓనరు చికాగ్గా. మూడో మైండ్ గుడ్లురిమి చూశాడు.
‘‘ఉరిమావా? ఉరమబోతున్నావా? ఏంటి ఆ ఎక్స్‌ప్రెషన్? ‘నువ్వు’ అన్నందుకు కోపం వచ్చిందా. నాకన్నా పద్నాలుగేళ్లు చిన్నవాడివి. ‘నువ్వు’ అంటే తప్పేముంది చెప్పు?’’ అన్నాడు ‘ఈ’ ఓనరు.
‘‘నాకైతే చిన్నా పెద్దా లేదు ఎంతటివారినైనా ‘నువ్వు’ అనే అంటా. నా చానెల్లో నా ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది..’’ అన్నాడు ‘ఆ’ పేపరు ఓనరు.. మూడో మైండ్ వైపు చూస్తూ.
‘‘చెప్పవయ్యా.. ఎంతసేపూ మేమిద్దరం నిన్ను పికప్ చేసుకోవడమేనా? నీకై నువ్వు పికప్ అయ్యేది ఉందా?’’ అన్నాడు ‘ఈ’ పేపరు ఓనరు. ‘‘అవునవును.. నేనూ అదే అడగబోతున్నా..’’ అన్నాడు ‘ఆ’పేపరు ఓనరు.
మూడో మైండ్ కోపంగా పైకి లేచాడు.
‘‘ఏంటి మీరు పికప్ చేసేదీ! నాకూ రెండ్రోజుల నుంచి 2014 పేపర్లే వస్తున్నాయి. ఇదిగో ఇవాళ్టి పేపరు. ఇదిగో మా ఇంట్లో ఉన్న ఐదేళ్ల నాటి పేపర్. సేమ్ టు సేమ్. జనం నమ్మాలా వద్దా..!’’ అని బోర్డు మీటింగు నుంచి బయటికి వెళ్లిపోయాడు. –మాధవ్
Comments
Please login to add a commentAdd a comment