‘‘అత్తెసరు సీట్లు సంపాదించి.. ఏదో ఒకటీ అరా సీటు మెజారిటీ వచ్చిందంటే వచ్చిందంటూ.. ఎలాగోలా గెలవడానికి రాలేదురా నేనూ. కనీసం టూ థర్డ్స్ మెజారిటీతో లాండ్‌స్లైడ్ విక్టరీ కోసమే ఇంతగా కష్టపడుతున్నా’’ మహేశ్‌బాబును ఇమిటేట్ చేస్తూ ఓ డైలాగ్ కొట్టాడు మా రాంబాబు గాడు.
‘‘నువ్వు అలాగంటావా..? అయితే నా మాట కూడా విన్కో. ఎవ్వర్ని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతుందో.. వాడే రా జగన్’’ అంటూ మళ్లీ మహేశ్‌బాబునే ఎంచుకున్నాడు సత్తిబాబు.
ఈ సినీ డైలాగుల కథ తెలియాలంటే కాస్త ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. రోజూలాగే ఆ రోజు మా ఊరి యూత్ అంతా పొద్దున్నే కమ్యూనిటీ హాల్ దగ్గర పేపర్ చదువుతూ నిలబడ్డారు. అలా రోజూ అక్కడ చేరి పొద్దున్నే పక్కనే ఉండే పుల్లమ్మ వేసే పుల్లట్లూ, ఇడ్లీ విత్ కారప్పొడీ తింటూ రాజకీయాలూ, సినిమాల గురించి మాట్లాడుకోవడం వాళ్లకలవాటు.
తెల్లారి లేస్తే సినిమాలు తప్ప ప్రపంచం ఎరగని యువత వాళ్లు. కానీ ప్రస్తుతం రాజకీయాల సీజన్ నడుస్తుండటంతో అందరూ వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఓ న్యూస్ పేపర్ ‘అసలు జగన్‌కు ఒక్కసారైనా అవకాశం ఎందుకివ్వాలి’ అంటూ ఓ శీర్షికతో న్యూస్ ఐటమ్ కనిపించింది. అంతే ఒక్కసారిగా ఎంతో మండిపోయింది వాళ్లకు.
అసలే పద్దెనిమిదేళ్లూ, ఇరవై నాలుగేళ్ల మధ్య యూత్ వాళ్లు. దాంతో ఫేమస్ సినీ హీరోల పంచ్ డైలాగులూ, రాజకీయాలను మిక్స్ చేస్తూ జగన్ గెలవడం ఎందుకు అవసరమో సినిమా డైలాగ్స్ రూపంలో చెప్పుకోవాలనుకున్నారు. అంతే.. ఒక్కొక్కడూ తమ తమ టాలెంట్స్ చూపడం మొదలుపెట్టాడు.
జగన్ అభిమాని ఒకడు లేచి.. ‘‘ఒరేయ్.. ఆయన మీద అభిమానం కొద్దీ జగనన్నను ఇమిటేట్ చేయడం, జగనన్నలా మాట్లాడటం నా వల్ల కాదుగానీ ఓ అభిమానిలా మామూలు డైలాగ్ కొడతాను. వినండి. నేనుగానీ బూత్ లెవెల్లోకెళ్లి జనాలతో ఓట్లేయించడం మొదలుపెడితే.. పొరుగూరూ, పక్కూరూ వాళ్లతో సహా ఎంత మందితో ఓట్లేయించానో లెక్కబెట్టాలంటే అమెరికా కంప్యూటర్లు దిగాలి’’ అన్నాడు.
మరొకడు లేచి.. అటు చంద్రబాబు డైలాగూ.. ఇటు జగనన్న డైలాగూ వాడే చెప్పడం మొదలుపెట్టాడు.
‘‘పాలిటిక్స్‌లో నాది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఫార్టీ ఇయర్స్ ఇక్కడ’’ అని వాడే అనేసి వెంటనే మళ్లీ మహేశ్‌బాబు గొంతులోకి దిగిపోయి.. ‘‘(పాలిటిక్స్‌లోకి) ఎప్పుడొచ్చావని కాదన్నయ్యా... (ఈసారి) గెలిచావా లేదా అనేదే లెక్క’’ అంటూ యాటిట్యూడ్ చూపించాడు.
‘‘ఎవరు రైతుల కష్టాలు తెలుసుకోడానికి వేల మైళ్లు పాదయాత్ర చేశాడో, ఎవరు జనం వెతలు తీర్చడానికి హోదా కోసం మొదట్నుంచి కట్టుబడ్డాడో, ఎవరు వస్తే మళ్లీ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు మొదలవుతుందో.. ఆయనేనమ్మా జగన్మోహన్‌రెడ్డీ’’ అనేసి కూర్చున్నాడు ఇంకొకడు.
‘‘ఇప్పుడు ఒక్కొక్కరు విడివిడిగా పోటీ చేయడం లేదు షేర్‌ఖాన్. జనసేన అని ఒకరూ, బీఎస్పీ అనే రూపంలో ఇంకొకరు, కాంగ్రెస్ అని వేరొకరూ.. ఇలా తాము వేర్వేరూ అంటూ అందరూ కట్టగట్టుకొని అందరూ తెలుగుదేశం కోసమే పోటీ చేస్తున్నారు. అయినా అందర్నీ కట్టగట్టుకొని రమ్మను షేర్‌ఖాన్’’ అంటూ మరో యువకుడు ధాటిగా చెప్పాడు.
‘‘అరేయ్ అంతా మన రాష్ట్రం గురించే చెప్పుకుంటున్నాం. మరి పక్క తెలుగు రాష్ట్రం పరిస్థితేమిటో’’
‘‘ఏముందీ అక్కడ ఒకే ఒక్కడు.. తిరుగులేని మనిషి’’
‘‘అంతా హీరోల గురించే చెప్పుకుంటే ఎలా... ప్రత్యర్థికీ ఏదో ఒక సినిమా డైలాగ్‌ను అంకితం చేయకపోతే ఎలా?’’
‘‘సరే నువ్వింతగా అడుగుతున్నావ్ కాబట్టి ఆయనకూ ఇచ్చేద్దాం కొన్ని టైటిల్స్.. మోసగాడు, కేటుగాడు, దొంగలకు దొంగ, గజదొంగ’’– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment