హరియాణాలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం
లోక్‌సభ ఫలితాలతో జోరు మీదున్న కాంగ్రెస్
అధికార బీజేపీకి సవాలు విసురుతున్న వైనం
బలహీనపడిన జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీ
వాటికి పడే ఓట్లు ఎవరి పుట్టి ముంచేనో!
అధికార బీజేపీ. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్. వీటికి తోడు ఐఎన్‌ఎల్‌డీ, జేజేపీ, బీఎస్పీ. ఇలా నానా పార్టీలతో కిక్కిరిసిపోయిన హరియాణా రాజకీయ రంగస్థలంపై ఆసక్తికరమైన అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెర లేచింది. ఎన్ని పార్టీలున్నా రాష్ట్రంలో ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటూ వస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి షాకే ఇచ్చింది.
2019లో రాష్ట్రంలో మొత్తం పదికి పది లోక్‌సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకోగా ఈసారి వాటిలో సగానికి సగం ‘హస్త’గతమయ్యాయి. ఆ ఊపుతో రెట్టించిన ఉత్సాహంతో కని్పస్తున్న కాంగ్రెస్‌ను నిలువరించడం కమలనాథులకు అగి్నపరీక్షే కానుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు రెండు ప్రధానపార్టీల్లో ఎవరి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది...
కురుక్షేత్రయుద్ధం
2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణా ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడింది. 90 అసెంబ్లీ సీట్లకు గాను 40 స్థానాలతో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లున్న జేజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం రాష్ట్రంలో ఓటరు తీర్పు స్పష్టంగానే ఉండనుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ‘‘బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు అద్దంపట్టాయి. ఆ పార్టీకి ఓట్ల శాతం భారీగా తగ్గింది’’ అని వారంటున్నారు.
ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), బీఎస్పీ వంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి పుట్టి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంతో పోలిస్తే ఆ పార్టీలు బాగా బలహీనపడ్డా వాటికి పడే ఓట్లు అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకం కానున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మూడు పార్టీలతో పాటు స్వతంత్రులు కాంగ్రెస్ ఓటుబ్యాంకునే చీల్చి తమను ఒడ్డున పడేస్తారని బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది. దానికి తోడు ఎప్పట్లాగే జాటేతర ఓట్లన్నీ తమకే పడతాయంటోంది. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో జాతీయాంశాలు, మోదీ ఫ్యాక్టర్ వంటివేవీ లేవు గనుక బీజేపీ ఓటు బ్యాంకుకు మరింత భారీగా గండి పడటం ఖాయమని చెబుతోంది.
ముళ్లబాటలో బీజేపీ...
2014లో హరియాణాలో సొంతంగా అధికారం సాధించిన బీజేపీ, 2019లో జేజేపీ పొత్తుతో దాన్ని నిలుపుకుంది. ఈసారి మాత్రం ఆ పార్టీకి పరిస్థితి ముళ్లబాటనే తలపిస్తోంది. జాటేతర ఓట్లన్నీ గుండుగుత్తగా పడటం రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల వికాసానికి ప్రధాన కారణంగా నిలిచింది. దాంతో మనోహర్‌లాల్ ఖట్టర్ రూపంలో జాటేతర నేతను బీజేపీ సీఎంను చేసింది. ఆయన తొమ్మిదేళ్లకు పైగా పదవిలో కొనసాగారు.
రైతు ఆందోళనలు, గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న సవాలు నేపథ్యంలో గత మార్చిలో నాయబ్‌సింగ్ సైనీ రూపంలో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేసింది. ఈ ఎత్తుగడ లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా కలిసి రాకున్నా ఏకంగా 35 శాతమున్న ఓబీసీ ఓట్లను ఒడిసిపట్టే లక్ష్యంతో సైనీ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. అగ్ర కులాల, పట్టణ ఓటర్లపై పట్టును నిలుపుకునేందుకూ బీజేపీ ప్రయతి్నస్తోంది. వారికి వరుసగా తాయిలాలు ప్రకటిస్తోంది. బ్రాహ్మణుడైన మోహన్‌లాల్ బదోలీ రూపంలో ఇప్పటికే అగ్రవర్ణ నేతను రాష్ట్ర పార్టీకి అధ్యక్షున్ని చేసింది. ప్రచార దూకుడూ పెంచనుంది.
అడ్వాంటేజ్ కాంగ్రెస్, కానీ...!
ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపీందర్ హుడా, ఆయన కుమారుడు దీపీందర్, పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్, సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా మొత్తం 90 అసెంబ్లీ స్థానాల పరిధిలోనూ కలియదిరుగుతున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే భూపీందర్, సెల్జా వర్గాల కుమ్ములాటలు పార్టీని కలవరపెట్టే అంశం. ఈ ఇంటి పోరును ఏ మేరకు కట్టడి చేస్తుందన్న దానిపైనే కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నది రాజకీయ వర్గాల అంచనా.
ప్రాంతీయ పార్టీలన్నీ కుదేలే...
జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీ రెండూ కొన్నేళ్లుగా ఆదరణ కోల్పోతూ వస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 26 శాతమున్న జాట్లే వాటి ప్రధాన బలం. వారు ఇటీవల కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. రైతుల ఆందోళనలు తారస్థాయిలో ఉన్న వేళ బీజేపీకి కొమ్ముకాయడం జేజేపీకి భారీగా చేటు చేసింది. జాట్లు పూర్తిగా దూరమయ్యారు. జేజేపీ ఓటు బ్యాంకుకు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గండికొట్టింది. ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్‌ఎల్‌డీదీ ఇదే పరిస్థితి. నేతల కీచులాటలు పార్టీని బాగా కుంగదీస్తున్నాయి. బీఎస్పీతో గతంలో పెట్టుకున్న పొత్తు దారుణంగా వికటించిన అనుభవం మరింత భయపెడుతోంది.
ఆప్ పరిస్థితీ అంతంతే...
పంజాబ్‌ను చేజిక్కించుకున్న ఊపులో హరియాణాలోనూ పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్న సంకేతాలు కని్పంచడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టి పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను దూరం పెట్టి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది!
జేజేపీ... కకావికలైన కింగ్‌మేకర్
జననాయక్ జనతా పార్టీ (జేజేపీ). 2018 డిసెంబర్లో హరియాణా రాజకీయ యవనికపై పుట్టుకొచ్చిన కొత్త పార్టీ. చౌతాలా కుటుంబంలో కుమ్ములాటల ఫలితంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) నుంచి వేరుపడి దుష్యంత్ చౌతాలా ఏర్పాటు చేసుకున్న జేజేపీ 2019లో తొలిసారి అసెంబ్లీ బరిలో దిగింది. 10 సీట్లే గెలిచినా హంగ్ ఏర్పడటంతో కింగ్‌మేకర్‌గా మారింది. కానీ ఐదేళ్లు తిరిగేసరికి నానా ఎదురుదెబ్బలతో బాగా బలహీనపడింది. 2021 రైతు ఆందోళన సమయంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించకపోవడం జేజేపీకి చెప్పలేనంత చేటు చేసింది.
అనంతరం రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 19 చోట్ల బరిలో దిగి బీజేపీకి పూర్తిగా దూరమైంది. దీనికి తోడు అసమ్మతి, ఫిరాయింపులతో దుష్యంత్ చౌతాలాకు తల బొప్పి కడుతోంది. గత ఏప్రిల్లో జేజేపీ రాష్ట్ర చీఫ్ నిషాన్‌సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే బీజేపీకి జైకొట్టారు. దుష్యంత్ తండ్రి అభయ్ చౌతాలాకు అత్యంత నమ్మకస్తునిగా మెలిగిన ఎమ్మెల్యే అనూప్ ధనక్ శుక్రవారం పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దాంతో ఇప్పుడు పార్టీలో దుష్యంత్, ఆయన తల్లి, మరో ఎమ్మెల్యే మాత్రం మిగిలారు. ఈ నేపథ్యంలో పునరై్వభవం దేవుడెరుగు, పార్టీ పుట్టి మునగకుండా చూసుకోవడమే దుష్యంత్‌కు పెను సవాలుగా మారింది.
కాంగ్రెస్‌కు కలిసొచి్చన జాట్, రైతు, దళిత ఓట్లు
రాష్ట్రంలో నిర్ణాయక శక్తి అయిన జాట్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గారు. వారికి తోడు రైతు, దళిత ఓట్లు కూడా ఆ పార్టీకే భారీగా పడ్డాయి. 90 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 42 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించినట్టు ఓటింగ్ సరళి తేలి్చంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా చుట్టడం తెలిసిందే. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దానికి 30 స్థానాలకు మించలేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment