
న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా ముడుపుల కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ వ్యవహరంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె సోదరుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చిదంబరానికి మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ట్విట్ చేసిన రాహుల్.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను ఉపయోగించి చిదంబరం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతియడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతకు ముందు చిదంబరానికి మద్దతుగా స్పందించిన ప్రియాంక.. ‘రాజకీయ విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి చిదంబరం. కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలపై ఆయన మాట్లాడినందుకు కుట్రపూరితంగా కేసుల్లో ఇరికేంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్య ఇది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చిదంబరంపై ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో చిదంబరం అరెస్ట్‌కు అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే చిదంబరం తన నివాసం వద్ద లేకపోవడంతో.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడని అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై చిదంబరానికి సుప్రీం కోర్టులో కూడా ఎదురుదెబ్బే తగిలింది. చిదంబరం తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ జస్టిస్ ఎన్వీ రమణ ముందుకు రావడంతో.. ఆయన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందుకెళ్లాలని సూచించారు. అయితే చీఫ్ జస్టిస్ అయోధ్య కేసుతో బిజీగా ఉండటంతో.. ఆయన అపాయింట్‌మెంట్ కోసం కపిల్ సిబల్ బృందం ఎదురుచూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment