అప్పట్లో పాత రోజుల్లోని ఓ అడవిలో జరిగిన కథ ఇది. ఓ రోజున రెండు పిట్టలకు ఒక రొట్టె దొరుకుతుంది. రొట్టె నాదంటే, నాదని అవి రెండూ వాదించుకున్నాయి. తాను న్యాయం చేస్తానంటూ ఒక పిల్లి ఆ రెంటినీ ఒప్పించింది. రొట్టెను రెండు సమాన భాగాలుగా చేస్తానంటూ, కావాలనే ఒక ముక్క కాస్త పెద్దగా ఉండేలా కట్ చేసింది. అదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయినట్టు పోజు పెడుతూ... అయ్యో దీన్లో కాస్త ఎక్కువొచ్చిందే అంటూ అందులో కొంత భాగం తినేసింది. ఈసారి ఆ రెండో ముక్క దీని కంటే పెద్దగా ఉంది. అరె ఈసారిది పెద్దదయ్యిందంటూ దాన్లోనూ కొంత తినేసింది. ఇలా రెండు ముక్కలనూ మార్చి మార్చి తింటూ తింటూ పిట్టలకు రొట్టె అనేదే మిగలకుండా అంతా పిల్లే మింగేసింది. ఈ కథ ఆధారంగానే ‘పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింద’నే సామెత వాడుకలో ఉంది. అంటే... అది పిట్టలకు దక్కాల్సిన రొట్టె. అమాయకపు పిట్టలు ఒకదాంతో ఒకటి కొట్లాడాయి. దక్కిందాన్ని హాయిగా పంచుకొని తినకుండా గిల్లికజ్జాలకు దిగితే అటు గిల్లీ, ఇటు గిల్లీ తినేసే పిల్లులు మధ్యన దూరతాయంటూ చెప్పే నీతి కథ ఇది.
కానీ ఇప్పుడిదో కొత్త కథ. తాజాగా జరుగుతున్న కథ...
కిందటి సారి... అప్పటి పిల్లి సరిగా న్యాయం చెప్పలేదంటూ ఈసారి ఓ కోతి బయల్దేరింది. అన్నట్టు ఈ కోతి గతంలో పిల్లికి బాగా దగ్గరి ఫ్రెండు. పిల్లి సరిగా న్యాయం చేసేలా నాదీ పూచి అంటూ చెప్పిన ఈ కోతి... కొన్నాళ్లు పిల్లి మీద తెగ శివాలూగింది. నీ తరఫున జనాలకు హామీ పడినందుకే నిన్ను నేను నిలదీస్తున్నానంటూ రంకెలేసింది. ఈసారి స్వయంగా నేనే న్యాయం చేస్తానంటూ రొట్టెను తన చేతిలోకి తీసుకుంది. ఇదిగో ఈ ముక్క నీదంటూ కాస్త తుంపి ఒకరికి ఇచ్చింది. ఛీ...ఛీ... ఇది చిన్న ముక్క నీకిది వద్దంటూ మళ్లీ ఆ ముక్కనే లాక్కుని, మరో ముక్క ఇచ్చింది. మళ్లీ ఇది బాగా లేదంటూ ఆ ముక్కను తీసుకొని ఇంకో ముక్క చేతిలో పెట్టింది. ఏతావాతా చివరకు తేలిందేమిటంటే... కోతి తాను కూడా తినకుండా కేవలం 75 ముక్కలే తన చేతిలోకి తీసుకుంటూ, ఆ ముక్కలన్నింటితో సహా మొత్తం 175 రొట్టెల్నీ తాను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న పిల్లికి ఇవ్వబోతోందని ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతోంది. పెడబొబ్బలన్నీ బయటకే అనీ, పెత్తనం పిల్లి చేతికేనని అందరికీ అర్థమవుతూనే ఉంది.
మరిప్పుడు అమాయకపు పిట్టల గతేమిటో, కోతి చేతిలో కొంత రొట్టె ఇవ్వడం ద్వారా మళ్లీ అంతా పిల్లికే దక్కేలా చేస్తున్న ఈ వ్యవహారంలో అమాయకపు ఆంధ్రప్రదేశారణ్యంలోని పిచ్చుకలు ఏమవుతాయో అన్న అందోళన ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఈ కోతిని గుడ్డిగా నమ్మాయి కొన్ని ఎర్రబాతులు. ఏం జరుగుతోందన్నది ఇప్పుడు ఎర్రబాతులకూ ఎరికలోకి వచ్చింది.
అన్నట్టు ఈ మర్కట చేష్టలు మామూలుగా లేవు. కోతి అన్నాక కొమ్మచ్చులాడాలి కదా. మొన్నటిదాకా నివాసం ఉంటున్న చెట్టు... అదో విషవృక్షమనీ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు తానున్న చెట్టే కల్పతరువంటోంది. అవతలి విషవృక్షం మీద వాలిన పిట్టల్ని, ఆ చెట్టు విషపూరితం చేసేసి చంపేస్తోందంటూ శోకాలు పెడుతోంది. మరి ఇప్పటిదాకా ఆ చెట్టుమీదే అది బతికింది కదా. ఇప్పటికీ ఇంకా ఆ చెట్టు మీదే తన పెద్దన్న, చిన్నన్న, తన ఇతర కుటుంబసభ్యులూ, తమ సమస్త బంధుగణసంతతంతా నివాసం ఉంటోంది కదా. అటువంటప్పుడు ఆ విషం వాళ్ల మీద ఎందుకు పనిచేయడం లేదంటూ ఎవ్వరూ తనను అడగరనుకుంటోందో ఏమోగానీ... ఇప్పుడది అక్షరాలా కల్లు తాగిన కోతిలాగే గంతులేస్తోంది.
కోతి పుండు బ్రహ్మరాక్షసి అని సామెత. దీనికి అసలు అర్థం వేరే. కోతికి పుండైతేనే అది దానిపాలిట బ్రహ్మరాక్షసి అయ్యేలా గిల్లుకుంటుందని. కానీ ఇప్పుడు కోతి తన పాలిటి పుండైన బ్రహ్మరాక్షసిని రాష్ట్రాల మీదా, లోకం మీదా వదులుతోంది. అలా అది పిచ్చుకలూ, పిట్టలూ, గోరింక పిట్టలూ, గోరమైనాలూ, చిలకలూ, చిన్ని పక్షులూ, కొంగలూ, కాకులూ, లేళ్లూ, జింకలూ, బట్టమేకలూ ఇలా సమస్త అమాయకపు అడవి ప్రాణులనూ బ్రహ్మరాక్షసి ఆకలికి బలిచేసేలా ఉంది.
అందుకే కోతికొమ్మచ్చులను గ్రహించి... కోతికి కొబ్బరికాయ దక్కనివ్వకూడదు. అది రొట్టెనా, కొబ్బరైనా చెట్టు మీది పక్షుల ఆస్తి, అడవిలోని ప్రాణుల ఆస్తి.ఓటు అనే ఆయుధం ధరించి సామాన్యుడనే ఓ వేటగాడు బయల్దేరాడు. అడవిలో సంచరించి, అక్కడ సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ మంచి వేటగాడిది. కోతిని కట్టడి చేసి, తొలుత దాని పుండై ఆ తర్వాత ఓనరులా మారిన సదరు బ్రహ్మరాక్షసిని మట్టుబెట్టడమే ఇప్పుడు తెలివైన ఆ వేటగాడి కర్తవ్యం.కాబట్టి ఓటాయుధధారులైన ఓ ఓటర్లూ... మీరు వేటాడాల్సిందెవరితో తెలిసింది కదూ! ఎవరికి న్యాయం చేయాలో ఈపాటికి మీకు అర్థమయ్యింది కదూ!!
– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment