విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మున్సిపల్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో రాహూల్‌గాంధీకి కొండపల్లి బొమ్మను బహుకరిస్తున్న నాయకులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/ అమరావతి/గన్నవరం : ‘ఆంధ్రప్రదేశ్ బాధలను అర్థం చేసుకున్నాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని విశ్వసిస్తున్నాను. 2014 ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని మోదీ చెప్పారు. హోదా ఇవ్వడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం ఇస్తామన్నారు. కానీ, ఆయన ఏదీ చేయలేకపోయారు. ఒక ప్రధాని ఇచ్చిన హామీ అమలు జరిగి తీరాలి. కాంగ్రెస్ ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం’.. అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంతోపాటు విజయవాడలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఐదేళ్లలో నరేంద్ర మోదీ చాలా కష్టపడ్డారు. దేశాన్ని రెండుగా విభజించారు. నీరవ్ మోదీ, అంబానీ, విజయ్‌మాల్యాల కోసం ఒక భారత్ ఏర్పాటుచేశారు. సామాన్య యువకులు, మహిళలు, రైతులను మరో పేద దేశంగా విభజించారు. కానీ, ఇలాంటి రెండు రకాల దేశాలను చూసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. తిరిగి ఒకే దేశాన్ని నిర్మించడమే లక్ష్యం’.. అన్నారు.
‘న్యాయ్’తో పేదల రాతను మారుస్తాం
‘మేం ‘న్యాయ్’ అనే పేరుతో ఒక పథకం తీసుకొస్తున్నాం. దీంతో కోట్లాది మందికి ఆర్థిక తోడ్పాటు జరుగుతుంది. నెలకు రూ.12వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న 5 కోట్ల మంది పేదవారిని ఎంపికచేసి ఏటా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.72వేలు వేస్తాం. ఇతర దేశాల మీద యుద్ధం ఎలా ప్రకటిస్తామో ‘న్యాయ్’ ద్వారా పేదరికంపై కూడా యుద్ధం చేస్తాం.. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం. మన దేశానికి సంబంధించి రాఫెల్ డీల్‌లో అంబానీతో కలిసి రూ.35వేల కోట్లు మోదీ దోచేశారు. దేశానికి తాను కాపలాదారు అని ప్రధాని అన్నారు. రూ.35వేల కోట్లు దోపిడీ చేసే వారిని కాపలాదారుడంటారా? కాపలాదారు పేరు చెప్పుకుని ప్రధాని దొంగలకు దోచిపెడుతున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ సొమ్మును పేదలకు పంచుతుంది’.. అని రాహుల్ భరోసా ఇచ్చారు.
రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం
‘కేంద్ర ప్రభుత్వ సాయం లేక రైతులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యనే మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రుణమాఫీ చేశాం. మా హయాంలోనే ఆహార భద్రత హక్కును తెచ్చాం. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేశాం. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతాం. భూ సేకరణ చట్టం ద్వారా గిరిజనులు, దళితుల భూముల కోసం పేదలకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా చట్టం తెస్తే.. వాటికి తూట్లు పొడుస్తూ ఆయా వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను గెలిపించండి, ఆ మూడు రాష్ట్రాల్లోలాగే ఇక్కడా రెండ్రోజుల్లో రైతుల రుణాలు పూర్తిగా మాఫీచేస్తాం. ఇక్కడ 640 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయానికి దన్నుగా నిలుస్తాం. మోదీ రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేశారు. ఈ చర్యతో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. ఎక్కడా ఉద్యోగ అవకాశాల్లేవు. కానీ, ప్రతీ యువకునికి ఉపాధి ఉండాలనేది కాంగ్రెస్ లక్ష్యం. కోటీశ్వరులు మాత్రమే వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంది. మేం అధికారంలోకి వస్తే అతి సామాన్య యువత కూడా ఏ అనుమతుల్లేకుండానే మూడేళ్లు వ్యాపారాలు చేసుకునేలా చట్టం తీసుకొస్తాం. మోదీ రిజర్వ్ బ్యాంకు తాళాలను నీరవ్ మోదీ, అంబానీ చేతికి ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ తాళాలు సామాన్యుల చేతికి ఇవ్వబోతున్నాం’.. అని రాహుల్ హామీ ఇచ్చారు.
సామాన్యులకూ విలువైన విద్య అందిస్తాం
‘లక్షలాది స్కూళ్లు, వేలాది కాలేజీలు ఈ ఐదేళ్లలో మూతపడ్డాయి. అది రాజ్యాంగంపై జరిగిన దాడి అని చెబుతున్నా. అందుకోసమే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని ఆలోచిస్తున్నాం. మనకు వచ్చే ఆదాయంలో ఆరు శాతం విద్యాలయాలయాలకు ఖర్చు పెడతాం. నేను ప్రధాని అయితే వాల్మీకులను ఎస్టీలుగా, వడ్డెరలను ఎస్సీలుగా మారుస్తా. అదే విధంగా దళితుల వర్గీకరణ సమస్యనూ సామరస్యంగా పరిష్కారిస్తాం. సురక్షిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది’.. అని రాహుల్‌గాంధీ అన్నారు. అంతకుముందు, విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో రాహుల్‌గాంధీకి ఉదయం 11గంటలకు పార్టీ నేతలు ఉమెన్‌చాందీ, కేవీపీ, రఘువీరారెడ్డి, జేడీ శీలం తదితరులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment