‘‘అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే’’ అన్నది మిస్సమ్మలోని ఓ ఫేమస్ పాట. భవిష్యత్తులో బాబుగారనే ఓ క్యారెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతోందని తనకింకా తెలియకుండానే పింగళి వారు ఆ పాట రాసేశారు.
కానీ నిజానికి భగవంతుడు మహాస్రష్ట, భవిష్యద్దర్శీ అయిన పింగళి వారితో ఓ పాట రాయించాలనుకున్నాడట. ఆ పాటేమిటంటే.. ‘‘అవునంటే కాదని లే.. కాదంటే అవుననిలే బాబుగారి మాటలకూ అర్థాలే వేరులే..’’ అని.
అయితే ఆ సినిమా వచ్చే నాటికి బాబుగారి వయసు జస్ట్ ఐదేళ్లే. కాబట్టి ఆ బాబుగారెవరో, ఆయన అనే మాటలేమిటో, వాటి అర్థాలు ఎలా వేరో అని అర్థమయ్యే అవకాశం లేదు. కొంతమంది కవులూ, రచయితలు భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహాస్రష్టలు. వాళ్లు రాసే అక్షరమక్షరమూ నిజమైపోతుందట. దానికెన్నో తార్కాణాలున్నాయి. దానికి ఉదాహరణే ఈ కథ.
ఓ రోజున కాళిదాసుకు చేపలు తినాలనిపించింది. ఫిష్ మార్కెట్‌కెళ్లి ముళ్లు తక్కువ ఉండే చేపలు ప్యాక్ చేయించుకుని వెనక్కుతిరిగాడు. ఎదురుగా భోజరాజు. పొట్లాన్ని చూసీచూడగానే అక్కడేదో ‘సమ్‌థింగ్ ఫిషీ’ అనిపించింది భోజరాజుకు. అడగనే అడిగాడు ‘ఏమిటది?’ అని. అప్పుడు కాళిదాసు.. ‘ఆ.. రాజు చూడొచ్చాడా’ అని మనసులో అనుకుని.. ‘అది రామాయణ గ్రంథం’ అంటూ ఓ అబద్ధమాడేశాడు. ‘నీళ్లు కారుతున్నాయేమిటి?’ అని భోజుడి ప్రశ్నకు.. ‘అది కావ్యసారం’ అని కాళిదాసు జవాబు. ‘వాసనొస్తుందేమిట’న్న ప్రశ్నకు ‘రామరావణ యుద్ధంలో చనిపోయిన సైనికుల శవాల కంపు’ అని బదులిచ్చాడు.
కాళిదాసు చెప్పేది అబద్ధమనీ, ఫిష్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తీరాలని భోజరాజు పొట్లం విప్పి చూపించమంటే.. కాళిదాసుకు చూపించక తప్పలేదు. తాను కాళికాదేవి పరమభక్తుడు కావడంతో భక్తుడి పరువు నిలపడానికి అమ్మ తన వంతు ప్రయత్నం చేసింది. పొట్లాం విప్పితే రామాయణ గ్రంథం కనిపించిందట భోజుడికి.
అలాగే తిక్కనగారికి కూడా ఏం రాయాలో తెలియక ఓసారి ‘ఏమని చెప్పను గురునాథా?’ అంటూ పక్కనున్న వ్రాయసకారుడితో ఏదో అంటే.. అది గణాలతో సహా చక్కగా ‘కురునాథా’ అని కుదిరిపోయిందట.
పింగళివారు కూడా మహారచయితే కదా. అందుకే ‘‘బాబుగారి మాటలకూ అర్థాలే వేరులే’’ అనిపించాడు దేవుడు.
ఉదాహరణకు.. మహిళల రక్షణ కోసం ఆయన రావాల్సిందే అంటూ అప్పట్లో ఆయన యాడ్ చేసి లోకం మీదికి వదిలాడు. తీరా వాస్తవంలో ఏం జరిగిందీ?
డ్యూటీ సక్రమంగా చేసినందుకు వనజాక్షిని ఏడిపించారు. రిషితేశ్వరి అనే స్టూడెంట్‌ను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆక్వా పార్క్‌కు అడ్డుపడ్డ సత్యవతిని అక్రమంగా అరెస్టు చేయించి, పోలీసులతో వేధించారు. అనంతపురం జిల్లా జల్లిపల్లిలోని ఓ దళిత మహిళను బట్టలిప్పిమరీ కొట్టారు. న్యాయం అడగడానికి వచ్చిన డ్వాక్రా మహిళల్ని, ఎక్కడికి తరలిస్తున్నారో తెలియకుండా తీసుకెళ్లి వదిలారు. సివిల్ సర్వెంట్ కావాల్సిన గౌతమిని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చూపారు.
తెలంగాణలో తమ పార్టీ నుంచి జంప్ అయిన వారిని ఓడించమని పిలుపిచ్చారు. సొంత రాష్ట్రంలో మాత్రం పక్క పార్టీ వారికి మంత్రి పదవులిచ్చారు.
ఇక మిగతా వాగ్దానాల్లో శాంపిల్‌గా కొన్నింటిని మాత్రమే చూద్దాం. ప్రపంచస్థాయి రాజధాని అన్నారు. ఇప్పటికి కాలేదు. జాబులన్నారు రాలేదు. 2016కు దుర్గగుడి ఫ్లైఓవర్.. 2018కి పోలవరం అన్నారు. ఇంకా పూర్తవ్వలేదు.‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటాడు.. అంతలోనే ‘నా భవిష్యత్తుకు మీరే బాధ్యత’ అని మాటమారుస్తాడు. ఇలా ఒకటా... రెండా ‘బాబుగారు ఏ మాట మాట్లాడినా సరే.. అది ‘అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే’.
ఓ మహానుభావుడు చెబుతున్న ఈ కథను వింటున్న ఓ పాఠకుడు చివరగా .. ‘‘గురువుగారూ.. పింగళివారు బాబుగారిని ఉద్దేశించే ఆ పాట రాశారని మీకెలా తెలుసు?’’ అని ప్రశ్నించాడు. ‘‘అది చెప్పడం కోసమే కదా నన్ను పుట్టించి పింగళివారి ప్రతిభ మరోమారు లోకానికి వెల్లడయ్యేలా చేశాడు అనేక లీలావినోద ప్రదర్శనధారి అయిన ఆ దేవదేవుడు!’’ – యాసీన్
Comments
Please login to add a commentAdd a comment