కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు బాబుగారు. ఆయన అలా తిరగడానికి కారణం కూడా ఓ పిల్లి. పొద్దున్నే హెరిటేజ్ పాలను తెచ్చి, ఓ గిన్నెలో పోసి, డైనింగ్ టేబుల్ మీద ఉంచితే.. ఓ పిల్లి వచ్చి ఆ పాలన్నీ తాగేసిందట. కొంచెం కూడా మిగల్చకుండా మింగేసిందట. మామూలుగా అయితే పిల్లులన్నీ ఎలా వస్తాయ్? పిల్లుల్లా చప్పుడు చేయకుండా వస్తాయ్. కానీ ఈ పిల్లో? లోపలికి వచ్చే ముందర అది ‘మ్యావ్.. మ్యావ్’.. అందట. అంటే ఏమిటి? మొదట ‘మై ఆవూ‘‘.. మై ఆవూ‘‘’ అంటూ పర్మిషన్ అడిగింది.
పైగా ‘ఛాయ్.. ఛాయ్... ఇష్షూ.. ఇష్షూ’ అంటూ తరిమేస్తున్నా మళ్లీ మళ్లీ ‘మై ఆవూ.. మై ఆవూ’ అందట. ఆల్రెడీ లోపలికొచ్చేశాక, పాలన్నీ తాగేశాక మళ్లీ ‘మై ఆవూ’ ఏమిటి? కడాన ఎవరి కోసరం ఈ ‘మై ఆవూ’ అంటూ పిల్లి వినయాలు? ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూ వాడకం కాస్తంత తక్కువ కదా. మరి అది అలా ధారాళంగా ఉర్దూ మాట్లాడిందంటే దానర్థం ఏమిటి? ఒకవేళ అది తెలంగాణ పిల్లి కావచ్చా? కావచ్చు.
బహుశా కేసీఆర్ ప్రేరేపిత తెలంగాణ పిల్లే కావచ్చది. ‘‘పొద్దున్నే యోగా చేసుకున్న తర్వాత హాయిగా గ్లాసు నిండా పాలు తాగి ప్రచారానికి బయల్దేరుదామనుకున్నా. ఇప్పుడది పాలన్నీ తాగేసింది. దాంతో పాలు తాగకుండానే ప్రచారానికి.. అలా ముందుకు పోవాల్సి వస్తోంది. అంటే ఇన్‌డైరెక్ట్‌గా నన్ను వీక్ చేయడానికి ప్రయత్నించింది. కావచ్చు. నా ప్రచారాన్ని సరిగా సాగకుండా చేసేందుకు, ఇలా ఇన్‌డైరెక్ట్‌గా జగన్‌కు సాయం చేసేందుకు వచ్చిన పిల్లేనా?
ఆలోచించగా ఆలోచించగా నాకు మరో విషయమూ తడుతోంది. ఒకవేళ పిల్లి మాట్లాడింది ఉర్దూ కాదనుకుందాం. హిందీ అనుకుందాం. అంటే.. ఈ కుట్రలో బహుశా మోడీ పాత్ర కూడా ఉండే ఉండొచ్చు. పిల్లిది మాటల్లో కొంచెం నార్తిండియా గుజరాతీ యాస కూడా కనిపించనట్టయ్యింది’’ అని అనుకున్నారు బాబుగారు.
వెంటనే తానేమన్నా సరే తానా తందానా అనే ఓ బ్యాచిని పిలిపించారు బాబుగారు. తన ఆలోచనలన్నీ చెప్పారు. ‘‘కాదండి. ఆవేదన ఉండదా అండీ. పొద్దున్నే పాలు తాగి ప్రచారానికి వెళ్దామనుకుంటే.. తగినంత ఎనర్జీ లేకుండా జగన్ కోసం ఇలా పక్క రాష్ట్రమాయనా, కేంద్రప్రభుత్వమాయనా ఇలా కుట్ర చేస్తే రక్తం మరగదా అండీ’’ అంటూ వాపోయారు బాబుగారు.
‘‘సార్.. ఇప్పటివరకూ మనం చేసిన ప్రతి పాపాన్నీ పాపం జగన్‌కే అంటగడుతూ వస్తున్నాం. అవన్నీ చేయడం ఆయనకే నష్టం కదా అనే లాజిక్‌ను కూడా ప్రజలకు తట్టనివ్వకుండా ఊదరగొడుతూ వస్తున్నాం. ఇప్పుడు పిల్లి చేసిన పనికీ ఆయననే బాధ్యుడిని చేస్తే కుదరదేమో సార్’’ అన్నారు తైనాతీ బ్యాచి.
‘‘ఎందుక్కుదరదూ? ఇప్పటివరకూ సక్సెస్‌ఫుల్‌గా జరగలేదా? అలాంటప్పుడు ఇప్పుడేమిటి అభ్యంతరం?’’ అడిగారు బాబుగారు.
‘‘మొన్నటి వరకూ ఏదో ఓ సాకు పెట్టుకుని జగన్ దగ్గర్నుంచి మన దగ్గరికి వచ్చినవాళ్లంతా ఇప్పుడు అక్కడికి చేరి.. మనను విశ్వసించడం తప్పనీ, జగనే విశ్వసనీయతకు మారుపేరనీ అంటున్నారు’’ వినయంగా చెప్పారు.
‘‘సీటు దక్కనివాళ్లు అలా ప్రచారం చేస్తున్నారని టముకేయండి’’ అసహనంగా అరిచారు బాబుగారు.
‘‘కానీ మనం తప్పక టికెట్టు, సీటూ ఇస్తామన్నా కూడా వారు లగెత్తి అదే పోకడ పోతున్నారు సార్’’
‘‘కాదండి.. ఆవేదన ఉండదాండీ.. సీట్ ఇస్తామన్నా కూడా అలా పారిపోతుంటే రక్తం మరగదా అండీ’’ అంటూ మరోమారు గొణుక్కుంటూ కొత్త ఎత్తుగడ ఏమేద్దామా, మనం చేసిన పాపాల్ని ప్రత్యర్థి మెడలో ఎలా వేద్దామా అంటూ సాలోచనగా ఉండిపోయారు బాబుగారు. – యాసీన్
Comments
Please login to add a commentAdd a comment