సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి అసమ్మతి నేత రేవంత్‌రెడ్డి సైతం హాజరుకావడం గమనార్హం. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై ప్రధానంగా చర్చించేందుకు ఈ భేటీ జరుగుతోంది. రేవంత్ తాజా కదలికలు, ఆరోపణలు టీడీపీలో కలవరం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై జరుగుతున్న సమావేశానికి రేవంత్ సైతం హాజరవ్వడం ఆసక్తి రేపుతోంది. అనూహ్యంగా ఈ భేటీకి రేవంత్ హాజరుకావడంతో తెలంగాణ టీడీపీ నేతలు కంగుతిన్నారని తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ నేతలు రేవంత్ వ్యతిరేకులే ఉండటం గమనార్హం.
పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జరుగుతున్నఈ భేటీలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి ఉదయమే ఎన్టీఆర్ భవన్‌కు వచ్చివెళ్లారని, తాను కూడా పొలిట్‌బ్యూరో సభ్యుడు కావడంతో ఈ భేటీకి హాజరుకానున్నట్టు ఆయన సమాచారం అందించారని పార్టీ వర్గాలు ఇంతకుమునుపు తెలిపాయి. రేవంత్‌రెడ్డి పార్టీ మార్పు అంశమే ఈ సమావేశానికి ప్రధాన అజెండా అని సమాచారం. ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డి హాజరైన నేపథ్యంలో.. పార్టీ మార్పుపై ఆయనను వివరణ అడిగే అవకాశముందని తెలుస్తోంది.
కాంగ్రెస్ గూటికి ఖాయమా?
ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వంతో భేటీ కావడం, అనంతరం ఏపీ టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలను గమనిస్తే.. రేవంత్ రెడ్డి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నదని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో ఇంకా ఎవరెవరు పార్టీని వీడబోతున్నారన్న చర్చ టీటీడీపీలో జరుగుతోంది. కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కూడా రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా అదే బాటలో ఉన్నారని తెలిసింది.
భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్ మారే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దాదాపు తెలంగాణ టీడీపీ ఖాళీ అయినట్లే అని బలమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి వంటి నేతలే పార్టీలో మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment