సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆమె ప్రకటన చేశారు. గురువారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరి ప్రకటన చేశారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇతరులకు ఇస్తారంటూ లీకులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఈసారి టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగనే అభిప్రాయంలో ఉన్నారు. మరోవైపు ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని కార్యకర్తలు కూడా రేణుకా చౌదరిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి ఇటీవలి డీసీసీ అధ్యక్షులు నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని రేణుకాచౌదరి నివాసంలో జరిగిన సమావేశానికి ఖమ్మం కార్యకర్తలతో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ తదితరులు హాజరయ్యారు.
కాగా ఇటీవలి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో సానుకూల ఫలితాలు లభించడంతో ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దాంతో ఖమ్మం పార్లమెంట్ సీటుపై పార్టీ అధిష్టానం ఆచితూచి స్పందిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని అనేక మంది ముఖ్య నేతలు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక రేణుకా చౌదరి తాజా ప్రకటన...కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసినట్లు అయింది.
Comments
Please login to add a commentAdd a comment