సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నయవంచక పాలనను అంతమొందించే లక్ష్యంతో 2003లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి రాష్ట్రంలో సుస్థిర పాలన అందించిన మాదిరిగానే నేడు మరోసారి చంద్రబాబు ప్రజాకంటక పాలనకు తెరదించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రతో చరిత్ర పునరావృతం కానుందని ప్రజలంతా భావిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, స్టేట్ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం పేర్కొన్నారు. గురువారం ఆయన విశాఖలోని పార్టీ కార్యాలయంలో ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర విశేషాలను విలేకరులకు వివరించారు.
ప్రతి అడుగూ సంచలనమే
గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌కు దశా దిశను నిర్దేశించేలా అప్రతిహతంగా సాగుతోందని తలశిల చెప్పారు. తొమ్మిదేళ్లుగా వైఎస్ జగన్ సాగిస్తున్న ప్రజా పోరాటాలు ఒక ఎత్తయితే.. ఈ ప్రజా సంకల్ప యాత్ర మరో ఎత్తన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగుతున్న ఈ పాదయాత్రలో ప్రతి అడుగు ఓ సంచలనమేనన్నారు.
పాదయాత్రలో జనవాహినితో కృష్ణా బ్యారేజ్ కంపించిందని, గోదావరి బ్రిడ్జి కిక్కిరిసిపోయిందని, విశాఖ తీరం పోటెత్తిందని చెప్పారు. చరిత్రను తిరగరాసేలా సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వద్ద 1,000 కిలోమీటర్లు, ఏలూరు వద్ద 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటగా ఈ నెల 24న విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనుందని తెలిపారు.
జగన్ పాదయాత్ర చూసే బాబు నిర్ణయాలు
సీఎం చంద్రబాబు ప్రతి నిర్ణయాన్ని జగన్ పాదయాత్ర డిసైడ్ చేస్తోందని తలశిల రఘురాం పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర వల్లే హోదాపై బాబు యూటర్న్ తీసుకున్నారని, అంగన్‌వాడీలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచారని, ఆశా వర్కర్ల గౌరవవేతనం పెంచారని, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేశారని, 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ వేశారని, బీసీలకు ఆదరణ పథకం, హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచారని.. ఇవన్నీ జగన్ చేసిన డిమాండ్లేనని గుర్తు చేశారు.
తొమ్మిదేళ్లుగా జనంలోనే జగన్
జగన్ పాదయాత్ర ఇంకా రెండు జిల్లాలు మిగిలి ఉండగానే మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిందంటే ప్రజలు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని తలశిల తెలిపారు. పాదయాత్రలో జగన్‌కు లభిస్తున్న జనాదరణ బహుశా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లభించిన దాఖలాలు లేవన్నారు. ఎక్కడైనా ఓ నాయకుడ్ని ఒకరోజు చూస్తారు. రెండ్రోజులు చూస్తారు అంతేకానీ ఎప్పుడూ వెన్నంటే ఉండరని, కానీ తొమ్మిదేళ్లుగా జగన్ ప్రజల్లో ఉన్నప్పటికీ ఏరోజూ, ఎక్కడా జనాదరణ తగ్గకపోవడం గొప్ప విషయమన్నారు. పాదయాత్రలో జననేతను చూసేందుకు ఊళ్లకు ఊళ్లు, నగరాలకు నగరాలు కదిలి వస్తుండడం పట్ల పార్టీ నేతలుగా గర్విస్తున్నామన్నారు.
కుట్రలపై కల్లాపి నీళ్లు
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజాసంక్షేమ పాలనకు మించి అందించాలన్న పవిత్రమైన లక్ష్యంతో జగన్ పాదయాత్ర చేస్తున్నారని తలశిల చెప్పారు. పాదయాత్రలో పలు చోట్ల టీడీపీ నేతలు విచ్ఛిన్నానికి కుట్రలు చేశారని, కొన్ని చోట్ల పసుపునీళ్లు చల్లారని, మరికొన్ని చోట్ల ఆంక్షలు విధించినా తమ పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేశారన్నారు.
టీడీపీ నేతలు పసుపు నీళ్లు చల్లితే వారి అవినీతిపై ప్రజలే కల్లాపి నీళ్లు చల్లి బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 2019లో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ సర్కార్ ఏర్పడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని తలశిల తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు తైనాల విజయ్‌కుమార్, రవి రెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, వై.అర్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశపాత్రునిపాలెం వద్ద 3 వేల కిలోమీటర్ల మైలురాయి
ఈనెల 24వతేదీన విజయనగరంలో అడుగు పెట్టబోతున్న ప్రజాసంకల్పయాత్ర ఎస్.కోట మండలం దేశపాత్రునిపాలెం వద్ద మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతుందని, ఈ అరుదైన ఘట్టానికి గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన పైలాన్‌ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తారని తలశిల తెలిపారు. ఈ సందర్భంగా దేశపాత్రునిపాలెం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు 115 నియోజకవర్గాల పరిధిలో 193 మండలాలు, 1650 గ్రామాలు, 44 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్ల మీదుగా జగన్ పాదయాత్ర సాగిందన్నారు. 106 బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారని, 41 చోట్ల వివిధ సామాజిక వర్గాలతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. జగన్ దారి పొడవునా లక్షలాది మందిని నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుని తమ ప్రభుత్వం వస్తే ఎలా మేలు చేస్తుందో వివరిస్తూ భరోసా నింపారన్నారు. పాదయాత్రలో అందే విజ్ఞాపనలను తీసుకోవడానికే పరిమితం కాకుండా పరిష్కారం కోసం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పాదయాత్ర ఓ పరిష్కారాన్ని చూపిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment