సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా అవినీతి జరుగుతోందని బీజేపీ నేతలు పురందేశ్వరి, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ప్రభుత్వం బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మట్లాడుతూ.. కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగానే నవయుగ పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ నవయుగ సంస్థను ఢిల్లీ పిలిపించి నితిన్ గడ్కరీ చేసిన ఒత్తిడి గురించి రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను సహించేదిలేదని పురందేశ్వరి హెచ్చరించారు.
టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం : విష్ణుకుమార్ రాజు
బీజేపీతో కలిసి ఓట్లు అడిగిన టీడీపీ లాభం పొందినప్పటికీ స్వప్రయోజనాల కోసం మధ్యలోనే దోస్తీకి కటీఫ్ చెప్పిన ఘనత చంద్రబాబుదేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రత్యేక హోదాపై మాట మార్చారంటూ బీజేపీని విమర్శిస్తున్న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న భూకుంభకోణాలపై సిట్ నివేదిక బయటపెట్టాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. పట్టిసీమలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంపుసెట్ల విషయంలో 60 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఒక్క క్యూబిక్ మట్టికి 21 వేల రూపాయలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన విష్ణుకుమార్ రాజు 69 కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. పెన్షనర్లను బెదిరించి మరీ నవనిర్మాణ దీక్షలకు తీసుకొచ్చారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment