‘‘మనకు సిమెంటు, తాపీ, బొచ్చె, పార, గునపం.. నాకివేమీ తెలియదు. అయినా సరే మనం నగరాలు నిర్మించడంలో టాప్‌మోస్ట్ అని పేరు తెచ్చుకున్నాం. ఎలా?’’ కింగ్ సినిమాలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య టైప్‌లో అన్నారు బాబుగారు.‘‘పక్కవాడి ప్లాన్లు దొబ్బేయడం వల్ల.. కులీకుతుబ్‌షా నిర్మించినదాన్ని పట్టుకుని మనమే కట్టామని చెప్పుకోవడం వల్ల’’ జయసూర్య గారి పక్కనే ఉన్న అసిస్టెంట్ మనసులో అనుకున్నట్టుగానే అనుకున్నారు సెక్రటరీలు.
‘‘అప్పట్లో హైదరాబాద్ కడుతున్నప్పుడు కూడా నేనింత కన్ఫ్యూజన్ కాలేదు. కిందటి జన్మలో అప్పట్లో నేనూ, కులీకుతుబ్‌షా ఇద్దరం కలిసి మూసీ పక్కనే ఉన్న చించలం అనే ఊరి దగ్గర సిట్టింగేశాం. కొత్త నగరం ఎలా కట్టాలా అంటూ నాతో చర్చిస్తూ, ప్లాన్‌లు గీస్తూ ఉన్నాడు కుతుబ్‌షా. నీకు తెలుసు కదా. కులీకుతుబ్‌షాకు ఏదీ ఒక పట్టాన నచ్చదు. ఇంతలో నేనేదో ఆలోచిస్తూ చేతిలో ఉన్న గంటంతో అలా పిచ్చి గీతల్లా ఏదో గీసేశాను. దాన్ని చూసిన కులీ ఎలర్టయిపోయి, ఎగిరి గంతేశాడు. ‘బాబూ సార్ వచ్చేసింది.. మన నగరానికి ప్లాన్ వచ్చేసింది’ అంటూ నన్నెత్తుకొని గాల్లో తిప్పేశాడు. అక్కడితో ఆగాడా?. ‘దీనికి ఎవరి పేరు పెడదాం?’ అని అడిగాడు. ‘మళ్లీ వేరే ఇంకెవరి పేరో ఎందుకు సార్. మీ ఆవిడ భాగమతి పేరు ఉంది కదా. మీరు పెళ్లి చేసుకున్నాక ఆమె పేరు హైదర్‌మహల్ అని మార్చారు కదా. ఆమె పేరు పెట్టేద్దాం.. హైదరాబాద్ అని’ అని సలహా ఇచ్చా. ‘అబ్బా నగరం ప్లానూ, దాని పేరూ రెండూ ఒకేసారి వచ్చేశాయి’ అన్నాడు కులీ. అప్పట్లో నా జడ్జిమెంట్‌కు అంత వ్యాల్యూ ఇచ్చేవాడు’’ అని చెప్పుకుంటూ పోతున్నారు బాబు గారు.
కిందటి జన్మ సంగతి సరే.. ఇప్పటి మాటేమిటి అన్నట్టు చూస్తున్నారు సెక్రటరీలందరూ.పక్కనే ఉన్న టోక్యో నగరం ప్లాన్ చూస్తూ.. ప్లాంక్ మీద ఉన్న పేపర్ మీద ఏదో గీశారు బాబుగారు. ‘‘ఇదెలా ఉంది’’ అంటూ మళ్లీ సెక్రటరీలను అడిగారు.
‘‘యాజిటీజ్‌గా ఉంది సార్’’ అన్నాడు ఒక సెక్రటరీ.
‘‘అంటే?..’’ కోపంగా ఏదో అనబోతూ ఉండగానే..
‘‘అంటే అదేమీ లేదు సార్. టోక్యో లాగా ఉంది’’ అంటూ జవాబిచ్చాడు సెక్రటరీ.
‘‘నోర్ముయ్. ఈ ఊరేమిటీ? అక్కడిది షింటో టెంపుల్. ఇక్కడిది దుర్గగుడి. అక్కడివి కిమినోలు. ఇక్కడివి చీరలు’’ అంటూ ఉండగానే సెక్రటరీ మళ్లీ అందుకొని.. ‘అవున్సార్.. అది జపాన్.. మనది ఆంధ్రా. అది వేరే.. మనది వేరే’’ అన్నాడు.
‘‘సరిగ్గా క్యాచ్ చేశావ్. అదేమిటోగానీ మన రాజధాని కట్టడం చాలా నాకు కష్టమైపోతోంది. కజక్‌కు వెళ్తే అక్కడి రాజధాని ఆస్తానా లాగా కట్టాలనిపించింది. కానీ ప్లాన్ వేయబోతుంటేనే ఆస్తమా అంతటి ఆయాసం వచ్చేసింది. ఒక్కోసారి షాంఘైలా, మరోసారి సింగపూర్‌లా, ఇంకోసారి ఇస్తాంబుల్‌లా ఇలా రకరకాలుగా కట్టాలనిపిస్తోంది. కానీ ఇవేవీ కుదరడం లేదు. నాకు కన్ఫ్యూజన్ పెరుగుతోంది. రాజమౌళిని పిలిపించు. మాహిష్మతిలా నిర్మించమని చెబుదాం’’ అంటూ సెక్రటరీని ఆదేశించారు.
‘‘మాహిష్మతిలా కడితే జనం మతిపోవడం ఖాయం’’ అన్నారు సెక్రటరీలందరూ ఒకేసారి.
పొగడ్తో, తెగడ్తో అర్థం కాలేదు. ‘‘సార్.. అవి ఉత్తి గ్రాఫిక్స్ కద్సార్. సినిమాలో అయితే కనిపించే భ్రాంతిలా ఓకేగానీ ఇక్కడ నిజంగా ఏదో ఒకటి కట్టాలి కదా’’ ఒకడు ధైర్యం చేసి చెప్పాడు.
‘‘మరేం చేద్దాం?’’ ఎటూ పాలుపోక అడిగారు.
‘‘మనమెలాగూ.. అసలు ఒరిజినల్ అమరావతికి దూరంగా ఎక్కడో 35 కి.మీ. దూరంలో ఉద్దండరాయునిపాలెం దగ్గర శంకుస్థాపన రాయి వేశాం. మన రాజధాని పేరు అమరావతి అంటూ అక్కడి పేరును ఇక్కడ పెట్టేసి... అదీ ఇదీ ఒకటేనని బుకాయిస్తున్నాం. అయినా మీ విజనే విజను సార్’’ అన్నాడు సెక్రటరీ.
‘‘ఎందుకు నా విజన్‌ను మెచ్చుకుంటున్నావ్’’ అడిగారు బాబుగారు.
‘‘కరిమింగిన వెలగపండు లాగే.. ఇప్పటి రాజధానికి సెక్రటేరియట్ ఉన్న ప్రాంతం పేరు వెలగపూడి కదా. సార్థకనాయధేయంతో ఇంకా కట్టని నగరానికి సెక్రటేరియట్‌ను వెలగపూడిలో కట్టారంటే మీ విజనే విజన్ కదా అని మెచ్చుకుంటున్నాను సార్’’
‘‘ఇంతకూ మన రాజధాని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు నువ్వు’’
‘‘కజక్ రాజధాని మొదటి పేరు ఆస్తానా అనేదాన్ని మార్చి ఇప్పుడు నూర్‌సుల్తాన్ అంటూ పేరు మార్చి పెట్టారట’’.
‘‘అయితే?’’ అడిగారు బాబుగారు.
‘‘ఎలాగూ హైదరాబాద్ కట్టింది కూడా మీరే కదా. అందుకే ఆ నగరం పేరు అమరావతిగా మార్చేశామని జీవో ఇచ్చేద్దాం. తెలంగాణ వాళ్లెలా పిలుచుకున్నా.. ఉమ్మడి రాజధానిగా ఎలాగూ మనకు ఐదేళ్ల టైమ్ ఇంకా మిగిలుంది కాబట్టి మనం మాత్రం దాన్ని అమరావతి అందామని చెబుదాం. ఎలా ఉంది సార్ ఐడియా?’’ అన్నాడు సెక్రటరీ.
‘‘ఇది మన అబ్బాయికి రావాల్సిన ఐడియా కదా. నీకెలా వచ్చింది?’’ అంటూ బాబుగారు అతడి వైపు కొరకొరా చూశారు.– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment