ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఇక పార్టీ టిక్కెట్లు ఆశించేవారి వారి సంఖ్య అంతా ఇంతా కాదు. ఈ ఆశావహుల్ని సంతృప్తిపరచలేక పార్టీ అధినేతల తల నుంచి ప్రాణం తోకలకు వచ్చేస్తుంటుంది.
వాస్తవానికి అధినేతలు పార్టీ టిక్కెట్లను కేటాయించే సమయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. తమ తోకలోని ప్రాణాలతో పాటు కంటే ఆశావహుల తోకలనూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఎందుకంటే.. ఒకవేళ ఎవడైనా బలమైన ఆశావహుడికి టిక్కెట్ దక్కలేదనుకో.. వాడు తోక ఝాడించేస్తాడు. వెంటనే హైజంపూ, లాంగ్‌జంపూ ఏకకాలంలో చేస్తాడు.
అలా ఎగిరిన మనవాడి అంగ పడేది ప్రత్యర్థి శిబిరంలోనే. అందుకే ఇలాంటి వాళ్లను బుజ్జగించలేక అధినేతల ప్రాణం మళ్లీ తలల నుంచి తోకలకు వచ్చేస్తుంటుంది. ఆల్రెడీ ఒక ప్రాణం తోకలోకి వచ్చాక మళ్లీ మరో ప్రాణం ఎలా వస్తుందని అడక్కూడదు. మనలాంటి సాదాసీదా మనుషులకు ఇలాంటి సందేహాలు వస్తాయనే... ప్రాణాల సంఖ్య ఐదనీ, వాటిని పంచప్రాణాలనీ అంటారని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పేశారు.
టిక్కెట్టు ఆశించే పెద్దలంతా చిన్నపిల్లల్లా అలుగుతారు కదా. అప్పుడు అధినేతలు పెద్దవాళ్లలా ప్రవర్తిస్తారు. చిన్నపిల్లల విషయంలో పెద్దవాళ్లు చేసే పనులన్నీ చేసేస్తుంటారు.
‘‘మా బుజ్జికదూ.. మా చిన్ని కదూ.. ఆఫ్ట్రాల్ ఈ టిక్కెట్టులో ఏముంది. చూస్తూ ఉండు. నిన్ను ఇంతకంటే ‘పెద్ద’సభకు పంపిస్తా’’ అంటూ బుజ్జగిస్తుంటారు. ఇలా ఈ సీజన్‌లో అధినేతలంతా జోలపాడటం, ఆశపెట్టడం, దువ్వుతూ ఉండటం లాంటి పనులతోనూ బిజీగా ఉంటారు.
ఇలా ఈ సీజన్‌లో మేం రాజకీయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అధినేతల మీద బోల్డంత జాలిపడుతూ ఇదే విషయాన్ని మా రాంబాబు గాడికి చెప్పా.
‘‘ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా.. పాపం అధినేతలందరి ఉమ్మడి సమస్యరా ఇది. ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ టిక్కెట్లు ఎలా పంచుకొస్తారో చూడాలి’’ అన్నాన్నేను.
‘‘ఇది అధినేతలందరికీ ఉన్న సమస్యే అయితే దీనికి పరిష్కారం చాలా ఈజీరా’’ అన్నాడు మా రాంబాబుగాడు.
‘‘చాలా పార్టీలకు సీట్లు తగ్గేది ఈ సమస్యతోనే. ఎవడో అసంతృప్త నేత ఇండిపెండెంటుగా పోటీ చేస్తాడు. అసలు అభ్యర్థి గెలుపునకు గండి కొడతాడు. అంత ఈజీ అంటున్నావ్. ఎలాగో చెప్పు?’’ నేనడిగా.
‘‘సింపుల్‌రా... ఎంతమంది టిక్కెట్ ఆశిస్తున్నారో ఆ అందరికీ టిక్కెట్లు ఇచ్చేయాలి. అంటే సదరు పార్టీ గుర్తుపై ఈ ఆశావహులంతా ఉమ్మడిగా పోటీ చేస్తారన్నమాట. ప్రతి పార్టీ కూడా ఇలా ఎంత మంది ఆశిస్తున్నారో అంతమందికీ ఇచ్చేయాలి. మనమెలాగూ ఓటేసేటప్పుడు పార్టీ గుర్తుకు ఓటేయడంతో పాటు... అభ్యర్థికీ ఓటెయ్యాలన్నమాట. ఇలా ఏ పార్టీకి ఎక్కువ ఓట్లొస్తాయో... ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలిచినట్టు. అలాగే ఒకే పార్టీ నుంచి చాలామంది ఆశావహులు నిలబడ్డారు కదా. వాళ్లందరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో వాడే అసలైన పార్టీ అభ్యర్థి అన్నమాట. చూడు. ఇలా ఎంతమందినైనా సంతృప్తిపరచవచ్చు. చూశావా! మనసుండాలే గానీ మార్గం ఉంటుంది’’ అన్నాడు వాడు.
అధినేతలకే సంక్లిష్టమైన సమస్యకు వాడింత సింపుల్‌గా పరిష్కారం చెప్పడంతో వాడి (అతి)తెలివితేటలకు నోరెళ్లబెట్టి చూస్తూ... ‘‘నువ్వు చెప్పిన ప్రకారం టిక్కెట్లిస్తే... ఆ బ్యాలెట్ పేపర్ తయారు చేయడానికి పేపర్ పరిశ్రమలన్నీ సరిపోవురా. అలాగ్గనక ఇస్తే నియోజకవర్గం నియోజకవర్గమంతా పోటీ చేసేస్తుంది. తెల్సా...’’ అంటూ కూకలేశాను.
Comments
Please login to add a commentAdd a comment