
బీజేపీ ఒకసారి, కాంగ్రెస్ మరోసారి.. వరుసగా ఒకే పార్టీ రెండు సార్లు గెలిచిందీ లేదు.. మూడో పార్టీకి చోటూ లేదు. ప్రతీ ఎన్నికల్లో అధికార పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెడుతున్నాడు రాజస్తాన్ ఓటరు. గత 20 ఏళ్లుగా ఇదే తీరు. మరి ఈసారి ఏం జరగబోతోంది? ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆ సంప్రదాయాన్ని తోసిరాజంటారా? లేక అదే పునరావృతం కానుందా?
– సాక్షి, నాలెడ్జ్ సెంటర్
ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభ పరిస్థితులు, రాజ్‌పుట్‌లు వంటి ప్రధాన సామాజికవర్గంలో అసంతృప్తి సెగలతో అధికార బీజేపీ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతే.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాల్ని నమోదు చేసుకున్న కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల సంగ్రామంలో దూసుకుపోతోంది. రాజస్తాన్ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2013 ఎన్నికల్లో ఏకంగా 163 సీట్లను సాధించి చరిత్ర సృష్టించిన బీజేపీ గ్రాఫ్.. ఈ అయిదేళ్లలో అంతే వేగంగా కిందకి పడిపోయింది. ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఎవరికీ అందుబాటులో ఉండరన్న విమర్శలు.. మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు తలబిరుసుతో వ్యవహరిస్తారన్న ఆరోపణలు.. పార్టీలో అంతర్గత పోరుతో బీజేపీ చతికిలపడిపోయింది. గడచిన కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి ప్రజలకు కనీస వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడంతో చాలా వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనే లబ్ధి పొందడం కోసం సీపీఐ(ఎం)తో పాటు ఇతర ఏడు చిన్న పార్టీలు రాజస్తాన్ లోక్‌తాంత్రిక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) పేరిట పోటీ చేయడానికి సిద్ధంకాగా, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 200 స్థానాల్లోనూ పోటీకి దిగుతానని ప్రకటించింది.
సర్వేలు ఏం చెబుతున్నాయ్?
రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ పుట్టి ముంచుతుందని సర్వేలన్నీ అంచనా వేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలిచే రాష్ట్రం రాజస్తానేనని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఏబీపీ న్యూస్–సీ ఓటరు సర్వేలో కాంగ్రెస్ పార్టీ 50 శాతం ఓటు షేరుతో 142 స్థానాలను గెలుచుకొని తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని వెల్లడైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అంచనాలు రోజురోజుకీ మారిపోతూ ఉంటే రాజస్తాన్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీయే నెగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి.
బీజేపీ దిద్దుబాటు చర్యలు
ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతోందని, ముఖ్యమంత్రి వ్యవహారశైలి సొంత పార్టీలో అసమ్మతిని రాజేసిందని బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రాజెకు అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్నామిని తొలగించి, ఆయన స్థానంలో ఓబీసీ నాయకుడు మదన్‌లాల్ సైనీని నియమించింది. బీజేపీకి గుడ్‌బై చెప్పి ఎన్‌పీపీకి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కిరోడి లాల్ మీనాను తిరిగి పార్టీలోకి ఆహ్వానించింది. తూర్పు రాజస్తాన్ గిరిజన ప్రాంతాల్లో మీనాకు మంచి పట్టుంది. ముఖ్యమంత్రి వసుంధరా రాజె కూడా ప్రజల్లో, పార్టీ కేడర్‌లో తన పట్ల పెల్లుబుకుతున్న అసమ్మతి తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించారు. గత రెండు నెలలుగా కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతటా తిరుగుతున్నారు. రాజస్తాన్ గౌరవ యాత్రల్ని మొదలుపెట్టారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వృత్తి నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు, విద్యార్థినులకు స్కూటర్ల పంపిణీ, అన్నపూర్ణ భండార్లు ఏర్పాటు వంటి పేరు తెచ్చిన పథకాలను ఎన్నికల ర్యాలీలలో పదే పదే ప్రస్తావిస్తున్నారు.
వంద మంది సిట్టింగ్‌లకు నో చాన్స్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజస్తాన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 5 సార్లు రాష్ట్రంలో పర్యటించారు. వంద నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు కా దని కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. అభ్యర్థి కాదు.. గుర్తు ముఖ్యమంటూ కార్యకర్తలకు సంకేతాలు పంపుతున్నారు.
ఉప ఎన్నికల విజయంతో కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం
గత ఫిబ్రవరిలో అల్వార్, అజ్మీర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మండల్‌గఢ్ అసెంబ్లీ స్థానంలోనూ హస్తానిదే హవా. ఈ లోక్‌సభ పరిధిలో 16 అసెంబ్లీ స్థానాలున్నాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాషాయానికి కంచుకోట వంటి ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ యువనేత, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్‌ను ముందుంచి రాజకీయాన్ని నడుపుతోంది. బీజేపీ గౌరవ యాత్రలకు కౌంటర్‌గా సంకల్ప్ ర్యాలీలు మొదలుపెట్టింది. మేరా బూత్, మేరా గౌరవ్ అంటూ బూత్ స్థాయి నుంచి ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టింది. అశోక్ గెహ్లాట్, సీపీ జోషి, సచిన్ పైలట్‌లు ఊరూవాడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అవి బయటకు కనిపించకుండా ఎవరికి వారు తమ సత్తా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో సచిన్ దూకుడుగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టడమే కాదు, బీజేపీ చేసిందేమీ లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కనీసం 50 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
మానవేంద్ర సింగ్ రాజ్‌పుట్ ఓట్లను ఆకర్షిస్తారా?
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జశ్వంత్‌సింగ్ కుమారుడు, పార్టీ తిరుగుబాటు నాయకుడు మానవేంద్రసింగ్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది. రాజ్‌పుట్ నాయకుడైన మానవేంద్రసింగ్ పోటీ చేసే ప్రాంతం బర్మార్–జైసల్మీర్‌లో కనీసం 26 స్థానాలో రాజ్‌పుట్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇప్పుడు వారి ఓట్లను మానవేంద్రసింగ్ ఎంతవరకు లాగుతారన్నది చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు
నిరుద్యోగం
గత ఎన్నికల్లో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. ఈ నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. దీంతో గత ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు వేసి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టిన నిరుద్యోగ యువత ఆ పార్టీకి దూరమయ్యారు. దాదాపు లక్షమంది నిరుద్యోగులు సభ్యులుగా ఉన్న రాజస్తాన్ బెరోజ్గార్ ఎకిక్రాత్ మహాసంఘ్ రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ ముక్త రాజస్తాన్ అని నినదిస్తోంది.
విభజన రాజకీయాలు
ఇటీవల కాలంలో రాజస్తాన్‌లో హేయమైన దాడులు పెరిగిపోయాయి. గోవధ నిషేధానంతరం జరిగిన దాడులు, మత అసహన పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా మారాయి. ఉప ఎన్నికల సందర్భంలో బీజేపీ నేత జశ్వంత్ యాదవ్ మీరు హిందూ అయితే బీజేపీకి ఓటెయ్యండి, ముస్లింలు కాంగ్రెస్ వెంట నడవండి అంటూ వ్యాఖ్యానించడం, మరో బీజేపీ ఎమ్మెల్యే బన్వారి లాల్ సింఘాల్ దేశంలో హిందూ జనాభాని తగ్గించి దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికే ముస్లింలు ఎడాపెడా పిల్లల్ని కంటున్నారంటూ వివాదాస్పదమైన ఫేస్‌బుక్ పోస్టింగు రాష్ట్రంలో ఒక విభజన రేఖను గీశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర జనాభాలో 9 శాతం ఉన్న ముస్లిం ఓట్లు అత్యంత కీలకంగా మారాయి.
గ్రామీణ సంక్షోభం
రాజస్తాన్‌లో 75.13% మంది గ్రామాల్లో నివసిస్తారు. ఇక్కడ అంతా తీవ్రమైన సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. రుణమాఫీ అమలు కాకపోవడం, పంటలకు గిట్టుబాటు ధరలేకపోవడం వంటి సమస్యలతో గత ఏడాదిగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. సికార్‌లో జరిగిన రైతు ఆందోళనతో దిగొచ్చిన సర్కార్ రూ.50వేల వరకు రుణమాఫీని అమలు చేసినప్పటికీ, అన్నదాతల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరని ప్రకటించేంతవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టంచేశారు.
కుల సమీకరణాలు
రాజస్తాన్‌లో కుల రాజకీయాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సామాజికవర్గానిది పైచేయిగా ఉంది. ఉత్తర రాజస్తాన్‌లో జాట్లు, దక్షిణాదిన గుజ్జార్, మీనాలు, పశ్చిమంలో రాజ్‌పుట్లు, మధ్య ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. వీరందరిలో మెజార్టీ ఎవరి వెంట నడిస్తే ఆ పార్టీయే గెలవడం ఖాయం. ఈసారి ఎన్నికల్లో గుజ్జార్ వెర్సస్ మీనాలు, రాజ్‌పుట్స్ వెర్సస్ జాట్లుగా పోరు నడుస్తోంది. జోధ్‌పూర్‌లోని సమరూ గ్రామంలో రాజ్‌పుట్ల ఇళ్లను జాట్లు లూటీ చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజ్‌పుట్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాజ్‌పుట్ గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ ఎన్‌కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌పుట్ సామాజిక వర్గానికి చెందిన గజేంద్ర సింగ్ షెకావత్‌కు అవకాశం ఇవ్వకుండా వసుంధరా రాజె అడ్డుపడటం వంటి చర్యలతో వారు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న రాజ్‌పుట్ ఓట్లు అత్యంత కీలకంగా మారి ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment