సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఈసారి కూడా ఉత్తరాది రాష్ట్రాలే ప్రధాన పాత్ర వహిస్తాయని, దక్షిణాదిలో ఎప్పటిలాగే మిశ్రమ ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు ముందుగా అంచనావేశారు. వారి అంచనాలకు కొంచెం అటుఇటుగా దక్షిణాది కర్ణాటకలో బీజేపీ దూసుకుపోతుండగా, తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే దూసుకుపోతోంది. తమిళనాడులో 38 సీట్లకు గాను 22 సీట్లలో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే తమిళనాడులోని 22 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరుగ్గా పాలకపక్ష ఏఐఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య హోరాహోరా పోరు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎం. కరుణానిధిలు మరణించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం వల్లన కూడా హోరా హోరి పోరు జరుగుతుండవచ్చు. కర్ణాటకలో జరిగిన గత ఎన్నికల్లో బీజేపీకి 17 సీట్లురాగా, ఈసారి 20 సీట్లకుపైగా గెలుచుకునే దిశగా బీజేపీ ముందుకు దూసుకుపోతోంది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దూసుకుపోతోంది. తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. అక్కడ 25 సీట్లకుగాను వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లకు పోటీ చేయగా, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనా పార్టీ 18 సీట్లకు పోటీ చేసింది. మొత్తం 25 సీట్లలోనూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇతర పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ముందుగా ఊహించినట్లే మొత్తం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మినహా మరెక్కడా బీజేపీ హవా కనిపించడంలేదు. ప్రస్తుతం కేరళలో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment