
పటాన్: గుజరాత్ మోడల్ అభివృద్ధి, క్రోనీ కేపిటలిజం (సన్నిహితులైన కార్పొరేట్లకు మేలుచేసేలా) పై రాహుల్ గాంధీ చేస్తున్న దుష్ప్రచారంపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. పేదరికాన్ని చూడని వారంతా తనపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. పటాన్‌లో సోమవారం జరిగిన ప్రచారంలో మోదీ మాట్లాడుతూ.. ‘ఒకసారి ఏదైనా విమర్శ చేస్తే తప్పు అనుకోవచ్చు. మరోసారి అదేమాటన్నా క్షమించొచ్చు. మూడోసారి అంటే రాజకీయ విమర్శ అనుకోవచ్చు. కానీ రెండు నెలలుగా పదే పదే ఒకే విమర్శ చేస్తున్నావు.
అందరూ మూర్ఖులనుకుంటున్నావా? అసత్యాలను ప్రచారం చేస్తున్నావ్’ అని రాహుల్‌పై మండిపడ్డారు. రైతుల భూమిని లాక్కొని టాటాలు, అంబానీల వంటి కార్పొరేట్ పెద్దలకు కట్టబెడుతున్నారని రాహుల్ ప్రస్తావిస్తున్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘నేను అంబానీల పిల్లల చదువుల కోసం యత్నిస్తున్నానా? లేక సామాన్యుడి కూతుళ్లకు చదువుకోసం అడుగుతున్నానా? 45 డిగ్రీల ఎండలో గ్రామగ్రామాన తిరిగి ఆడపిల్లలను స్కూలుకు పంపా లని తల్లిదండ్రులను బతిమాలుకున్నా. పుట్టుకతోనే సంపన్నుడికి ఈ బాధలేం తెలుసు’ అని అన్నారు.