సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ఆఖరి ఏడో విడత పోలింగ్ ఆదివారం (మే 19న) జరుగుతుంది. ఆ రోజు సాయంత్రానికి అన్ని విడతల పోలింగ్‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతుంటాయి. అధికారికంగా మే 23 తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్న విషయం తెల్సిందే. ఏయే రాష్ట్రాల్లో ఏ పార్జీది పైచేయి అవుతుందన్న దాన్ని పరిశీలించడం ద్వారా తుది ఫలితాలపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
1. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 42 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే ప్రాబల్యం
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 సీట్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
3. ఒడిశాలో 21 సీట్లు, నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతా దళ్
4. తెలంగాణలో 17 సీట్లు, టీఆర్‌ఎస్ ప్రాబల్యం
వీటన్నింటిని కలిపితే 105 సీట్లు. వీటిలో కాంగ్రెస్‌కుగానీ, భారతీయ జనతా పార్టీకిగానీ పెద్దగా సీట్లు రావు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాబల్య ప్రాంతాల నాయకులు కాంగ్రెస్‌కుగానీ, బీజేపీకిగాని మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. బెంగాల్, ఒడిశాలో బీజేపీ ఆశించిన విజయాలను సాధిస్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు ఉండదు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ, ఎస్పీ కూటమి, కేరళలో కమ్యూనిస్టులు ప్రాథమిక అంచనాల ప్రకారం మెజారిటీ సీట్లను సాధిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 130, 140 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు దిశ నిర్దేశించే అవకాశం ఉండదు. మిత్రపక్షాల డిమాండ్లకే తలొగ్గాల్సి వస్తుంది. బీజేపీకి కూడా దాదాపు అలాంటి పరిస్థితే వస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే కీలక పాత్ర వహించాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే ఆయన పలు ప్రాంతీయ, అలీన పార్టీల నాయకులతోనే కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ మిత్రపక్షమైన జనతాదళ్ (సెక్యులర్), తమిళనాడులోని డీఎంకే నాయకులతో కూడా చర్చలు జరిపారు. అవసరమైతే ఆ పార్టీలను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లాక్కురావచ్చనే ఉద్దేశం కావచ్చు.
1996–98 నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం నాటి పరిస్థితి వస్తుందని, అలా అయితే తానే చక్రం తిప్పవచ్చనే ఆలోచన కేసీఆర్‌కు ఉండి ఉంటుంది. నాడు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డీ దేవెగౌడకు నాడు కాంగ్రెస్ పార్టీ విధిలేక మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆ ప్రభుత్వం రెండేళ్లకు మించి అధికారంలో నిలదొక్కుకోలేక పోయింది. అయితే పార్టీల్లోని అంతర్గత వైషమ్యాల కారణంగానే నాటి ప్రభుత్వం పడిపోయింది. ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీ యేతర ప్రభుత్వాలకే మద్దతు తెలుపుతుంటాయి. బీజేపీకి 220 సీట్లకు పైగా వస్తే తప్పా ఆ పార్టీ కూడా మిత్ర పక్షాలను డిక్టేట్ చేసే పరిస్థితుల్లో ఉండదు. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా హందాగా, ఎక్కువ అభివృద్ధి గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈసారి వ్యక్తిగత దూషణలకు దిగడం చూస్తుంటే బీజేపీకి మెజారిటీ సీట్లు రావని అర్థం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment