టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గౌడ్
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు కరీంనగర్ జిల్లా ప్రజలు ఎందుకు రావాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ప్రగతి నివేదనపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగంగా చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ సభ పెడితే కాంగ్రెస్ నాయకుల లాగులు తడుస్తాయంటున్న నేతల మాటలను ఉటంకిస్తూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం చూస్తుంటే ఎవరి లాగులు తడుస్తున్నాయో అర్థమవుతోందని పొన్నం ఎద్దేవా చేశారు. జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పరిస్థితిలో ప్రగతి నివేదన సభకు జిల్లా ప్రజలు వెళ్లాల్సిన అవసరేమేముందన్నారు.
ప్రగతి నివేదన ఎవరికోసం?
ప్రగతి నివేదన సభ పెడుతోంది ప్రజల కోసమా లేదా బస్సులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసమా అంటూ పొన్నం ఎద్దేవా చేశారు. రైతుబంధు బీమా అమల్లోకి వచ్చిన నాటి నుంచి 15 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 541 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రైతుల కోసం పనిచేస్తున్నామంటూ చెప్పుకొనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. సగటున రోజుకు 31 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలంటూ పొన్నం డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment