ఆదివారం విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్‌దాస్ అఠవాలే
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో కలసి రావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర సామాజికన్యాయ, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అఠవాలే సూచించారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ప్లాజా హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు మరింత ముందుకు సాగాలంటే కేంద్ర మద్దతు అవసరమని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు అండగా నిలిచిందని, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఏన్డీయేదేనన్నారు.
మోదీ ప్రభుత్వం ముస్లింలు, ఇతర మైనార్టీలకు వ్యతిరేకమనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. అంచనాలకు మించిన ప్రజాతీర్పుతో అద్భుత విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాభినందనలు తెలుపుతున్నట్లు అఠవాలే అన్నారు. బేగంపేట పర్యాటకభవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం అనేక సంక్లిష్టతలతో కూడిన వ్యవహారమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment