సమావేశంలో మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రొటోకాల్ వివాదం శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ సమావేశంలో చిచ్చుకు దారితీసింది. ఈ విషయమై మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌ డ్, సంపత్‌కుమార్‌ల నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. జెడ్పీ అతిథి గృహం పునఃప్రారంభోత్సవం విషయమై స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు సమాచారం ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఇటీవల మరమ్మతులు చేసిన జెడ్పీ అతిథి గృహాన్ని శుక్రవారం ప్రారంభించారు.
స్థానిక ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఎందుకివ్వలేదని, ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యే చేత ఎలా ప్రారంభోత్సవం చేయిస్తారంటూ జెడ్పీ సమావేశం లో శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్, జడ్చర్లలో గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ చేత ప్రారంభోత్సవం చేయిస్తే ఊరుకుంటా రా అంటూ మండిపడ్డారు. గంటసేపు వివా దం సాగడంతో బండారి భాస్కర్ కలుగజేసు కుని అనుకోకుండా రిబ్బన్ కట్ చేయాల్సి వచ్చిందని, అధికారిక ప్రారంభోత్సవం కాదని కొబ్బరికాయ కూడా కొట్టలేదంటూ చెప్పుకొచ్చారు. మంత్రులిద్దరూ భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
నన్నెందుకు అవమానిస్తారు: సంపత్
ఈ విషయమై ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇద్దరు మంత్రులు నాకు బలవంతంగా కత్తెర ఇచ్చి రిబ్బన్ కట్ చేయించి, తీరా ఇప్పుడేమో బోగస్ ఓపెనింగ్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం. మంత్రులే స్వయంగా బోగస్ ఓపెనింగ్ చేయించి నన్ను అవమాన పరుస్తారా? నాకు అవమానం కలిగిస్తే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా’ అంటూ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment