
ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీకి భంగపాటు తప్పదన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌తో పాటు సోనియా గాంధీ వారి నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతారని పేర్కొంది. రాహుల్, సోనియాలపై వారి నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీ వరుసగా అమేథి, రాయ్‌బరేలి స్ధానాల నుంచి ఓడిపోతారని బీజేపీ ప్రతినిధి అనిల్ బలూనీ అన్నారు. వారు తమ నియోజకవర్గాల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. కాగా, విపక్షాలు ఏకమవుతున్న క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురవడమే కాకుండా, స్వయంగా ప్రధాని మోదీ వారణాసిలో ఓటమిపాలవుతారని రాహుల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయని రాహుల్ చెప్పుకొచ్చారు.