సీఎం సీటే బాబుకు స్పెషల్‌ స్టేటస్‌ | Ramachandraiah comments on Chandrababu about Special status | Sakshi
Sakshi News home page

సీఎం సీటే బాబుకు స్పెషల్‌ స్టేటస్‌

Published Wed, Feb 13 2019 5:01 AM | Last Updated on Wed, Feb 13 2019 5:01 AM

Ramachandraiah comments on Chandrababu about Special status - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు సీఎం పదవినే ప్రత్యేక హోదా అనుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య ఎద్దేశా చేశారు. చంద్రబాబు తన కుమా రుడు లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టడమే స్పెషల్‌ స్టేటస్‌ అని భావిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పోలీసులు అరెస్టు చేయకపోవడమే బాబుకు ఓ ప్రత్యేక హోదా అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం, చంద్రబాబు ఆస్తులు, అవినీతిపై విచారణ జరపకపోవడమే ఆయనకు ఇచ్చిన ప్రత్యేక హోదా అని చెప్పారు. వైఎస్సార్‌ సీపీకి మాత్రం పెట్టుబడులతో వచ్చే ఉద్యోగాల విప్లవమే ప్రత్యేక హోదా అని, దాన్నే కోరుకుంటున్నామని తేల్చి చెప్పారు. సి.రామచంద్రయ్య మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లా డారు. ధర్మపోరాటాల పేరుతో ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దిగజారిన టీడీపీ ఉనికి కోసం రూ.10 కోట్ల ప్రజాధనం వాడుకోవడం దారు ణమని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని, అవినీతి కేసుల్లో జైలుకెళ్లడం తథ్యమని స్పష్టం చేశారు. సి.రామచంద్రయ్య ఇంకా ఏం మాట్లాడారంటే... 

‘‘ఢిల్లీలో చంద్రబాబు చేసిన దీక్ష పాత సినిమాల్లో కొయ్యగుర్రంపై స్వారీని గుర్తుచేస్తోంది. పార్టీ కోసం చేపట్టే కార్యక్రమానికి ఎన్టీఆర్‌ ట్రస్టు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి తప్ప రాష్ట్ర ఖజానా నుంచి లూటీ చేయడం దారుణం. బాబు డ్రామా దీక్షలకు వాడిన సొమ్ముతో కరువు సీమను కాస్తో కూస్తో ఆదుకోవచ్చు.  గతంలోనూ ఇలాంటి హైడ్రామాలను నడి పినా, ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన రోజులున్నాయి.  

బాబులో పూర్తిగా కాంగ్రెస్‌ రక్తం 
చంద్రబాబు ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి గా పనిచేస్తున్నారు. తనలో 30 శాతం కాంగ్రెస్‌ రక్తం ఉందని గతంలో చెప్పాడు. ఇప్పుడు పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ రక్తాన్ని ఎక్కించుకున్నాడు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ పార్టీలో టీడీపీ విలీనమైనా ఆశ్చర్యం లేదు. తన కుటుంబాన్ని తిట్టిన చంద్రబాబుతో దోస్తీ కట్టడానికి రాహూల్‌గాంధీకి అసలు పౌరుషం ఉందా? చంద్రబాబు అవినీతి, అక్రమాలపై ఇదే కాంగ్రెస్‌ పార్టీ పుస్తకాల రూపంలో ఛార్జిషీటు వేసింది. ఇలాంటి అవినీతిపరుడితో రాహుల్‌గాంధీ రాజీపడటానికి కారణమేంటి? 

దోచుకోవడానికే ప్యాకేజీకి ఒప్పుకున్నాడు 
ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని కోరుకుంది చంద్రబాబే. ప్యాకేజీ తీసుకుంటే దోచుకునే వెసులుబాటు ఉంటుందనే దానికి ఒప్పుకున్నాడు. కమీషన్ల రూపంలో దోచుకోవడానికి ప్యాకేజీ అడిగాడు.  ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు పదేళ్లు గడువు ఉన్నప్పటికీ హైదరాబాద్‌ నుంచి పారిపోయాడు.  

బాబుకు పచ్చమీడియా వంతపాడుతోంది 
అధర్మమైన వ్యక్తి ఇప్పుడు ధర్మపోరాటం చేయడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు అరాచకాల గురించి ‘కాగ్‌’, మీడియా ఎప్పుడో చెప్పింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక ప్రజలు చంద్రబాబును తరిమేయాలనే నిర్ణయించుకున్నారు. ఇవన్నీ తెలిసి మోదీపై యుద్ధమంటూ డ్రామాలాడుతున్నాడు. దానికి పచ్చమీడియా ఆహా ఓహో అంటూ వంతపాడుతోంది.

అవసరమైతే కోర్టులో సవాల్‌ చేస్తాం.. 
ముంపు మండలాలను కలిపేందుకు పట్టుబట్టానని చెప్పుకునే చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఎందుకు పట్టుబట్టలేదు? 2016 సెప్టెంబర్‌ 8న ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతూ దొంగచాటుగా ప్రత్యేక ప్యాకేజీ ఒప్పందం చేసుకున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీకి మాత్రమే తెలిసేలా రహస్య ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదు. ఒకటి రెండు ఎంపీ సీట్లు కూడా దక్కవు. ధర్మపోరాట దీక్షల కోసం చంద్రబాబు వెచ్చిస్తున్న ప్రజాధనం లెక్కలపై అవసరమైతే న్యాయస్థానంలో సవాల్‌ చేస్తాం’’ అని సి.రామచంద్రయ్య ఉద్ఘాటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement