సాక్షి, హైదరాబాద్: ‘అమ్మా.. ఎలా ఉన్నారు... తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడి తెచ్చుకున్నారు కదా... మీరెలా ఉన్నారు.. సంతోషంగా ఎందుకు లేరు?’అని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన గిరిజన మహిళను ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం ఇక్కడి హరిత ప్లాజా నుంచి పార్టీ కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు, మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లతో నిర్వహించిన ఈ టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డితోపాటు శక్తి యాప్ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే టి.రామ్మోహనరెడ్డి, టీపీసీసీ ఐటీ విభాగం చైర్మన్ ఎర్రబెల్లి మదన్‌మోహన్, హర్కర వేణుగోపాల్‌లు పాల్గొన్నారు.
టెలికాన్ఫరెన్స్‌లో భాగంగా జుక్కల్, డోర్నకల్, కామారెడ్డి, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన ఐదుగురు బూత్ కమిటీ అధ్యక్షులతో రాహుల్ మాట్లాడారు. డోర్నకల్‌కు చెందిన మహిళను ప్రశ్నించగా తాము సంతోషంగా లేమని బదులిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు ఇంటికొకటి కాదు కదా... ఊరికొకటి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా అని ఆమెను రాహుల్ అడగ్గా మంజూరైందని చెబుతున్నారు కానీ ఇంతవరకు రాలేదని చెప్పారు. మరో బూత్ కమిటీ అధ్యక్షుడితో మాట్లాడుతూ రాష్ట్రంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు ఎలా ఉందని, ప్రత్యక్ష జీవనంపై జీఎస్టీ ఎలాంటి ప్రభావం చూపుతోందని రాహుల్ అడిగారు.
ఈ సందర్భంగా జుక్కల్‌కు చెందిన ఓ నేత మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని చెబుతున్నా అది వడ్డీలకే సరిపోయిందని రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు. టీపీసీసీ నేతలు చెబుతున్నట్లుగా రూ. 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించాలని కోరారు. అందరి మాటలు విన్న రాహుల్... కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజలందరికీ కార్యకర్తలు చెప్పాలని, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
‘చార్మ్స్’భేష్...
టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో సంభాషించే ‘చార్మ్స్’కార్యక్రమం బాగుందని రాహుల్ అభినందించారు. 4జీ టెక్నాలజీ సాయంతో ఏకకాలంలో వేలాది మందితో నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్‌పై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని టీపీసీసీ నేతలకు చెప్పారు. ‘చార్మ్స్’ను జాతీయ స్థాయిలో అమలు చేద్దామని, ఢిల్లీకి రావాలని ఐటీ విభాగం చైర్మన్ కె. మదన్‌మోహన్‌కు సూచించారు. శక్తి యాప్ ద్వారా ఇప్పటికే 2 లక్షల మంది సభ్యులను చేర్చడంపై కూడా హర్షం వ్యక్తం చేసిన రాహుల్...ఈ నెల 18న శక్తి యాప్‌పై ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. కాగా, రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో బూత్ కమిటీల ఏర్పాటు, బలోపేతం దిశగా టీపీసీసీ నిర్వహిస్తున్న లీడర్‌షిప్ మిషన్ ఇన్ రిజర్వ్‌డ్ కాన్‌స్టిట్యుయెన్సీస్ (ఎల్‌డీఎంఆర్‌సీ) తీరు గురించి ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా రాహుల్‌కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment