
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాదిని మించినోడని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా మేసేస్తున్న చంద్రబాబు ముఠాను సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థను డబ్బుమయం చేసిన ఆయన క్షమార్హుడు కాదని, సుజనాచౌదరి లాంటి ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు అండ అని మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆర్థిక నేరస్తుల అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఆర్థిక నేరగాళ్లను వెంటబెట్టుకుని చంద్రబాబు నీతులు వల్లిస్తున్నారన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటే.. వాటిని సుజానా చౌదరి వంటి ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయన్నారు. పెదబాబు, చినబాబులు రాష్ట్రాన్ని సొంత జాగీరుగా పాలిస్తూ రాజకీయ వ్యవస్థను అవినీతిమయం చేశారన్నారు.
2017లోనే రూ.7,346 కోట్లు ఎగవేత..
2017 మార్చి నాటికే సుజనాచౌదరి బ్యాంకులకు రూ.7,346 కోట్ల మేర ఎగవేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఒక ప్రకటనలో తెలిపిందని, అది వడ్డీతో కలిపి ఇప్పుడు రూ.8,500 కోట్లకు చేరిందన్నారు. 120 షెల్ కంపెనీలతో సుజానా ఈ అవినీతికి పాల్పడ్డారని రామచంద్రయ్య వివరించారు. బ్యాంకుల నుంచి కొట్టేసిన వేల కోట్లను చంద్రబాబు ఆస్తులు పెంచడానికి, ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగించి ఉండొచ్చన్నారు. సుజనాచౌదరి ఒక పనిముట్టు మాత్రమేనని, అసలుసిసలు లబ్ధిదారుడు చంద్రబాబేనన్నారు. బాబు అండతో సుజనాచౌదరి డీఆర్‌ఐ సహా అనేక సంస్థలను, వ్యవస్థలను మోసగించారన్నారు. మంత్రి కాకమునుపే సుజనాపై కేసులున్నాయని, క్విడ్‌ప్రోకోగా సుజనాకు బాబు కేబినెట్ పదవి ఇప్పించారన్నారు.
అగ్రిగోల్డ్‌పై సాక్ష్యాలిచ్చినా చర్యల్లేవు
అగ్రిగోల్డ్ భూముల్ని ఓ మంత్రి భార్య కొనుగోలు చేసినా చర్యలు శూన్యమని, స్వయంగా డాక్యుమెంట్లు ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖ భూ కుంభకోణంలో మరో మంత్రి ఉంటే.. తూతూమంత్రంగా సిట్ వేసి క్లీన్‌చిట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అమరావతి భూములను కారుచౌకగా టీడీపీ నేతలు కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులను సీఎం రమేష్‌కు ఇవ్వడం అనైతికమన్నారు. ఏ మాత్రం నెట్‌వర్త్ లేని కంపెనీలకు బ్యాంకులు రుణాలెలా ఇచ్చాయని ప్రశ్నించారు. ఈడీలో తన మనుషులను పెట్టుకుని జగన్‌పై కుట్రకు పాల్పడ్డారని.. ఇప్పుడు ఈడీ భ్రష్టు పట్టిందని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్యాంకులను మేనేజ్ చేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. ఆయన నేరాలు బయటపడకూడదనే రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటున్నారని.. అందుకు జీవోలు ఇవ్వడం పిచ్చిపనిగా ఆయన అభివర్ణించారు. కాగా, తనపై విమర్శలు వచ్చినప్పుడల్లా చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను వాడుతున్నారన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే పవన్ మాట్లాడుతున్నారని.. బాబుకు ఆయన ఓ పనిముట్టుగా ఉపయోగపడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాజ్యసభ నుంచి తొలగించాలి..
వ్యవస్థీకృత నేరానికి పాల్పడినందుకు సుజనాచౌదరిని రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అంతకుముందే.. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలక ముందే, డిపాజిటర్లకు అన్యాయం జరక్కముందే చంద్రబాబు మనుషుల నుంచి ప్రతి రూపాయిని కక్కించాలన్నారు. పార్టీకి ఆర్థికంగా సాయం చేసేవాళ్లు అవసరమని ఆర్థిక వనరులు సమకూరుస్తున్న సుజనాచౌదరికి కేబినెట్ పదవి ఇవ్వడం న్యాయమే అంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఈ సందర్భంగా రామచంద్రయ్య గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment