
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని తన జాగీరు అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, నదుల అనుసం ధానంలో భాగంగా 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటుచేసిందన్నారు.
నదుల అనుసంధానంతో గోదావరి నది నుంచి తెలంగాణకు 30 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని, రాష్ట్రానికి రావాల్సిన 247 టీఎంసీలు కిందకు పోతాయన్నారు. అనుసంధానంపై నిపుణుల్లో చాలా అనుమానాలు, సందేహాలు ఉన్నాయని తెలిపారు. వీటిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం– నాగార్జున సాగర్ టేల్‌పాండ్‌ను రద్దు చేయడం వల్ల కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టును పాలేరుకు కలపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం రీడిజైన్‌పై సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం నోరెందుకు మెదపడంలేదని ప్రశ్నించారు.